తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Goru Chikkudu Fryums: గోరుచిక్కుడు వరుగు, పెరుగన్నం, పప్పన్నంలోకి సూపర్ కాంబినేషన్

Goru chikkudu fryums: గోరుచిక్కుడు వరుగు, పెరుగన్నం, పప్పన్నంలోకి సూపర్ కాంబినేషన్

15 October 2024, 15:30 IST

google News
  • Goru chikkudu fryums: గోరు చిక్కుడును ఎండలో ఎండబెట్టి చేస్తారు ఈ మజ్జిగ గోరు చిక్కుడు వరుగు. దీన్ని పెరుగన్నం , పప్పన్నంలోకి ఫ్రై చేసుకుని నంచుకుని తినొచ్చు. ఎలా తయారు చేయాలో చూద్దాం.

గోరుచిక్కుడు వరుగు
గోరుచిక్కుడు వరుగు

గోరుచిక్కుడు వరుగు

ఎండబెట్టి చేసే చల్ల మిరపకాయలు, మామిడికాయల వరుగు, టమాటా వరుగు .. ఇలాంటివన్నీ వినే ఉంటారు. పాతకాలంలో ఆహారం నిల్వ చేయడానికి వరుగులను చేసుకునేవారు. కొన్ని రకాల కూరగాయల్ని ఎండబెట్టి నిల్ల చేసుకుని కూరగాయలు దొరకని సమయాల్లో వీటిని వాడుకునేవారు. అలాంటి వాటిలాగే ఒక రెసిపీ గోరుచిక్కుడు కాయ లేదా గోకరకాయ వరుగు. దీన్ని కూడా చల్ల మిరపకాయల్లాగే నూనెలో వేయించుకునే తినేలాగా తయారు చేస్తారు. గోరు చిక్కుడు నేరుగా తినడం ఇష్టపడని వాళ్లు కూడా వీటిని పక్కాగా తినేస్తారు.

గోరుచిక్కడుగాయ వరుగు కోసం కావాల్సినవి:

అరకేజీ గోరు చిక్కుడుకాయ

అరచెంచాడు ఉప్పు

అర చెంచా పసుపు

పావు కప్పు పుల్లటి మజ్జిగ

అరచెంచా కారం

గోరుచిక్కడుగాయ వరుగు తయారీ విధానం:

  1. ఈ వరుగు కోసం కాస్త ముదురుగా ఉన్న గోరు చిక్కుడుకాయ ఎంచుకోండి. వాటిని కడుక్కుని పెట్టుకోండి.
  2. ఒక పాత్రలో నీళ్లు పోసుకుని బాగా ఉడుకు రానివ్వాలి. అందులో గోరు చిక్కుడుకాయ వేసుకుని కనీసం అయిదు నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ కట్టేసి ఓ అయిదు నిమిషాలు అలాగే వదిలేయండి.
  3. తర్వాత వాటిని నీటి నుంచి తీసి పల్లెంలోకి వేసుకోవాలి. ఒక రాత్రంతా అలా గాలికి ఆరనివ్వాలి.
  4. ఉదయాన్నే మజ్జిగ తీసుకుని అందులో కాస్త ఉప్పు, కారం వేసి బాగా కలుపుకుని గోరుచిక్కుడుగాయను రెండు గంటలైనా నానబెట్టుకోవాలి.
  5. తర్వాత తీసి ఎండలో మజ్జిగతో సహా ఎండబెట్టుకోవాలి. మళ్లీ సాయంత్రం పూట గోరు చిక్కుడును మజ్జిగలో నుంచి తీసి ఆరబెట్టాలి. ఉదయాన్నే మళ్లీ ఎండలో ఆరబెట్టాలి.
  6. ఇలా నాలుగైదు రోజులు చేస్తే మజ్జిగ పూర్తిగా ఇంకిపోతుంది. గోరు చిక్కుడు కాయ మజ్జిగను పీల్చుకుని పూర్తిగా ఆరిపోతుంది. పూర్తిగా ఆరిపోయాక గాలి చొరవని డబ్బాలో నిల్వ చేసుకుంటే సంవత్సరం పాటూ ఉంటాయి.
  7. వీటిని వేయించుకోడానికి కడాయిలో నూనె వేసుకుని వేడెక్కాక గుప్పెడు తీసి వేయించుకునే తీసేయడమే. మీద కాస్త ఉప్పు, కారం చల్లుకోవచ్చు.
  8. పెరుగన్నం, సాంబార్ రైస్ లాంటి వాటిలోకి నంచుకుని తినడానికి అదిరిపోతాయివి.

టాపిక్

తదుపరి వ్యాసం