Meal Maker Fried Rice: మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్, ఎవరికైనా ఇది నచ్చేస్తుంది, దీని రెసిపీ చాలా సులువు
24 July 2024, 16:00 IST
- Meal Maker Fried Rice: చికెన్ ఫ్రైడ్ రైస్ కు పోటీ ఇచ్చేలా ఉంటుంది మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్. దీన్ని చేయడం చాలా సులువు. వెజిటేరియన్లు దీన్ని ఇష్టంగా తింటారు.
మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ
Meal Maker Fried Rice: మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ పేరు వింటేనే నోరూరిపోతుంది. చికెన్, ఎగ్ ఫ్రైడ్ రైస్‌లాగే మీల్ మేకర్‌తో కూడా ఫ్రైడ్ రైస్ చేయొచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.దీన్ని చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. ముఖ్యంగా వెజిటేరియన్లకు ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. దీన్ని నాన్ వెజిటేరియన్లు కూడా ఇష్టంగా తింటారు. దీన్ని చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
మీల్ మేకర్ - ఒక కప్పు
బాస్మతి రైస్ - ఒక కప్పు
ధనియాల పొడి - అర స్పూను
కార్న్ ఫ్లోర్ - రెండు స్పూన్లు
నూనె - తగినంత
కారం - అర స్పూను
పచ్చిమిర్చి - మూడు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర స్పూను
క్యాప్సికం - ఒకటి
రెడ్ చిల్లి సాస్ - ఒక స్పూను
సోయాసాస్ - ఒక స్పూను
మిరియాల పొడి - అర స్పూను
వెనిగర్ - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ
1. బాస్మతి రైస్‌ను శుభ్రంగా కడిగి పొడిపొడిగా వచ్చేలా అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి.
2. అన్నం వండుతున్నప్పుడే ఒక స్పూను నూనె, రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటే మంచిది. ఇది పొడిపొడిగా వస్తుంది.
3. అన్నం ఉడికాక ఆ అన్నాన్ని ఒక ప్లేట్లో వేసి చల్లార్చుకోవాలి.
4. ఇప్పుడు మీల్ మేకర్‌ను వేడి నీళ్లలో వేసి పది నిమిషాలు ఉంచాలి. అవి మెత్తగా మారుతాయి.
5. మీల్ మేకర్లను చేత్తోనే నీళ్లను పిండేసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
6. ఆ గిన్నెలోనే చిటికెడు ఉప్పు, కారం, ధనియాల పొడి, అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి.
7. అందులోనే కార్న్ ఫ్లోర్‌ని కూడా వేసుకోవాలి.
8. అవసరమైతే ఒక స్పూన్ మైదాపిండిని వేసుకోవచ్చు.
9. మీల్ మేకర్‌కు ఆ మిశ్రమం అంతా పట్టేలా చూసుకొని ఓ 10 నిమిషాలు పక్కన పెట్టాలి.
10. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి.
11. మ్యారినేట్ చేసుకున్న మీల్ మేకర్లను అందులో వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
12. ఆ మీల్ మేకర్లను టిష్యూ పేపర్లో వేసి నొక్కితే అదనపు నూనెను పీల్చేస్తుంది.
13. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
14. ఆ నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి.
15. అలాగే సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి.
16. క్యాప్సికం లేకపోతే క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు.
17. ఇవి కూడా మంచి రుచిని తెస్తాయి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే రెడ్ చిల్లి సాస్, సోయాసాస్, వెనిగర్ కూడా వేసుకొని ఓసారి కలుపుకోవాలి.
18. ఈ సాస్‌లు త్వరగా మాడిపోతాయి. కాబట్టి ఇవి వేసిన వెంటనే ఒక రెండు స్పూన్ల నీటిని కూడా వేసి చిన్న మంట మీద పెట్టాలి.
19. ఈ మిశ్రమంలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్లను వేసి కలుపుకోవాలి.
20. అవసరమైతే ఉప్పును వేయొచ్చు. మిరియాల పొడిని కూడా చల్లుకోవాలి.
21. ఈ మిశ్రమంలో ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి గరిటతో కలుపుకోవాలి.
22. అన్నం పొడి పొడిగా వచ్చేలా కలుపుకుంటే తినాలన్న కోరిక పుడుతుంది. పైన కొత్తిమీర తరుగును చల్లుకొని దీన్ని సర్వ్ చేయాలి. దీని రుచి అదిరిపోతుంది.
మీల్ మేకర్లను సోయా చంక్స్ అని కూడా పిలుస్తారు. సోయాతో చేసిన మీల్ మేకర్లను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సూపర్ మార్కెట్లలో సోయా చంక్స్ పేరుతో ఇవి అందుబాటులో ఉంటాయి. వాటిని తెచ్చుకుంటే ఈ మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ టేస్టీగా వస్తుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి.