Smart Home Technology | మీ ఇంటిని స్మార్ట్‌గా మార్చుకోవాలంటే ఈ టెక్నాలజీ ఉండాలి!
28 February 2022, 15:15 IST
- టెక్నాలజీతో ప్రపంచం దూసుకుపోతుంది. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్ ఇలా ప్రతీది స్మార్ట్‌గా ఉంటోంది. ఇదే క్రమంలో చాలామంది ఇప్పుడు తమ ఇంటిని కూడా స్మార్ట్‌గా మార్చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో స్మార్ట్ హోమ్ టెక్నాలజీ ఒక ట్రెండింగ్ అంశం.
Smart Home- స్మార్ట్ హోమ్ టెక్నాలజీ
టెక్నాలజీతో ప్రపంచం దూసుకుపోతుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్ ఇలా ప్రతీది స్మార్ట్‌గా ఉంటోంది. ఇదే క్రమంలో చాలామంది ఇప్పుడు తమ ఇంటిని కూడా స్మార్ట్‌గా మార్చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో స్మార్ట్ హోమ్ టెక్నాలజీ ఒక ట్రెండింగ్ అంశం. మరి ఇంతకీ అసలు స్మార్ట్ హోమ్ అంటే ఏమిటి? మీ ఇంటిని ఎలా స్మార్ట్ చేసుకోవచ్చు? దాని వెనుక ఉన్న సాంకేతికత గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ పూర్తిగా చదవండి.
స్మార్ట్ హోమ్ టెక్నాలజీని సులభంగా అర్థం చేసుకోవడానికి ఇక్కడ వివరణ అందిస్తున్నాం. తద్వారా మీరు మీ ఇంటిని స్మార్ట్‌గా మార్చుకోవడానికి ఎవరి సహాయం తీసుకోనవసరం లేదు, ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన అవసరం ఉండదు. సమయం కూడా ఆదా అవుతుంది.
స్మార్ట్ హోమ్ టెక్నాలజీ అంటే మీ ఇంట్లో ఉపయోగించే స్మార్ట్ గాడ్జెట్‌లు, డివైస్‌లు అన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకురావడం.
ఈ టెక్నాలజీతో మీరు మీ ఇంటిలోని ప్రతి పరికరాన్ని ఒకే నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేసి, వాటన్నింటిని ఎక్కడ్నించైనా రిమోట్‌గా పర్యవేక్షించవచ్చు. వాటి పూర్తి కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంచుకోవచ్చు.
స్మార్ట్ హోమ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?
స్మార్ట్ హోమ్ టెక్నాలజీలో వైర్‌లెస్ కనెక్టివిటీ కలిగిన గాడ్జెట్‌లు, స్మార్ట్ టీవీ, సీసీ కెమెరాలు మొదలగు ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు నియంత్రించవచ్చు. ఇప్పుడు వస్తున్న కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలను కూడా కూడా ఎక్కడ్నుంచైనా మన నియంత్రణలో ఉంచుకోవచ్చు.
ఎలా అంటే, వీటన్నింటినీ ఒక ప్రత్యేక యాప్ లేదా ఒక స్మార్ట్ డివైస్ సహాయం అవసరమవుతుంది. మీరు మీ ఇంటి Wi-Fi ఇంటర్నెట్ నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేసినప్పుడు, ఈ పరికరాలన్నీ ఆ నెట్‌వర్క్‌కి కనెక్ట్ అవుతాయి. స్మార్ట్ హోమ్ వ్యవస్థలో ఈ పరికరాలన్నింటిని ఒక గ్రూప్/ రూమ్‌లో చేర్చవచ్చు.
ఈ ప్రకారంగా మీ వైఫై వీటికి మాత్రమే పనిచేస్తుంది. మీ ఇంటి ఆవరణలో, మీ వైఫై పరిధిలో ఏదైనా కొత్త డివైస్ పనిచేస్తున్నా ఇక్కడ చూడవచ్చు. దానిని నియంత్రించవచ్చు.
ఉదాహారణకు మీ వైఫైతో ఇతర స్మార్ట్ టీవీ ఏదైనా పనిచేస్తుంటే.. ఆ సమయంలో వారు ఏం చూస్తున్నారు, వారి స్క్రీన్ మీద ఏది ప్లే అవుతుందనేది మీకు సమాచారం వస్తుంది. దానిని పాజ్ చేయొచ్చు, వాల్యూమ్ పెంచడం, తగ్గించడం కూడా చేయొచ్చు. అంతేకాకుండా ఏ రోజుకారోజు వెబ్ హిస్టరీ కూడా తెలుసుకోవచ్చు. మీ వైఫై ఉపయోగించకుండా అడ్డుకోవచ్చు.
ఇలా ఒక్క వైఫైతోనే కాదు బ్లూటూత్, హాట్ స్పాట్ లాగా మీ వద్ద ఉండే డివైజ్ పనిచేస్తుంది. చిప్ సహాయంతో నడిచే వైర్ లెస్ స్విచ్ బోర్డ్ ఉంటే ఇంట్లో విద్యుత్ లైట్లు ఆన్/ఆఫ్ కూడా చేయవచ్చు. ఇలా ప్రతిదాన్ని చిన్న యాప్ సహాయంతో నియంత్రించవచ్చు.
ఇప్పుడు Apple HomeKit, Google Home, Amazon Alexa వంటి స్మార్ట్ హోమ్ ప్లాట్‌ఫామ్ లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కొత్తగా Matter అనే సరికొత్త ప్లాట్‌ఫామ్ కూడా రాబోతుంది.