Sleep Anxiety: పడకపై వాలగానే ఆందోళన ఎక్కువవుతోందా? స్లీప్ యాంగ్జైటీ కావొచ్చు!
14 November 2023, 19:35 IST
Sleep Anxiety: పడకపై వాలగానే ఆందోళనగా అనిపించడం, ఏమీ తోచకపోవడం, ఏవో ఆలోచనలు రావడం, శ్వాసలో ఇబ్బంది లాంటి లక్షణాలన్నీ స్లీప్ యాంగ్జైటీ లక్షణాలు. దాని గురించి వివరంగా తెలుసుకోండి.
స్లీప్ యాంగ్జైటీ
కొంత మంది సాధారణ సమయంలో బాగానే ఉంటారు. బాగానే ఆలోచిస్తారు. నిద్ర సమయానికి పడక మీద వాలగానే అసలు సినిమా మొదలవుతుంది. రకరకాల ఆలోచనలు.. వాటి వల్ల ఆందోళన, భయం లాంటివి కలుగుతాయి. ఫలితంగా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది. శరీరం నిద్రపోయే మూడ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. కళ్లు మూసుకున్నా నిద్ర రాదు. మెదడులో రకరకాల ఆలోచనలు చుట్టుముట్టేసి చెప్పలేనంత ఒత్తిడిని కలుగజేస్తాయి. ఇది బహుశా స్లీప్ యాంగ్జైటీ కావొచ్చు. ఇలాంటి పరిస్థితుల్ని మీరు ఎదుర్కొంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే..
స్టీప్ యాంగ్జైటీ లక్షణాలు :
- దీని బారిన పడిన వారి శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. పడకపై వాలగానే గుండె వేగంగా కొట్టుకుంటుంది. శ్వాస అందనట్లుగా ఉంటుంది. లేదా వేగంగా శ్వాస తీసుకుంటారు. గుండెల్లో నొప్పి, నీరసం, చెమటలు, వికారం, దడదడగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
- మానసికంగా భయపడిపోతూ ఉంటారు. నెగెటివ్ ఆలోచనలు చుట్టుముడతాయి. వాటితో యుద్ధం చేస్తున్నట్లు ఉంటుంది. దేని మీదా దృష్టి నిలపలేరు. గందరగోళంగా అనిపిస్తుంది.
- నిద్రపోవాలంటేనే భయమేసినట్లు ఉంటుంది. కొన్ని సార్లు బిగుసుకుపోవడం, ఆందోళనగా ఉండటం జరుగుతుంది.
- చాలా కోపంతో ఉండటం, ఒత్తిడితో ఉండటం గమనించవచ్చు.
- వీటన్నింటి వల్లా నిద్ర పట్టదు. చాలా సేపు ప్రయత్నించినా సౌకర్యంగా నిద్ర పడుతున్నట్లు అనిపించదు. పక్కమీద నుంచి లేచి వెళ్లిపోతే బాగుంటుందని అనిపిస్తుంది.
వైద్యుల పర్యవేక్షణ అవసరం :
పై లక్షణాలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నట్లయితే తప్పకుండా వైద్యుల్ని సంప్రదించి వైద్యం చేయించుకోవాల్సి ఉంటుంది. దీని నుంచి బయట పడటానికి ఎన్నో మందులు, విధానాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ సమస్య ఎందుకు వస్తుంది? అనే దాన్ని వివరించడంతోపాటు మందులు ఇస్తారు. కొన్ని థెరపీలు, వ్యాయామాలు ఉంటాయి. వీటితో పాటు సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా సమస్యను తగ్గిస్తారు.
ఇంట్లో ఏం చేయాలంటే :
ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్న వారు ముందు పగటి పూట చిన్న చిన్న కునుకులు వేయడం మానుకోవాలి. రాత్రి ఆలస్యంగా భోజనం చేయకూడదు. కెఫీన్ ఉన్న టీలు, కాఫీల్లాంటి వాటిని సాయంత్రం పూట ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే ధూమ పానం అలవాటు ఉన్నట్లైతే దాన్ని మానేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ రోజూ వ్యాయామాలు చేసుకోవాలి. శరీరం అలసిపోయినట్లు అయితే తొందరగా నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి వీలైనంత ఎక్కువగా వ్యాయామాలు చేసుకోవాలి. కచ్చితమైన పడక షెడ్యుల్‌ని పాటించాలి. గదిని చీకటిగా చేసుకుని నిద్రకు ఉపక్రమించాలి. ఏం ఆలోచించకూడదని గట్టిగా నిశ్చయించుకోవాలి.