Monday Motivation : జ్ఞాపకాలు ఎలాంటివైనా మోయక తప్పదు.. ఊర్లో ఓసారి గుర్తుచేసుకోండి
15 January 2024, 5:00 IST
- Monday Motivation Telugu : జ్ఞాపకాలు చేదువైనా.. తీయవైనా మోయక తప్పదు. అలాంటి జ్ఞాపకాలు మీ ఊరిలో మీకు ఎన్నో ఉండి ఉంటాయి. ఈ సంక్రాంతికి ఊర్లో ఉంటే అవన్నీ గుర్తుచేసుకుండి. ఇప్పుడెక్కడ ఉన్నాం.. అప్పుడు ఎక్కడ? ఎలా? ఉండేవాళ్లమని పోల్చుకోండి.
ప్రతీకాత్మక చిత్రం
సంక్రాంతి అంటే ఊరెళ్లాల్సిందే. కొందరు ప్రతిసారీ వెళ్తుంటే.. కొందరేమో కొన్నేళ్లు గ్యాప్ ఇచ్చి వెళ్తుంటారు. ఎలా వెళ్లినా ఊరు కన్న తల్లిలాంటిది. ఢిల్లీకి రాజైనా.. తల్లికి కొడుకే.. ఎంత గొప్పొడైనా.. ఊర్లో అందరికీ మనోడే.. ఇలాంటి భావనే ఉంటుంది. మీ జీవితంలో ఏం సాధించాలని ఊరి నుంచి బయటకు వచ్చేసారు.. ఇప్పుటి వరకూ ఏం సాధించారు అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ గెలుపు ఇంకెంత దూరం ఉందో మీకు అర్థమవుతుంది.
ఊర్లోని జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసుకోండి. మనసుకు ప్రశాంతంగా దొరుకుతుంది. మళ్లీ సిటీకి వచ్చి ఎలాగూ మీరు గజిబిజి లైఫ్ చూడాల్సిందే. కనీసం ఊరి జ్ఞాపకాలు నెమరువేసుకుంటే.. మళ్లీ మీరు పిల్లలైపోతారు. మనసు తేలికగా ఉంటుంది. ఒత్తిడికి దూరమవుతారు. మీకోసం మీ ఊరు ఎన్నో జ్ఞాపకాలను రహస్యంగా దాచి పెట్టింది. ఎందుకంటే మీరు చేసిన చిలిపి పనులు తనకే తెలుసు కాబట్టి.
మీరు ఊగిన మర్రి ఊడలు.. ఇప్పుడు ఒంటరిగా ఊగుతున్నాయేమో.. ఒక్కసారి వాటిని తాకి రండి. మీరు ఆడిన దొంగాట ప్రదేశంలో ఒక్కసారి కూర్చొండి.. ఊరు నాలుగు దిక్కులు మీకోసం వెతుకుతూ ఉంటాయి. మీరు చదివిన బడికి వెళ్లి రండి.. గోడలు కళ్లేసుకుని మీ వైపు మురిపెంగా చూస్తాయేమో. మీకు చదువు చెప్పిన బ్లాక్ బోర్డు దగ్గరగా వెళ్లి రండి.. మీరు ఎదిగిన ఎత్తు కనపడక ఎలా మీ కోసం ఎదురుచూస్తుందో అర్థమవుతుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే మంచి మనసు ఉండాలి. అందుకే సంక్రాంతికి ఊరెళితే కల్మషం లేని బాల్యంలోకి వెళ్లండి. మైల పట్టని మనసుతో సిటీకి తిరిగివస్తారు.
ఉదయం పూట బోసి నవ్వులతో మిమ్మల్ని సూర్యుడు చూసి నవ్వుతుంటే ఎంతటి ఆనందం దొరుకుతుందో ఒక్కసారి మనసారా ఆస్వాదించండి.. చేదుగా ఉన్నా వేపను నములుతూ ఒక్కసారి ఊర్లో నడవండి. పులకరింత కలిగించే తియ్యని పలకరింపులు గడప గడప నుంచి వస్తాయి. సిటీలో పక్క ఇంటి వాడి పట్టింపులేక పడుతున్న బాధలన్నీ తొలగిపోతాయి. పొగమంచులో అయినవాళ్లతో కలిసి నడవండి.. మీరంటే ఎంత ఇష్టం ఉందో వారి మాటల ద్వారా అర్థమవుతుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం.. ఎంత అలసిపోయినా మనసు నుంచే వచ్చే నవ్వులు కనిపిస్తాయి. కల్మషంలేని ప్రేమలు దొరుకుతాయి.
ఈ బిజీ జీవితంలో పండుగలకైనా ఇంటికి వెళ్లండి.. జీవితంలో ఏం కోల్పోతున్నామో అర్థమవుతుంది. కనీసం కొన్ని రోజులైనా గుర్తుంచుకునేలా ఉంటాయి. పట్టణానికి వస్తే ఎలాగూ తప్పవు తిప్పలు. ఎప్పుడెళ్లినా ఊరు కన్నతల్లిలాంటిదే అక్కున చేర్చుకుంటుంది. నీ బాల్యాన్ని గుర్తుచేస్తుంది.. నీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. నీ కష్టానికి సరైన దారి చూపుతుంది. ఊరంటే కొన్ని ఇళ్లతో కలిసి ఉన్న ఒకే కుటుంబం.