తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Menstrual Hygiene: పీరియడ్స్ శుభ్రత విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలివే..

Menstrual hygiene: పీరియడ్స్ శుభ్రత విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలివే..

HT Telugu Desk HT Telugu

25 May 2023, 17:45 IST

google News
  • Menstrual hygiene: పీరియడ్స్ సమయంలో పాటించాల్సిన కొన్ని వ్యక్తిగత శుభ్రతకు సంబంధించిన విషయాలు తెలుసుకోండి. 

పీరియడ్స్ లో పరిశుభ్రత
పీరియడ్స్ లో పరిశుభ్రత (pexels)

పీరియడ్స్ లో పరిశుభ్రత

నెలసరి సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. పీరియడ్స్ సమయంలో ఎలాంటి ఉత్పత్తులు వాడాలో , పరిశుభ్రత కోసం ఎలాంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలో తెలుసుకోండి.

1. ట్యాంపన్లు, ప్యాడ్స్, కప్స్.. ఆలోచించి ఎంచుకోండి:

నెలసరి సమయంలో కేవలం శ్యానిటరీ న్యాప్‌కిన్లే కాదు.. మెన్‌స్ట్రువల్ కప్స్, ట్యాంపన్లు, పీరియడ్ ప్యాంటీ ఇలా చాలా రకాల ఆప్షన్లు ఉన్నాయి. శ్యానిటరీ న్యాప్ కిన్ సింథటిక్ కాకుండా బయోడిగ్రేడబుల్ వస్త్రంతో చేసినవి ఎంచుకుంటే మంచిది. వీటిని పలుమార్లు వాడుకునే అవకాశం ఉంటుంది. ఇక మెన్‌స్ట్రువల్ కప్స్ వాతావరణానికి, మనకీ చాలా మేలు చేస్తాయి. దీన్ని వాడటానికి చాలా మంది మొహమాట పడతారు. కానీ పీరియడ్స్ హైజీన్ లో ఇది చాలా మేలు చేస్తుంది. పీరియడ్ ప్యాంటీలు శ్యానిటరీ న్యాప్‌కిన్ల వాడకానికి అలవాటు పడని, సౌకర్యంగా అనిపించని వాళ్లకి సరైన ఎంపిక.

2. ప్యాడ్ ఎన్ని గంటలకోసారి మార్చాలి:

ఎలాంటి శ్యానిటరీ ప్రొడక్ట్ వాడినా నాలుగు నుంచి ఆరు గంటలలోపు మార్చుకోవాలి. బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంటే వీలైనన్ని ఎక్కువసార్లు మార్చుకుంటూ ఉండాలి.

3. ఎలా డిస్పోజ్ చేయాలి:

మెన్‌స్ట్రువల్ కప్ వాడుతుంటే.. ప్రతి పీరియడ్ అయిపోగానే స్టెరిలైజ్ చేయాలి. పీరియడ్ సమయంలో శుభ్రంగా కడిగాకే మళ్లీ వాడాలి.

శ్యానిటరీ న్యాప్ కిన్ వాడితే ఏదైనా పేపర్ లేదా కవర్ లో చుట్టి డిస్పోజ్ చేయాలి. ఎప్పుడూ టాయిలెట్లో వీటిని ఫ్లష్ చేయకూడదు.

4. చేతి శుభ్రత:

ప్యాడ్ మార్చుకున్న ప్రతి సారీ తప్పకుండా యాంటీ సెప్టిక్ హ్యాండ్ వాష్ తో చేతులు కడుక్కోవాలి. హ్యాండ్ వాష్ రాసుకుని కనీసం 20 సెకన్లు రుద్దాక కడిగేసుకోవాలి.

5. లోదుస్తులు:

బిగుతుగా ఉన్న లోదుస్తులు వేసుకోకూడదు. దానివల్ల యీస్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. వదులుగా ఉండాలి. కాటన్ లోదుస్తులే ఎంచుకోవాలి.

6. వజైనా ఎలా శుభ్రం చేసుకోవాలి:

వజైనా సొంతంగానే పీహెచ్ స్థాయుల్ని, శుభ్రతని చూసుకుంటుంది. దానికోసం ఎలాంటి సబ్బులు, వాష్ లు వాడొద్దు. దానివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. పీరియడ్స్ సమయంలో రోజుకు రెండు సార్లు మామూలు నీళ్లతో వజైనా శుభ్రపరుచుకుంటే చాలు. అలాగే ఎప్పుడూ ముందు నుంచి వెనకకు మాత్రమే శుభ్రం చేసుకోవాలి. వెనక నుంచి ముందుకు శుభ్రం చేస్తే వేరే ఇన్ఫెక్షన్లకు దారితీయొచ్చు.

వజైనా వాష్ లు వాడటం వల్ల పీహెచ్ స్థాయుల్లో మార్పులు రావచ్చు. దానివల్ల వజైనా ఇన్ఫెక్షన్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు రావచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం