తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Prostate Cancer: ఈ తప్పులు చేస్తున్నారా? ప్రొస్టేట్ క్యాన్సర్ తప్పదు

Prostate cancer: ఈ తప్పులు చేస్తున్నారా? ప్రొస్టేట్ క్యాన్సర్ తప్పదు

HT Telugu Desk HT Telugu

08 March 2023, 10:19 IST

  • Prostate cancer: ప్రొస్టేట్ క్యాన్సర్‌ సాధారణంగా ఎలాంటి లక్షణాలు చూపించదు. వ్యాధి నిర్ధారణ కూడా కష్టతరమే. 

ప్రొస్టేట్‌ను ప్రభావితం చేసే జీవన శైలిని మార్చుకోవాలంటున్న నిపుణులు
ప్రొస్టేట్‌ను ప్రభావితం చేసే జీవన శైలిని మార్చుకోవాలంటున్న నిపుణులు (Photo by Pixabay)

ప్రొస్టేట్‌ను ప్రభావితం చేసే జీవన శైలిని మార్చుకోవాలంటున్న నిపుణులు

దేశంలో నమోదవుతున్న టాప్ 10 క్యాన్సర్ కేసుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటిగా నిలుస్తోంది. వృద్ధాప్య జనాభా పెరుగుదలతో పాటు జీవనశైలి మార్పులు, ఊబకాయం కారణంగా క్యాన్సర్ ముప్పు పెరుగుతోంది. ప్రోస్టేట్ అనేది మూత్రాశయం దగ్గర కనిపించే పునరుత్పత్తి అవయవం. ఇది స్పెర్మ్‌ను పోషించడం, రక్షించడం చేస్తుంది. ప్రోస్టేట్ గ్రంధిలోని కణాల అనియంత్రిత పెరుగుదల క్యాన్సర్‌కు దారితీస్తుంది. ఇది వృద్ధాప్యం లేదా జన్యుపర సమస్యల వల్ల వస్తుంది.

వృద్ధులైన పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ సాధారణమైపోయింది. ప్రతి 8 మందిలో ఒకరికి ఈ ముప్పు పెరుగుతోంది. చాలా సందర్భాల్లో 70 ఏళ్ల వయస్సు వచ్చే సరికి ఈ వ్యాధి నిర్ధారణ అవుతోంది. ప్రొస్టేట్ శరీరంలో మారుమూలన దాగి ఉన్నందున దీనికి అంత సులువుగా బయాప్సీ నిర్వహించలేరు. అలాగే వ్యాధి నిర్ధారణ కష్టతరమవుతుంది. అందువల్ల పురుషీ నాళం ద్వారా పరీక్ష చేయాల్సి వస్తుంది. ఇది ఒకింత కష్టతరమైనదిగా చెప్పొచ్చు.

ఇతర క్యాన్సర్లలా ప్రొస్టేట్ క్యాన్సర్ పెద్దగా లక్షణాలు చూపించదు. గ్లెనీగల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ ఆంకాలజిస్ట్‌కు చెందిన డైరెక్టర్ డాక్టర్ ఎస్.రాజా సుందరం హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాలను వివరించారు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు. ప్రొస్టేట్ క్యాన్సర్‌లో సర్వసాధారణమైన లక్షణం యూరినరీ ట్రాక్ట్ లక్షణాలే. అంటే అత్యవసరంగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, తరచుగా వెళ్లాల్సి రావడం, మూత్ర విసర్జన సాఫీగా సాగకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలగే ప్రొస్టేట్ క్యాన్సర్ ఎముకలకు వ్యాప్తి చెందితే వెన్నునొప్పి కూడా వస్తుంది.

ప్రొస్టేట్ ఆరోగ్యాన్ని లైఫ్‌స్టైల్ ఎలా ప్రభావితం చేస్తుందో డాక్టర్ వివరించారు. ‘ప్రొస్టేట్ క్యాన్సర్‌కు నిర్ధిష్ట జీవనశైలి, ఆహార ముప్పు రుజువు కాలేదు. అయితే కాల్షియం, పాల ఉత్పత్తులు ముప్పును పెంచుతాయి..’ అని వివరించారు.

అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూరాలజీ డైరెక్టర్ డాక్టర్ టి.మనోహర్ ఈ అంశాలను వివరించారు. ‘చాలా వరకు క్యాన్సర్లను జీవనశైలికి సంబంధించినవే. అలాగే ఆహార అలవాట్లు, పర్యావరణ విష కారకాలు, పొగాకు, పారిశ్రామిక వ్యర్థాలు కూడా కారణమవుతాయి. అమితంగా మాంసాహారం తినడం, ఊబకాయం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్‌ ముప్పు పెరగొచ్చు. దీనికి తోడు జన్యుపరమైన కారణాలు కూడా ప్రొస్టేట్ క్యాన్సర్‌కు కారణం అవుతాయి..’ అని వివరించారు.

ప్రొస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స: డాక్టర్ మనోహర్

  1. ఫిట్‌గా లేని వారు, ఎర్లీ స్టేజ్‌లో క్యాన్సర్ నిర్ధారణ అయిన వారిలో నిరంతర నిఘా, పరిశీలన ఉంచాలి.
  2. సర్జరీ: రొబోటిక్ అసిస్టెడ్ ఆర్ఏఆర్‌పీ సర్జరీలో ప్రొస్టేట్‌ను తొలగిస్తారు. అలాగే చుట్టూ ఉండే కణతులను తొలగిస్తారు.
  3. రేడియేషన్ థెరపీని ఉపయోగించి క్యాన్సర్ కణాలను చంపేస్తారు.
  4. క్రయోథెరిపీ: స్థానికంగా క్యాన్సర్ కణాలను నాశనం చేస్తారు.
  5. హార్మోన్ థెరపీ ద్వారా నయం చేస్తారు.
  6. క్యాన్సర్ ముదిరినప్పుడు కీమోథెరపీ చేస్తారు.
  7. ప్రొస్టేట్ క్యాన్సర్‌కు వాక్సిన్స్‌తో కూడిన ఇమ్యునోథెరపీని కూడా ఇస్తారు.
  8. సాధారణ కణాలకు భంగం వాటిల్లకుండా క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని టార్గెటెడ్ థెరపీ చేస్తారు.

ప్రొస్టేట్ క్యాన్సర్‌కు సర్జరీ, రోబోటిక్ సర్జరీ, రేడియేషన్ థెరపీ, హార్మోనల్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలు ఉన్నాయని డాక్టర్ ఎస్.రాజాసుందరం చెప్పారు.