Kiwi Benefits- Side Effects | కివీ పండు ఆరోగ్యానికి మంచిది.. కానీ అతిగా తింటే..?
11 August 2022, 17:16 IST
- ఆరోగ్య నిపుణులు కివీని చాలా ప్రభావవంతమైన పండుగా పేర్కొంటారు. ఇది మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. అయితే ఎక్కువగా తినకూడదు. కివీ పండ్లు తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఎక్కువగా తింటే కలిగే అనర్థాలు తెలుసుకోండి.
Kiwi Fruits- Health Benefits, side effects
డెంగీ జ్వరం వచ్చినపుడు ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచటం కోసం కివీ పండ్లను తినాల్సిందిగా సిఫారసు చేస్తారు. వైరల్ ఇన్‌ఫెక్షన్‌ల నుంచి రక్షణ పొందాలన్నా, ఇతర కొన్ని వ్యాధులు నయం కావాలన్నా కివీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కివీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు అలాగే విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, కాల్షియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్, మెగ్నీషియం, కాపర్, జింక్, నియాసిన్, రైబోఫ్లావిన్, బీటా కెరోటిన్ మొదలైన పోషకాలు ఉన్నాయి. శరీరం సరిగ్గా పనిచేయడానికి ఈ పోషకాలన్నీ అవసరం. అయితే వివిధ రకాల ఆహార పదార్థాలు తినడం ద్వారా లభించే ఈ పోషకాలు, ఒక్క కివీ పండు తినడం ద్వారా కూడా లభిస్తున్నాయంటే ఈ పండు ఎంత ఆరోగ్యకరమైనదో అర్థం చేసుకోవచ్చు.
విటమిన్-సి పుష్కలంగా లభించే గొప్ప వనరులలో కివీ పండు ఒకటి అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో నారింజ లేదా నిమ్మకాయ కంటే రెట్టింపు విటమిన్-సి ఉంటుంది. కివీ మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. కివీ పండ్లు తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తిని పెంచడానికి
కివీ పండ్లను తీసుకోవడం వలన మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది వరకే చెప్పుకున్నట్లుగా ఇందులో విటమిన్-సి పుష్కలంగా లభిస్తుంది. కివీలో విటమిన్-సితో పాటు, యాంటీ-ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, అనేక రకాల వ్యాధుల నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి. కివీ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్తమా లక్షణాలు కూడా తగ్గుతాయి.
షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరం
మధుమేహంతో బాధపడుతున్న వారు రోజూ ఒక కివీ పండును తీసుకోవచ్చు. ఇది వారి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఈ పండు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉన్నందున, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మంచి రాత్రి నిద్రను కలిగించేందుకు సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది
విటమిన్ ఇ, సి, పొటాషియం వంటి పోషకాలు కివీ పండులో ఉన్నందున, ఇవి ధమనులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని విటమిన్-ఇ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కివీని రోజూవారీ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇతర అనేక అనారోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది.
రక్తహీనత సమస్య ఉండదు
కివీలో ఫైటోకెమికల్స్, లుటిన్ , జియాక్సంతిన్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరంలో ఐరన్ శోషణను పెంచడంలో సహాయపడతాయి. ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పోషకాలు కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి.
అయితే కివీ పండ్లను ఎక్కువగా కూడా తీసుకోవద్దు. మోతాదుకు మించి ఈ పండ్లను తింటే ఈ కింది దుష్ప్రభావాలు ఉండవచ్చు.
కివీని ఎక్కువగా తినడం వల్ల కలిగే అనర్థాలు
- కివీని అవసరమైన దానికంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు, వాపులు, మంటలు ఏర్పడతాయి. నోటిలో చికాకు మొదలైన అలర్జీ సమస్యలను కలిగిస్తుంది.
- చాలా మందిలో, కివీని అధికంగా తీసుకోవడం వల్ల నోటి అలర్జీ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇందులో నోరు, పెదవులు, నాలుకలో వాపు వస్తుంది.
- కిడ్నీ సమస్యలు ఉన్నవారు కివీ పండ్లకు దూరంగా ఉండాలి. కివీలో పొటాషియం ఉంటుంది, ఇది మూత్రపిండాల వ్యాధి ఉన్నవారికి హాని కలిగిస్తుంది. కిడ్నీ రోగులు ఆహారంలో కనీస మొత్తంలో పొటాషియం ఉపయోగించమని సలహా ఇస్తారు.
- కివీ ఎక్కువగా తినడం వల్ల కూడా తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. ఈ సమస్యలో, ప్యాంక్రియాస్‌లో వాపు ఉండవచ్చు . వ్యక్తికి ఉబ్బసం, కడుపు నొప్పి కూడా రావచ్చు.
- కివీలో అధికంగా ఉండే పీచు వల్ల అతిసారం, కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి.
అందువల్ల ఏదైనా సరే మితంగా తింటేనే ఆరోగ్యం, అమితంగా తింటే అమృతం కూడా విషం అని గ్రహించాలి. సాధారణ వ్యక్తి రోజుకి రెండు కివీ పండ్ల కంటే ఎక్కువ తినకూడదు.