Diwali Lighting Ideas: దీపావళి రోజున బాల్కనీని అలంకరించేందుకు.. ఉత్తమ మార్గాలు..
12 November 2023, 17:30 IST
Diwali Lighting Ideas: ఈ దీపావళి రోజున ఇళ్లంతా మెరిసిపోవాల్సిందే. పట్టణాల్లో అయితే బాల్కనీలని మరింత ప్రత్యేకంగా అలంకరిస్తాం. దానికోసం కొన్ని మంచి ఐడియాలు చూసేయండి.
దీపావళి అలంకరణ
దీపాల పండుగ దీపావళి వస్తుందంటేనే మన ఇళ్లు, వాకిళ్లు, బాల్కనీలు.. ఇలా అన్నీ దీపాల మయం అయిపోతాయి. ఇటీవల కాలంలో సహజమైన దీపాలతో పాటుగా రకరకాల లైటింగ్ ఆప్షన్లు మార్కెట్లో బోలెడు అందుబాటులో ఉంటున్నాయి. అపార్ట్‌మెంట్లలో, పై అంతస్థుల్లో ఉండే వారికి ఎక్కువగా ఖాళీ ప్రదేశం ఉండదు. కాబట్టి బాల్కనీలనే చక్కగా అలంకరించేసుకుంటూ ఉంటారు. మరి మీరూ ఇలా బాల్కనీని దీపావళికి కొత్తగా అలంకరించుకునే పనిలో ఉన్నారా? అందుకోసం ఏమేం లైటింగ్ రకాలు ఉన్నాయి. వేటిని వాడొచ్చు? లాంటి వివరాలన్నీ ఇక్కడున్నాయి. చదివేసి నచ్చితే ప్రయత్నించేయండి.
స్ట్రింగ్ లైట్లు:
వీటినే మనం సీరియల్ లైట్లు అని కూడా అంటుంటాం. వెలుగుతూ ఆరుతూ, రకరకాల రంగుల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. వీటిని బాల్కనీల్లో కర్టెన్‌లాగా వరుసగా వేలాడదీయొచ్చు. మీ బాల్కనీలో ఎక్కువగా మొక్కలు వరుసగా ఉన్నాయనుకోండి. వాటికీ ఈ లైట్లను చుట్టేయొచ్చు. ఆ పచ్చటి ఆకులపై రాత్రి ఈ లైట్ల వెలుగులు మీ బాల్కనీకే కొత్త లుక్‌ని తెచ్చేస్తాయి. మీ మదిని మరింత ఉల్లాసంగా మార్చేస్తాయి. బాల్కనీలో కిటికీలు ఉండి వాటికి గనుక కర్టెన్లు ఉంటే.. దీపావళికి కాస్త లేత రంగు పరదాలను మార్చండి. ఆ మధ్యలో వీటిని వేలాడదీయండి. లుక్ చూసి మీరే వావ్ అంటారు.
సీసా లైట్లు:
మీ ఇంట్లో వేలాడదీయడానికి వీలుగా ఉన్న తెల్లటి గాజు సీసాలు ఏమైనా ఉన్నాయేమో చూడండి. అన్నీ ఒకే రకమైనవి ఉంటే బాగుంటాయి. వాటిలో చిన్న చిన్న స్ట్రింగ్ లైట్ గుత్తుల్ని వేసి వైర్లను ప్లగ్‌కు కలపండి. సీసాలను బాల్కనీ రైలింగ్‌కి గాని, పైన మొక్కలు వేల్లాడదీసే చోటుగాని వరుసగా తగిలించండి. స్విచ్ ఆన్ చేసి చూడండి. ఊరికే పడున్న సీసాలు మీ బాల్కనీలో ఇంత అందంగా మారిపోవడాన్ని మీరే చూడొచ్చు.
లాంతర్లు:
మీకు గనుక డీఐవైలు చేసే ఆసక్తి ఉన్నట్లయితే పేపర్ లాంతర్లను తయారు చేయండి. లేదంటే మార్కెట్లోనూ ఇలాంటివి చాలా అందుబాటులో ఉంటాయి. రకరకాల రంగుల్లో పెద్ద పెద్ద బాల్స్‌లా ఉండే లాంతర్లను తయారు చేసి మధ్యలో చిన్న లైట్లను ఏర్పాటు చేసుకోవాలి. వాటిని బాల్కనీలో పైన వరుసగా వేలాడదీయండి. స్విచ్ ఆన్ చేసి చూడండి. రంగుల లాంతర్లు భలే గమ్మత్తుగా ఊగుతూ మనకు ఆనందాన్ని పంచుతాయి.
సహజమైనవాటి లుక్ వేటికీ రాదు:
ఎన్ని రకాల ఎలక్ట్రిక్ బల్బులు పెట్టినా సహజమైన దీపాలకు ఉండే అందమే వేరు. అందుకనే మిగిలిన అలంకరణలు ఎన్ని చేసినా వీటికీ వాటి మధ్యలో చోటివ్వండి. మీ బాల్కనలో కుర్చీలు టీపాయ్ లాంటి సిటింగ్ స్పేస్ ఉందా? ఉంటే గనుక కచ్చితంగా ఉర్లీలో పూలను పేర్చి టీపాయ్ మీద పెట్టండి. వాటి మధ్యలో దీపాలను పెట్టి వెలిగించండి.