Mango Kernel |మామిడి పండు తిని టెంక పడేస్తున్నారా? అయ్యయ్యో వద్దమ్మా అలా చేయకండి
02 May 2022, 12:23 IST
- మీరు జీవితంలో ఎన్నో మామిడి పండ్లు తిని ఉండవచ్చు. కానీ ఎప్పుడైనా మామిడి టెంకను తిన్నారా? మీకు ఆ టెంకలోని గొప్పతనం తెలిస్తే మీరు టెంకను సైతం వదిలిపెట్టకుండా మొత్తం పండును గుటుక్కుమనిపిస్తారు.
Mango Kernel
మనకు సీజన్ ఏది ఉంటే ఆ సీజన్‌లో లభించే పండ్లను తీసుకోవడం ఎంతో ఆరోగ్యకరం. ఈ వేసవి మామిడి పండ్ల సీజన్ కాబట్టి మామిడి పండ్లను తీసుకుంటూ ఉండాలి. సాధారణంగా చాలా మంది మామిడి పండు గుజ్జును మాత్రమే తిని టెంకను పడేస్తారు. అయితే మీకు కొన్ని విషయాలు తెలిస్తే ఆ టెంకను సైతం వదిలిపెట్టకుండా మొత్తం పండును ఏమీ మిగిల్చకుండా మాయం చేసేస్తారు.
మామిడి పండు టెంక భాగం కూడా తినదగినదేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ టెంకలోనూ ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయని అంటున్నారు. మామిడి పండు తిని టెంకను పడేయకుండా అందులోని గింజను స్వీకరించవచ్చు. ఆ గింజను ఏ రకంగా తీసుకోవాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి? తదితర విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
విరేచనాల నివారణ కోసం
మామిడి టెంకను తొలచగా వచ్చిన గింజను తినడం ద్వారా లేదా పొడి చేసుకొని తీసుకోవడం ద్వారా విరేచనాల సమస్యల నుంచి బయటపడవచ్చు. మామిడిపండు తిన్న తర్వాత టెంక పడేయకుండా బాగా ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ ఎండిన టెంకలలోని (జీడి) గింజలను వేరు చేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని 1 గ్రాము తీసుకొని ఒక గ్లాసు నీళ్లలో కలిపి అందులో కొద్దిగా తేనె కలుపుకుని సేవించవచ్చు. ఒక్కసారికి 1 గ్రాము కంటే ఎక్కువ పొడి తీసుకోకూడదు.
మెరుగైన రక్త ప్రసరణ కోసం
మామిడి టెంకల పొడిని తీసుకోవడం వలన రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రిస్తుంది.
గుండెజబ్బులు ప్రమాదం నివారణ
మామిడి గింజల పొడిని మితంగా తీసుకోవడం ద్వారా అధిక రక్త పోటు నియంత్రణలో ఉంటుంది. ఈ క్రమంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. అయితే ఎక్కువగా తీసుకోకూడదు. ఇంతకుముందు చెప్పినట్లుగా 1 గ్రాము పొడిని మాత్రమే తీసుకోవాలి.
అసిడిటీ నుంచి ఉపశమనం
మీరు అసిడిటీ, ఉబ్బరం లాంటి ఉదర సమస్యలతో బాధపడుతుంటే మామిడి గింజల పొడి ప్రయోజనకరంగా ఉంటుంది. మామిడి గింజల్లో జీర్ణక్రియలో సహాయపడే ఫినాల్స్, ఫినాలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి.
స్కర్వీ వ్యాధికి ఔషధం
మామిడి గింజల్లోనూ విటమిన్ సి ఉంటుంది. స్కర్వీ రోగులకు మామిడి గింజల పొడి ఒక అద్భుత ఔషధంలా పనిచేస్తుంది. దీని కోసం మీరు చేయాల్సిందల్లా మామిడి గింజల పొడి తీసుకొని దానికి రెండింతలు బెల్లం, కొద్దిగా నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని తినడం ద్వారా స్కర్వీ రోగాన్ని తగ్గించవచ్చు.
ఏదేమైనా మామిడి పండ్లను తీసుకోవాలి కానీ అది మితంగా ఉండాలి. ఎందుకంటే మామిడి పండు సహజంగా వేడి గుణాలను కలిగి ఉంటుంది కాబట్టి మీ శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి అది ఇతర సమస్యలకు దారితీస్తుంది.