Parenting tips: పిల్లలు పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఎదిగేందుకు వీటిని నేర్పించండి..
23 October 2023, 16:00 IST
Parenting tips: పిల్లల ఆలోచనా తీరు సానుకూలంగా ఉండాలంటే తల్లిదండ్రుల పెంపకం పాత్ర కీలకంగా ఉంటుంది. ఈ విషయంలో ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకోండి.
పేరెంటింగ్ టిప్స్ (pexels)
పేరెంటింగ్ టిప్స్
పిల్లల్ని తీర్చి దిద్దడానికి తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. వారు మంచి వ్యక్తిత్వం గల వ్యక్తులుగా, సానుకూల దృక్పథంతో ఎదగాల్సి ఉంటుంది. అప్పుడే వారు భవిష్యుత్తులో వచ్చే సవాళ్లను సులభంగా స్వీకరించగలుగుతారు. ఉన్నతమైన లక్ష్యాలను అలవోకగా సాధించగలుగుతారు. ఇందుకు సంబంధించిన ఆలోచనా తీరును వారికి మనం చిన్నప్పటి నుంచే నూరిపోయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిని అలవాటు చేయడం ద్వారా మన పిల్లల్లో సానుకూల దృక్పథం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది.
పిల్లల పెంపకంలో మెలకువలు:
- పిల్లల్లో సాధారణంగా భయాలు, నెగటివ్ ఆలోచనలు ఉంటాయి. అయితే వాటిని మనం పూర్తిగా తప్పు పట్టాల్సిన పని లేదు. అలాంటి నెగెటివ్ ఆలోచనలను తట్టుకుని వారు మానసికంగా దృఢంగా మారతారు. ఎప్పుడూ వారికి ఎలాంటి చిన్న ఇబ్బందీ కలగకుండా ఉంటే పెద్దయ్యాక వారు చాలా సున్నితంగా తయారవుతారు. చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూడటం మొదలుపెడతారు. ఇంత పెద్ద కష్టం నాకే వచ్చిందా? అన్నట్లు భావిస్తారు. అందుకనే వారికి కలిగే ఇబ్బందుల్లో ధైర్యంగా ఉండమని వారికి చిన్నప్పటి నుంచే నేర్పించాలి.
- ఫ్రెండ్స్ తనను తిట్టారనో, కొట్టారనో, ఇబ్బంది పెట్టారనో చెప్పినప్పుడు వాళ్లను తిరిగి అలాగే చెయ్యమని మనం ఎప్పుడూ ప్రోత్సహించకూడదు. అలా చేయకుండా సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించుకోమని వారికి సూచించాలి. ఎదుటి వారితో మంచిగా మాట్లాడటం, ఫ్రెండ్షిప్ పెంచుకోవడం లాంటి వాటి వల్ల ఇలాంటివి తగ్గుతాయని వివరించాలి. ఆరోగ్యకరమైన వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకోమని వారిని ప్రోత్సహించాలి.
- కొంత మంది పిల్లలు పురుగులను ఊరికే చంపేయడం, కుక్కలు పిల్లుల్ని కొట్టడం లాంటివి చేస్తుంటారు. అలా చేయడం వల్ల మనం ఎంత బాధ పడతామో అవి కూడా అంతే బాధ పడతాయని వివరించాలి. పిల్లల్లో చిన్నప్పటి నుంచే దయ, ఎదుటి వారిని, అన్ని జీవుల్ని ప్రేమించడం లాంటి లక్షణాలను పెంపొందించాలి. మనం సందర్భానుసారంగా చెబుతూ ఉంటే వారు మెల్ల మెల్లగా అన్నీ అర్థం చేసుకుంటారు.
- పక్క పిల్లలకు హోం వర్కుల్లో సాయం చేయడం, ఏదైనా అవసరమైనప్పుడు ఎదుటి వారికి సహకరించడం లాంటి అలవాట్లను వారికి అబ్బేలా చేయాలి. తన దగ్గర ఉన్న దాన్ని ఇతరులకు షేర్ చేయడాన్ని అలవాటు చేయాలి. వీటిని కచ్చితంగా చిన్నప్పటి నుంచే నేర్పించాలి. సాయం చేయడంలో ఉన్న ఆనందాన్ని వారు అనుభవించేలా చేయాలి.
- మీ పిల్లలతో మీరు ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండేందుకు ప్రయత్నించండి. ప్రేమను చూపించడం, కౌగిలించుకోవడం, ముద్దు ఇవ్వడం.. లాంటి పనుల వల్ల వారు మీతో చాలా సౌకర్యంగా ఉన్నట్లు భావిస్తారు. మీరు చెప్పిన వాటిని ఇష్టంగా పాటించేందుకు ప్రయత్నిస్తారు.