Mouth Taping Sleep | నోరు మూసుకొని పడుకోండి!
19 April 2022, 23:12 IST
- నోరు మూసుకొని పడుకోండి. నిద్ర బాగా పడుతుంది. అవును మీరు చూస్తుంది నిజమే, పూర్తిగా తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.
Mouth Taping Sleep Method
ఒకసారి మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి. ఈ వేసవి కాలంలో అందరూ కలిసి డాబాపైన పడుకునేవారు. తాతయ్యలు, అమ్మమ్మలు ఉంటే వాళ్లు కథలు చెప్పేవారు. అన్నాదమ్ములు, అక్కాచెల్లెల్లు ఏవేవో కబుర్లు చెప్పుకునేవాళ్లు. ఇంతలో అమ్మగానీ, నాన్నగానీ 'నోర్మూసుకొని పడుకోండి' అని మందలించేవారు గుర్తొచ్చిందా?
ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే.. ఇలా నోరు మూసుకొని పడుకుంటే ఎన్నో లాభాలున్నాయని పలు అధ్యయనాలు తేల్చాయి. దీనిని 'మౌత్ ట్యాపింగ్ స్లీప్' అని పిలుస్తున్నారు. కొన్నిదేశాలలో నిద్రకు సంబంధించిన ఈ విధానం ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉంది.
నోరు మూసుకొని పడుకోవడం ద్వారా కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటంటే మీరు నోటితో కాకుండా ముక్కుతోనే శ్వాస పీల్చుకుంటారు. నోటి ద్వారా శ్వాస పీల్చుకోవడం ద్వారా నిద్రలో నాణ్యత తగ్గుతుంది. రాత్రి తిన్న ఆహరం పళ్ల సందుల్లో ఇరుక్కొని ఉండవచ్చు. ఈ క్రమంలో నోటి ద్వారా గాలి పీల్చుకోవడం ద్వారా బాక్టీరియా, ఫంగై లాంటివి చేరి దంతక్షయం, నోరు పొడిబారడం, నోటి దుర్వాసన మొదలగు నోటి సమస్యలు తలెత్తుతాయి. నోరు కట్టేసుకోవడం ద్వారా ఈ సమస్యలు ఉండవు. అంతేకాకుండా గురక సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు.
ఆయుర్వేదంలో కూడా ఈ విధానంలో నిద్రపోవడం ద్వారా పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు ప్రస్తావించడం జరిగిందని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు. మధ్యమధ్యలో నిద్ర నుంచి మెలకువ రావడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయని అంటున్నారు.
ఈ పద్ధతిని ప్రయత్నించడానికి ఆసక్తి ఉంటే కొన్ని చిట్కాలు
- నోరు మూసుకోడానికి ముందుగా సరైన టేప్‌ను ఎంచుకోవాలి. సౌకర్యంగా ఉండేది చూసుకోవాలి. సర్జికల్ టేప్ కూడా ఉపయోగించవచ్చు. ఆన్‌లైన్‌లోనూ ఈ తరహా స్లీపింగ్ టేపులు దొరుకుతున్నాయి.
- టేప్ అతికించుకునే ముందు పెదాలకు వాసెలిన్ రాయండి, గట్టిగా అతుక్కోదు. తీయటానికి వీలుంటుంది.
- మీసాలు ఉంటే మీసాలకు తగిలేలా టేప్ అతికించుకోకూడదు.
- నోటిని పూర్తిగా కప్పుకోవడం గురించి మీకు భయంగా అనిపిస్తే, పై పెదవి నుంచి కొంత ఖాళీ వదలండి. అలాగే కొద్దిగా నోటి నుంచి గాలి ఆడేలా చూసుకోండి.
అంతే, ఇంకేం చూస్తున్నారు? ఇక నోరు మూసుకొని పడుకోండి.
టాపిక్