తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Small Flat Storage Hacks: ఈ టిప్స్ పాటిస్తే చిన్న ఫ్లాట్ కూడా.. అందంగా, విశాలంగా కనిపిస్తుంది..

Small Flat Storage Hacks: ఈ టిప్స్ పాటిస్తే చిన్న ఫ్లాట్ కూడా.. అందంగా, విశాలంగా కనిపిస్తుంది..

HT Telugu Desk HT Telugu

15 December 2023, 15:53 IST

  • Small Flat Storage Hacks: చిన్న ఫ్లాట్‌ సర్దుకునే విషయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే ఇల్లు విశాలంగా, అందంగా కనిపిస్తుంటి. ఆ టిప్స్ ఏంటో తెల్సుకోండి.

చిన్న ఫ్లాట్ సర్దుకోడానికి టిప్స్
చిన్న ఫ్లాట్ సర్దుకోడానికి టిప్స్ (freepik)

చిన్న ఫ్లాట్ సర్దుకోడానికి టిప్స్

చాలా మంది చిన్న చిన్న ఫ్లాట్‌లను తీసుకుని అపార్ట్‌మెంట్లలో నివసిస్తూ ఉంటారు. అద్దె కట్టి వేరే ఇంట్లో ఉండటం కంటే చిన్నదైనా సరే.. సొంత ఇల్లు కొనుక్కుని అందులో నివసించాలని చాలా మంది ప్రణాళికలు వేసుకుంటారు. ఇలాంటి చిన్న ఇళ్లలో ఫర్నిచర్‌, సామాన్ల విషయంలో కొన్ని విషయాలను తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. వీటిని సర్దుకోవడంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి.

వర్టికల్ స్పేస్:

చిన్న ప్లాట్‌లో చోటు తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా నిలువుగా స్థలాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. వెర్టికల్‌గా గార్డెన్లు, స్టోరేజీ స్పేస్‌లను ఉపయోగించుకునే విధంగా తీర్చి దిద్దుకోవాలి. అందువల్ల కింద చోటు మిగులుతుంది. ఇరుకుగా లేకుండా ఉంటుంది.

ఫర్నిచర్:

అలాగే ఇంట్లో కొనుక్కునే సోఫాలు, బెడ్‌లు లాంటివాటిని ఎంపిక చేసుకునేప్పుడు అవి మల్టీ ఫంక్షనల్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే కొన్ని బెడ్‌లకు కింద స్టోరేజ్‌ ఉంటుంది. అలాంటి వాటిని తీసుకోవచ్చు. అలాగే కొన్ని సోఫాకు బదులుగా సోఫా కం బెడ్‌ని ఎంచుకోవాలి. ఇలా ఒకటి కంటే ఎక్కువ విధాలుగా ఉపయోగపడే ఫర్నిచర్‌ని తీసుకుని సర్దుకోవాలి. అప్పుడు చోటు కలిసొస్తుంది. ఇల్లు ఇరుకుగా మారకుండా ఉంటుంది.

సామాన్లను కొనుక్కునే విషయంలోనూ, సర్దుకునే విషయంలోనూ కూడా తక్కువలో తక్కువ వాటిని ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అనవసరంగా ఏ చిన్న వస్తువునూ కొనుక్కోకూడదు. ఇంట్లో పెట్టుకోకూడదు. అలా అనవసరం అనుకున్న వస్తువుల్ని వేరు చేసి పెట్టుకోవాలి. పండుగలప్పుడు ఎలాగూ ఇల్లు శుభ్రం చేసుకుంటారు కదా. అలాంటప్పుడు ఆ వస్తువుల్ని తీసి అవసరం అయిన వారికి ఇచ్చేసేయాలి. ఇలా చేయడం వల్ల ఇల్లు మరింత విశాలంగా అనిపిస్తుంది.

అద్దాలతో అలంకరణ:

ఇంటి అలంకరణలో భాగంగా ఎక్కువగా అద్దాలతో కూడిన డిజైనర్‌ పీస్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవి కాంతిని మరింత పరావర్తనం చెందిస్తాయి. అందువల్ల ఇల్లు కాస్త ఖాళీగా ఉన్న భావన కలుగుతుంది. అలాగే ఇలాంటి చిన్న చిన్న ఇళ్లకు తేలికపాటి రంగుల్ని వేయాలి. ముదురు రంగుల జోలికి వెళితే మరీ మూసుకుపోయినట్లుగా ఉంటుంది. అలాగే మూలల్లో ఒక్కో మొక్కను పెట్టుకోవడం వల్ల కూడా వాతావరణం తాజాగా ఉన్న భావన కలుగుతుంది.

వంటింటి సామాన్లను కొనుక్కునేప్పుడు ఒకదాంట్లో ఒకటి పట్టేసే సెట్లను కొనుగోలు చేసుకోవాలి. అందువల్ల అక్కడ చాలా స్థలం కలిసి వస్తుంది. అలాగే కిచెన్‌ ఐలాండ్‌ ఉంటే దాన్నే భోజనం టేబుల్‌గానూ వాడుకునేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మళ్లీ అదనంగా డైనింగ్‌ టేబుల్‌ పెట్టుకునే అవసరం రాదు.

తదుపరి వ్యాసం