Thursday Motivation: పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి, అది మీలో తెలివిని, ధైర్యాన్ని నింపుతుంది
02 May 2024, 5:00 IST
- Thursday Motivation: పుస్తకాలు చదివే అలవాటు ఆధునిక కాలంలో తగ్గిపోతోంది. కానీ పుస్తక పఠనం మనకు తెలియకుండానే మనలో ఎంతో మేధస్సును నింపుతుంది.
మోటివేషనల్ స్టోరీ
Thursday Motivation: పుస్తకాలు చదివే వారి సంఖ్య చాలా తక్కువ. ఖాళీ దొరికితే ఫోన్లతో బిజీ అయిపోయిన వారే కనిపిస్తారు. నిజానికి ప్రతిరోజూ కొంత సమయం పుస్తక పఠనానికి కేటాయించాలి. మీరు ఎంతగా పుస్తకాలు చదివితే అంతగా మీకు తెలియకుండానే మీ మేథస్సు కూడా పెరుగుతుంది. పుస్తక పఠనం మిమ్మల్ని, మీ ఆలోచనలను, మీ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఒక అరగంట పాటు ఏదైనా మంచి పుస్తకాన్ని చదవండి. మీకే చక్కటి అనుభూతి కలుగుతుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. పుస్తక పఠనం మనలో మరెన్నో సానుకూల ప్రభావాలకు కారణం అవుతుంది.
ఒత్తిడి తగ్గిస్తుంది
ప్రతిరోజూ కాసేపు పుస్తకం చదవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఒత్తిడి స్థాయిలు కూడా తగ్గుతాయి. మీలో సృజనాత్మకత పెరుగుతుంది. మాట్లాడేటప్పుడు మెరుగైన పదాలను వాడడం, పుస్తకం పఠనం నేర్పిస్తుంది. మీరు మాట్లాడే తీరు మీ ఎదుటివారిని ఆకట్టుకునేలా చేస్తుంది. ఇది కూడా మీరు జీవితంలో ఎదగడానికి ఎంతో ఉపయోగకరమైన సాధనం... పుస్తక పఠనం.
మీరు రకరకాల పుస్తకాలు చదువుతున్నప్పుడు ఆ పదజాలం మీ మెదడులో నిండిపోతుంది. మిమ్మల్ని మీరు మరింతగా వ్యక్తికరించుకోవడానికి ఆ పదాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మీ మాట్లాడే సామర్థ్యం మిమ్మల్ని మరింత మందికి నచ్చేలా చేస్తుంది. కమ్యూనికేషన్ నైపుణ్యాలు ప్రతి జీవితంలో అడుగడుగునా అవసరమే. పుస్తక పఠనం అనేది ఒక విషయాన్ని అర్థం చేసుకునే నైపుణ్యాన్ని పెంచుతుంది. గ్రహణ నైపుణ్యం అభివృద్ధి చేయడానికి పుస్తకాలు చదవడం చాలా ముఖ్యం.
ఆధునిక కాలంలో ఒత్తిడి బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలి. అంటే ప్రశాంతమైన పుస్తకాలను చదువుతూ ఉండాలి. పుస్తక పఠనం మీలో మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆందోళన స్థాయిలను తగ్గిస్తుంది. మీలో జ్ఞానాన్ని పెంచుతుంది. ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని, తెలివితేటలను ఇస్తుంది.
వయసు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అభిజ్ఞా క్షీణత కూడా ఉంటుంది. ఎవరైతే పుస్తకాలు అధికంగా చదువుతారో వారికి వయసు పెరిగినా కూడా అభిజ్ఞా సామర్థ్యం కూడా పెరిగే అవకాశం ఉంది. పుస్తక పఠనం మీ మనసును, మెదడను చురుగ్గా చేస్తుంది. వయసుతో పాటు వచ్చే మతిమరుపు, అభిజ్ఞా క్షీణత వంటి సమస్యలను దూరం చేస్తుంది. పుస్తక పఠనం మిమ్మల్ని సంతోషకరమైన వ్యక్తిగా మారుస్తుంది. ఏదైనా మంచి పుస్తకాన్ని ఎంచుకొని పుస్తక పఠనాన్ని మొదలుపెట్టండి. మీలో వచ్చే మార్పులను మీరే గమనించండి. నెలరోజుల పాటు క్రమం తప్పకుండా ప్రతిరోజూ కనీసం ఒక గంట సేపు ఏదైనా మంచి పుస్తకాన్ని చదవడానికి కేటాయించి... నెల రోజులు తర్వాత మీలో ఎలాంటి మార్పులు వచ్చాయో మీరే ఒక అంచనా వేసుకోండి.