Edible gold: బంగారం రుచి ఎలా ఉంటుంది? తినే బంగారం ఎలా తయారు చేస్తారు?
19 October 2024, 10:30 IST
Edible gold: బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వేసుకోవడమే కష్టం అంటే ఏం తింటాం అనుకోకండి. తినే బంగారమూ దొరుకుతుంది. దాని రుచి, వాడకం, ధర గురించి తెల్సుకోండి.
తినే బంగారం
స్వీట్ల మీద కొన్ని వంటల మీద సిల్వర్ షీట్ వాడటం చూసే ఉంటారు. కానీ బంగారం కూడా అలాగే తినేయొచ్చు. బంగారం తినేలా ఎలా తయారు చేస్తారానీ? దానికి ఏదైనా రుచి ఉంటుందా? ఆ వివరాలన్నీ చూసేయండి.
ఎడిబుల్ గోల్డ్ దొరుకుతోందిలా :
మనం తినాడానికి వీలుగా ఉండే ఎడిబుల్ గోల్డ్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంటోంది. గోల్డ్ లీఫ్‌లు, గోల్డ్ ఫ్లేక్స్, గోల్డ్ డస్ట్... లాంటి అనేక రూపాల్లో ఇది లభ్యం అవుతోంది. ఈ ఎడిబుల్ గోల్డ్ తప్పకుండా 23 లేదా 24 క్యారెట్ల బంగారంతో తయారవుతుంది. రెండు వందల రూపాయలల్లో చిన్న షీట్ నుంచి మొదలుగొని ఇవి దొరకడం ప్రారంభం అవుతాయి. ఇలా నచ్చిన రూపంలో ఉన్న గోల్డ్ కొనుక్కుని ఆరగించేందుకు వాడేయొచ్చు. సమోసాలు, బజ్జీలు, ఐస్ క్రీములు, స్వీట్లు ఇలా మీరు వండిన దేని మీదైనా సరే కాస్త ఈ బంగారు పొడిని చల్లేయొచ్చు. ఆ విందును మరింత విలాసవంతంగా మార్చేయవచ్చు.
తినే బంగారం తయారు చేస్తారిలా:
స్వచ్ఛమైన బంగారంతో ఎడిబుల్ గోల్డ్ తయారు చేస్తారు. గోల్డ్ లీఫ్ తయారీకోసం బంగారాన్ని 1000 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలో వేడి చేస్తారు. అది కరిగాక ఒక బార్ లాగా తయారు చేసి దాన్ని అనేక సార్లు ప్రెస్ చేసి, రోల్ చేసి పలుచని రేకు తయారు చేస్తారు. ఆ రేకు మందం దాదాపు ఎక్కువలో ఎక్కువ 0.0001మిల్లీ మీటర్లు ఉంటుందంతే. దాంతో చాలా తక్కువ బరువుతో ఆహారాల మీద పూత వేయడం, చల్లడం, పొడిలా మార్చి వాడటం సాధ్యం అవుతుంది.
రుచి ఎలా ఉంటుంది?
బంగారానికి ఏ రుచి, వాసనా ఉండవు. అది ఏ చర్యా జరపదు. కాబట్టి చూడ్డానికి మెరుపులు తప్ప తింటే ఏ తేడా తెలీదు. ఆహారానికి ఈ ఎడిబుల్ గోల్డ్ వల్ల ఎలాంటి ప్రత్యేక మైన రుచి రాదు. హోదా, విలువ, అందం పెరుగుతుందంతే.
అక్కడ ఎప్పటి నుంచో :
దుబాయ్, ఖతార్.. లాంటి అరబ్ దేశాల్లో విలాసవంతమైన విందుల్లో బంగారం వాడకం అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే గత కొన్నేళ్లుగా ఇలా బంగారు పూత పూసిన ఆహారాలను తినడం మన దగ్గరా మొదలైంది. బాగా ధనవంతులైన వారి ఇళ్లల్లో పెళ్లిళ్ల భోజనాల్లోనూ వీటిని పెడుతున్నారు. తమిళనాడులో నలాస్ ఆపా కడాయ్ అని ఓ ప్రముఖ చైన్ రెస్టారెంట్ ఉంది. అక్కడ వారు తయారు చేసే ఆపంపై వంద మిల్లీ గ్రాముల బంగారు పొడిని చల్లి ఇస్తారు. ఇలా బంగారంతో తయారు చేసిన వంటకాలెన్నో ఉంటున్నాయిప్పుడు. మెరిసే వంట మన చేతిల్లో ఉండాలంటే ధర కూడా దానికి తగ్గట్లు ఉంటుందనుకోండి.
బంగారాన్ని తినొచ్చా :
నగలు తయారీకి వాడే బంగారాన్ని తినొచ్చా? అనే అనుమానం మనందరికీ తప్పకుండా వస్తుంది. అయితే దీనిలో కొంచెం మార్పులు చేసిన ఎడిబుల్ గోల్డ్‌ని ఎలాంటి అనుమానం లేకుండా తినొచ్చని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. ఎందుకంటే గోల్డ్ దేనితోనూ చర్య జరపదట. ఆ కారణంగా కొంచెంగా దీన్ని తినడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలూ ఉండవని తేల్చి చెబుతున్నారు. మరింకెందుకాలస్యం. ప్రయత్నించి చూస్తారా?
టాపిక్