Weed Management Tips: ఇంటి తోటలో కలుపు లేకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించండి..
21 December 2023, 13:31 IST
Weed Management Tips: ఇంట్లో ఉండే చిన్నపాటి మొక్కలు పెంచే స్థలంలో కలుపు బాగా పెరిగి ఇబ్బంది పెడుతుంది. కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకుంటే సమస్య నుంచి పూర్తిగా బయటపడొచ్చు.
కలుపు పెరగకుండా చిట్కాలు (freepik)
కలుపు పెరగకుండా చిట్కాలు
ఇటీవల కాలంలో గార్డెనింగ్ మీద ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటి దగ్గర కాస్త ఖాళీ స్థలం ఉన్నా కూడా మొక్కలు పెంచుకుని ఇంటి పంటను ఆనందిస్తున్నారు. మిద్దె తోటల్లో అయినా, ఇంటి తోటల్లో అయినా కలుపు అనేది ఎప్పుడూ ప్రధానమైన సమస్యగా ఉంటుంది. దీని నుంచి బయట పడేందుకు అద్భుతమైన చిట్కాలను నిపుణులు వివరిస్తున్నారిక్కడ.
కలుపు రాకుండా చిట్కాలు:
- కలుపు రాకుండా ఉండాలంటే ఖాళీగా నేల ఉండకూడదని నిపుణులు చెబుతుంటారు. అందుకనే షీట్లు వేసుకోవడం, మల్చింగ్ వేసుకోవడం లాంటివి చేయాలి.
- మొక్కలను పాతుకునేప్పుడు వరుసల్లో దగ్గర దగ్గరగా వేసుకోవాలి. అప్పుడు ఆ ఆకుల నీడ పడినంత చోటు దాకా దాదాపు కలుపు రాకుండా ఉంటుంది.
- నేల ఖాళీగా ఉందనుకున్న చోట తీగజాతి మొక్కలు నాటి కింద పాకించాలి. అలా చేయడం వల్ల ఆ పాదు పాకినంత వరకు కలుపు రాకుండా ఉంటుంది.
- మిద్దె తోటల్లో కుండీల్లో మొక్కలు పెంచుకుంటూ ఉన్నా సరే కలుపు మొక్కలు అనేవి వస్తూనే ఉంటాయి. అవి వస్తున్న సమయంలోనే పీకి పడేయడం అనేది మంచి పని. అలాగే కొన్ని ఎండు ఆకుల్లాంటి వాటిని మల్చింగ్‌గా వేసుకోవడం వల్ల ఈ ఇబ్బంది రాకుండా ఉంటుంది.
- ఇంటి తోటను అందంతోపాటు, కలుపు లేకుండా కూడా చేసుకోవాలంటే రైజ్డ్ బెడ్స్ అనేవి పనికి వస్తాయి. మనం నడిచే చోటంతా గ్రావెల్ రాళ్లలాంటివాటిని పరుచుకోవాలి. మిగిలిన చోట అడుగు ఎత్తులో చెక్క ఫ్రేం తయారు చేసుకుని అందులో పోషకాలు కలిపిన మట్టి నింపుకోవాలి. అప్పుడు ఈ బెడ్‌ల్లో మాత్రమే మట్టి ఉంటుంది. మిగిలిన చోట్ల ఉండదు కాబట్టి కలుపు తీయాల్సిన పని ఉండదు. ఇలా బెడ్లలో పెంచుకోవడం వల్ల మనం మట్టిని కాళ్లతో తొక్కం. కాబట్టి అది చాలా కాలం వరకు గుల్లగా ఉండి మొక్కలు ఆరోగ్యకరంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.
- ఆకు కూరల్లాంటివి పెంచుకునేప్పుడు ఎక్కువగా కింద కంటే కంటైనర్లలోనే పెంచుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల కలుపు అదుపులో ఉంటుంది. చిన్నగా కనిపిస్తున్నప్పుడు మనం తీసి పడేయడానికి ఆస్కారం ఉంటుంది.
- కలుపు రాకుండా ఉండాలంటే నీటిని పోసే విషయంలో తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. మొత్తం ఉన్న నేలంతా నీరు పోసేస్తే కలుపు ఇష్టా రాజ్యంగా వచ్చేస్తుంది. అలా కాకుండా కేవలం కావాల్సిన మొక్కల మొదళ్లకు మాత్రమే నీరు అందేలా పోసుకోవాలి. డ్రిప్ వేసుకుంటే కూడా ఈ విధమైన వెసులుబాటు ఉంటుంది. లేదంటే మొక్క మొదట్లో కత్తిరించిన వాటర్ బాటిల్‌ని గరాటులా గుచ్చి అందులోంచి నీరు పోయాలి. అప్పుడు తోటంతా కలుపు పెరిగిపోకుండా ఉంటుంది.