తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sattu Pindi Recipes: బతుకమ్మకు నైవేద్యంగా పెట్టే.. మూడు సత్తు పిండ్ల తయారీ..

Sattu Pindi Recipes: బతుకమ్మకు నైవేద్యంగా పెట్టే.. మూడు సత్తు పిండ్ల తయారీ..

14 October 2023, 10:44 IST

google News
  • Sattu Pindi Recipes: బతుకమ్మకు నైవేద్యంగా రకరకాల సత్తుపిండ్లు తయారు చేస్తుంటారు. వాటిలో కొన్ని సులభంగా చేసుకునే సత్తుపిండి రెసిపీలు మీకోసం.

సత్తుపిండి రెసిపీలు
సత్తుపిండి రెసిపీలు (https://creativecommons.org/licenses/by-sa/4.0)

సత్తుపిండి రెసిపీలు

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ హడావిడి మొదలైనట్లే. మరి కొద్ది రోజుల పాటు బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. దేశ విదేశాల్లో ఉండే తెలుగు వారు ఈ పండగను ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆటపాటలతో వైభవోపేతంగా జరుపుకుంటారు. పూలను అమ్మవారిగా భావించి పూజించే గొప్ప సంప్రదాయం మనకిక్కడ కనిపిస్తుంది. ఈ పండుగ రోజుల్లో నైవేద్యంగా చేసే సత్తు పిండికీ ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనం ఇక్కడ మూడు రకాల సత్తు పిండి నైవేద్యాల గురించి తెలుసుకుందాం.

గోధుమ సత్తు పిండి:

గౌరమ్మకు నైవేద్యంగా పెట్టడానికి గోధుమ సత్తు పిండిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. మొత్తం ఓ పావు గంటలోనే ఇది సిద్ధం అయిపోతుంది. ఒక కప్పు గోధుమ పిండి, పావు కప్పు బెల్లం, రెండు యాలకులు, రెండు టేబుల్‌ స్పూన్ల నెయ్యిని సిద్ధం చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక కడాయిని తీసుకుని స్టౌ మీద పెట్టి వేడి చేయాలి. దానిలోకి గోధుమ పిండిని వేసుకుని పచ్చి వాసన పోయే వరకు దోరగా వేపించాలి. తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని బెల్లం, యాలకుల పొడి, నెయ్యి వేసి కలుపుకోవాలి. గోధుమ సత్తు పిండి తయారవుతుంది. అదే వీటిని లడ్డూల్లా చేసుకోవాలంటే మాత్రం ఇంకాస్త నెయ్యిని వేసి ఉండలు చుట్టుకోవాల్సి ఉంటుంది.

మక్క సత్తు పిండి:

మక్క సత్తు పిండిని తయారు చేసుకోవడానికి ఒక గ్లాసుడు మొక్క జొన్న గింజలు కావలి. అదే గ్లాసుతో పావు కప్పు చక్కెర అవసరం అవుతుంది. రెండు యాలకులు, రెండు చెంచాల నెయ్యిని సిద్ధం చేసి పెట్టుకోవాలి. పంచదారలో యాలుకలు వేసి మెత్తగా మిక్సీలో పొడి చేసి పెట్టుకోవాలి. మొక్క జొన్న గింజల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి. స్టౌ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. అందులో మక్క గింజల్ని వేసుకుని దోరగా వేపించుకుని పక్కనుంచుకోవాలి. చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అందులో పంచదార పొడి, నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. అంతే మక్క సత్తు పిండి సిద్ధమైనట్లే.

నువ్వుల సత్తు పిండి:

నువ్వుల సత్తు పిండి కోసం గ్లాసుడు నువ్వులు, అర గ్లాసుకు కాస్త తక్కువగా బెల్లంపొడి, కొంచెం యాలుకల పొడి, నెయ్యిని సిద్ధం చేసి పెట్టుకోవాలి. నువ్వుల్లో రాళ్లు లేకుండా ఏరుకుని శుభ్రం చేసుకోవాలి. వాటిని ఒక సారి కడిగేసుకుని ఎండలో పెట్టుకోవాలి. అవి శుభ్రంగా ఆరాక తెచ్చి పెట్టుకోవాలి. స్టౌ వెలిగించి గిన్న పెట్టుకోవాలి. అందులో నువ్వుల్ని వేసి చిటపటమనే వరకు వేగనివ్వాలి. వాటిని తీసి మిక్సీలో వేయాలి. మరీ ఎక్కువగా మిక్సీ వేస్తే నువ్వుల్లో ఉండే నూనె బయటకు వచ్చి అది పొడిలా కాకుండా, ముద్దగా అయిపోతుంది. అందుకని కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ చేసి తీసుకోవాలి. అందులోకి బెల్లం పొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి పొడిపొడిలాడేలా కలుపుకోవాలి. ఇష్టమైన వారు బెల్లం కాకుండా పంచదార పొడి అయినా వాడుకోవచ్చు.

తదుపరి వ్యాసం