Low Blood Pressure: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే లో బీపీ కావచ్చు.. జాగ్రత్త!
13 September 2023, 11:23 IST
Low Blood Pressure: లోబీపీ లక్షణాలు మీద అవగాహన ఉంటే సమస్యను తొందరగా గుర్తించొచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆ లక్షణాలేంటో తెలుసుకోండి.
లోబీపీ లక్షణాలు
హైబీపీ సర్వసాధారణంగా చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ లోబీపీ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. దీని బాధితుల సంఖ్యా తక్కువగానే ఉంటుంది. మనుషుల్లో సాధారణంగా రక్త పోటు 120/80 ఉండాలి. పరీక్షించిన ప్రతీ సారీ అంతకంటే ఎక్కువ చూపిస్తుంటే దాన్ని హైబీపీ కింద పరిగణిస్తారు. అలాగే 90/60 కంటే తక్కువగా ఉంటే దాన్ని లో బీపీగా మనం అర్థం చేసుకోవాలి.
కారణాలు:
అడ్రినల్ హార్మోన్ సరైన మోతాదులో లేకపోవటం వల్ల లో బీపీ వస్తుంది. హై బీపీకి మందులు వాడటం, విటమిన్ బీ12 లోపం, మహిళల పీరియడ్స్‌లో అధిక రక్తస్రావం లాంటి కారణాల వల్ల ఇది రావొచ్చు. అలాగే మద్యం, మాదక ద్రవ్యాలు అతిగా సేవించడం వల్లా దీని బారిన పడొచ్చు. గుండె కొట్టుకునే వేగం తగ్గడం, గుండెలో రక్తం గడ్డ కట్టడం లాంటి వాటి వల్లా ఇది తలెత్తుతుంది. లోబీపీ పెద్ద ప్రమాదం ఏమీ కాదేమో అని తేలిగ్గా తీసుకోకూడదు. కొన్ని సార్లు ప్రాణాంతకమూ అవుతుంది. అందుకనే మనలో ఈ కింది లక్షణాలు రోజూ కనిపిస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. బీపీని చెక్ చేయించుకుని చికిత్స తీసుకోవడం ఉత్తమం.
లోబీపీ లక్షణాలు :
- కొంచెం పని చేసినా తొందరగా అలసిపోతారు. నీరసంగా, విసుగుగా అనిపిస్తుంది.
- పడుకుని లేచినా, కుర్చుని లేచినా కళ్లు తిరుగుతున్నట్లు అనిపిస్తాయి. తల తిరుగుతున్నట్లుగా ఉంటుంది. ఎప్పుడూ తల దిమ్ముగా ఉన్నట్లు ఉండటం, కొంచెం తలనొప్పిగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
- వికారంగా ఉండటం, ఏకాగ్రత లోపించడం, కంటి చూపు మందగించినట్లుగా అనిపించడం లాంటివి ఉండవచ్చు.
- మహిళల్లో ఏదైనా సమస్య వల్ల ఎక్కువగా రక్త స్రావం జరగడం, ప్రసవం సమయంలో ఎక్కువ రక్తం పోవడం వల్ల శరీరంలో రక్తం తగ్గిపోతుంది. అలాంటప్పుడూ లోబీపీ రావొచ్చు. పురుషుల్లోనూ రక్తం తక్కువగా ఉన్నట్లయితే లోబీపీ అవకాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
- అవయవాల నొప్పులు, వాపులు కూడా లోబీపీ లక్షణాలే.
- లోబీపీ చాలా ఎక్కువగా ఉంటే అప్పుడు వారు షాక్‌కి గురవుతారు. గందరగోళంగా అనిపిస్తుంది. చర్మం రంగు తగ్గుతుంది. శ్వాస, పల్స్‌లో హెచ్చు తగ్గులు వస్తాయి.
- డీ హైడ్రేషన్ వల్ల వాంతులు, విరేచనాలు కావడం.
అందరిలోనూ ఇవి అన్నీ ఉంటాయని కాదు. మనిషి తత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని గమనించుకోవడం ద్వారా చికిత్స ప్రారంభించుకోవచ్చు.
టాపిక్