తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bathe During A Thunderstorm | వర్షంలో స్నానం చేయడం సురక్షితమేనా?

Bathe During a Thunderstorm | వర్షంలో స్నానం చేయడం సురక్షితమేనా?

Manda Vikas HT Telugu

14 June 2022, 16:24 IST

    • ఇప్పట్నించి కొన్ని నెలల పాటు వర్షాకాలం సీజన్ కొనసాగుతుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో స్నానం చేయడం సురక్షితమేనా? తెలుసుకోండి.
Monsoon Tips - Shower bath
Monsoon Tips - Shower bath (Unsplash )

Monsoon Tips - Shower bath

ప్రతి ఒక్కరి వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి ప్రతిరోజూ స్నానం చేయడం ఎంతో ముఖ్యం. వీలైతే రోజుకి రెండు సార్లు స్నానం చేస్తే మరీ మంచిది. శరీరంపై ఉండే మురికి, మృతకణాలు, చెమట శుభ్రం అవుతాయి. ఎలాంటి చర్మ సమస్యలు తలెత్తవు. అంతేకాకుండా స్నానం చేయడం ద్వారా మనసు తేలికైనట్లుగా అనిపిస్తుంది. మీకు రిఫ్రెషింగ్ అనుభూతిని కలిగిస్తుంది.

అయితే ఇప్పుడు వర్షాకాలం మొదలవుతుంది. సీజన్ ను బట్టి మనకు సంబంధించిన కొన్ని అలవాట్లలోనూ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వర్షాకాలంలో వాతావరణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కోసారి కుండపోత వర్షం కురవవచ్చు లేదా గాలిదుమారం చెలరేగవచ్చు అలాగే ఉరుములు-మెరుపులు కూడిన భారీ వర్షంతో పిడుగుపాట్లకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఉరుములు-మెరుపులతో కూడిన వర్షం పడేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

పిడుగుపాటు అనేది ఉరుముల మెరుపుల వర్షం పడేటపుడు సంభవించే ఒక భారీ విద్యుత్ స్పార్క్. అయితే ఇలాంటి సమయంలో స్నానం చేయడం రిస్కుతో కూడుకున్న వ్యవహారం అని నిపుణులు చెబుతున్నారు.

దాదాపు ఇప్పుడు ప్రతి ఇంటికి 'ఎర్తింగ్' అనేది ఇస్తున్నారు కాబట్టి విద్యుత్ ఘాతాలను నివారించవచ్చు. పిడుగుపాటు సంభవించే సమయంలోనూ ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రమాదం ఉండబోదు. అయినప్పటికీ కొన్ని కార్యకలాపాల కారణంగా విద్యుత్ ఘాతానికి గురయ్యే అవకాశం కొట్టిపారయ్యలేమని చెబుతున్నారు. ఉరుములు, మెరుపుల వర్షం కురిసేటపుడు వేటిని నివారించాలో సూచించారు.

షవర్ స్నానం 

ఉరుములతో కూడిన వర్షం కురిసే సమయంలో షవర్ కింద స్నానం చేయడం సురక్షితం కాదు. అసలు ఇలాంటి సమయంలో స్నానాలు వాయిదా వేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. బాత్ రూంలలో నీటి కుళాయిలకు అనుసంధానం చేసిన ప్లంబింగ్ ద్వారా మెరుపులు ప్రయాణించవచ్చు. లోహంతో తయారయ్యే ఈ పైపుల ద్వారా విద్యుత్ ఘాతానికి గురయ్యే ఆస్కారం ఎక్కువ అని నిపుణులు పేర్కొన్నారు.

టబ్ స్నానం

ఇప్పుడు చాలామంది ఇళ్లలో బాత్ రూం సౌలభ్యాలు మరింత మెరుగయ్యాయి. బాత్ రూంలలో బాత్ టబ్ ల ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఉరుములు, మెరుపుల వర్షం కురుస్తున్నప్పుడు బాత్ టబ్ లలో సేదతీరుతూ స్నానం చేయడం మంచిది కాదు.

స్విమ్మింగ్ పూల్ స్నానం

ఒకవైపు భారీ వర్షం కురుస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు తోడైన సందర్భంలో ఎవరూ కూడా స్విమ్మింగ్ పూల్ లోకి దూకరు. ఇలాంటి సందర్భంలో స్విమ్మింగ్ పూల్ స్నానాలకు దూరంగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అలాగే ఇటువంటి సందర్భాలలో వాషర్లు, డ్రయ్యర్లు ఉపయోగించడం, నేల మీద పడుకోవడం, కార్డు కలిగిన ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించడం కూడా చేయవద్దని సిఫారసు చేస్తున్నారు.

చివరగా ఒక్కమాట.. స్నానాన్ని వాయిదా వేయండి అంతేకానీ అసలు స్నానమే చేయడం మానేయకండి. స్నానానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేయటానికి ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీన 'అంతర్జాతీయ స్నాన దినోత్సవం' గా పాటిస్తున్నారనేది చాలా తక్కువ మందికి తెలిసిన విషయం.

టాపిక్