తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Loss With Jaggery: శరీరంలో పేరుకుపోయిన కొవ్వును బెల్లంతో కరిగించుకోవచ్చిలా..!

Weight Loss With jaggery: శరీరంలో పేరుకుపోయిన కొవ్వును బెల్లంతో కరిగించుకోవచ్చిలా..!

HT Telugu Desk HT Telugu

31 October 2023, 16:30 IST

google News
  • Weight Loss With jaggery: బెల్లాన్ని చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడటం వల్ల బరువు తగ్గడానికి సాయం చేస్తుంది. అదెలా సాధ్యమో తెలుసుకోండి. 

బెల్లంతో బరువు తగ్గడం
బెల్లంతో బరువు తగ్గడం

బెల్లంతో బరువు తగ్గడం

మారుతున్న జీవన శైలి, ఉరుకుల పరుగుల జీవితాలతో ఇటీవల కాలంలో చాలా మంది అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నారు. పొట్ట, నడుములో పేరుకుపోయిన కొవ్వులు మనలో అనేక అనారోగ్యాలకు కారణం అవుతాయి. అలాగే అధిక బరువు, ఊబకాయం లాంటివీ మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వుల్ని బెల్లంతో కరిగించుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలాగే అదనంగా బరువు పెరగకుండా నివారించుకోవచ్చనీ అంటున్నారు. ఆహారంలో ఏదో ఒక రూపంలో దీన్ని చేర్చుకోవడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. మరి బరువును తగ్గించడంలో బెల్లం ఏం చేస్తుందో ఏంటో తెలుసుకుందామా?

జీవ క్రియను మెరుగుపరిచి :

బెల్లం మనలోని జీవ క్రియను మెరుగుపరుస్తుంది. దీనిలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్లను శక్తిగా మార్చి శరీరానికి అందజేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందువల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వులు కరుగుతాయి. అందువల్ల బరువు తగ్గుతాం.

జీర్ణ క్రియను మెరుగుపరిచి :

బెల్లంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. అరుగుదల బాగుండి తిన్న ఆహారం సజావుగా జీర్ణం అవుతుంది. పీచు పదార్థం వల్ల పొట్ట ఎక్కువ సేపు నిండి ఉన్న భావన కలుగుతుంది. అందువల్ల తక్కువగా తింటాం. ఫలితంగా తక్కువ క్యాలరీలు లోపలికి చేరి బరువు తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది.

శక్తిని పెంచి :

బెల్లంని ఎనర్జీ బూస్టర్‌ అని చెప్పవచ్చు. దీనిలో ఐరన్‌ తగినంతగా దొరుకుతుంది. అందువల్ల శరీరం అంతటికీ ఆక్సిజన్‌ అవసరమైనంత లభిస్తూ ఉంటుంది. ఫలితంగా మనం ఎక్కువగా శక్తివంతంగా ఉన్న భావన కలుగుతుంది. మన శరీరం ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తున్నప్పుడు ఎక్కువ క్యాలరీలు కరిగే ఆస్కారం ఉంటుంది.

రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రించడం ద్వారా :

శరీరంలో, రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు సాధారణంగా మనం బరువు పెరిగిపోతాం. అయితే పంచదారతో పోలిస్తే బెల్లం గ్లైకమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. అంటే గ్లూకోజ్‌ తక్కువగా ఉంటుంది. దీని వల్ల అకస్మాత్తుగా రక్తంలో చక్కెర శాతం పెరిగిపోదు. ఫలితంగా ఇన్సులిన్‌ అసమతుల్యత చోటు చేసుకోదు. మనలో గ్లూకోజ్‌ ఎక్కువగా పేరుకోకపోతే మనం అసలు బరువే పెరగం.

అందుకనే పంచదారను వాడటానికి బదులుగా స్వీట్లు, కాఫీ, టీలు, పండ్ల రసాలు.. తదితరాల్లో బెల్లాన్ని వాడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది ఆరోగ్యాన్ని మరెన్నో రకాలుగా కాపాడుతుంది. రక్తహీనత లాంటివి దరి చేరకుండా, బరువు పెరగకుండానూ చూస్తుంది.

తదుపరి వ్యాసం