తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Salt Intake: ఉప్పు ఎక్కువ తింటే అసలేమవుతుంది? రోజూ ఎంత ఉప్పు తినడం ఆరోగ్యకరం..

Salt intake: ఉప్పు ఎక్కువ తింటే అసలేమవుతుంది? రోజూ ఎంత ఉప్పు తినడం ఆరోగ్యకరం..

HT Telugu Desk HT Telugu

05 October 2023, 15:26 IST

google News
  • Salt intake: ఉప్పు ఎక్కువగా తినకూడదని తెలుస్తుంది కానీ.. తింటే ఏమవుతుందనే స్పష్టత ఉండదు. ఆ విషయం గురించి, రోజూ ఎంత మోతాదులో ఉప్పు తింటో మంచిదనే విషయం గురించీ స్పష్టత తెచ్చుకోండి.

ఉప్పు ఎక్కువగా తింటే నష్టాలు
ఉప్పు ఎక్కువగా తింటే నష్టాలు (pexels)

ఉప్పు ఎక్కువగా తింటే నష్టాలు

మన రోజు వారీ వంటలకు రుచిని చేర్చే పదార్థం ఉప్పు. దీన్ని మితంగా తినడం వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ మన శరీర అవసరాలకు మించి ఉప్పు లోపలికి చేరిందంటే మాత్రం చాలా ప్రమాదం. ఇది గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. హార్ట్‌ ఎటాక్‌ల ప్రమాదం ఎక్కువవుతుంది. భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ గుండె జబ్బుల వల్ల చనిపోయే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మన దేశంలో దాదాపు 30 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. లోపల బీపీ ఉన్నా తెలియకుండా ఉన్న వారు మరో 15 శాతం వరకు ఉంటారని అంచనా. దీనంతటికీ కారణం మనం అదనంగా ఉప్పును తినడమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి అసలు మనం రోజుకు ఎంత ఉప్పును తినాలి? అదనంగా తినకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఉప్పు తినడం వల్ల అసలు గుండెకు ఏమవుతుంది? లాంటి విషయాలన్నింటి వివరంగా తెలుసుకుందాం.

ఉప్పు ఎక్కువైతే ఏమౌతుంది?

ఉప్పులోని సోడియం వల్ల రక్త పోటు పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల మన రక్త నాళాల్లో రక్త ప్రసారం అయ్యే ఒత్తిడి పెరుగుతుంది. అలా ఒత్తిడి పెరగడం వల్ల రక్త నాళాలు సాగి వంకీలు తిరిగినట్లుగా అవుతాయి. ఒంపులు తిరిగిన ఆ నాళాల్లో మూలలు క్రియేట్‌ అవుతాయి. అక్కడ కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది. ఆ కొవ్వు కొన్ని రోజులకు అలా అలా పెరుగుతూ రక్త నాళాన్ని సన్నగా చేసేస్తుంది. అందు వల్ల అది ఒక స్థాయిని దాటిన తర్వాత హైబీపీగా మారుతుంది. అధిక రక్తపోటు వల్ల గుండె ఎక్కువగా ప్రభావితం అవుతుందని మనకు తెలుసు. కానీ కిడ్నీల పనితీరుపైనా ఇది చెడు ప్రభావాన్ని చూపుతుంది. మెదడుకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదమూ ఉంది. పక్షవాతం వచ్చే అవకాశాలూ ఉంటాయి.

ఉప్పు రోజుకు ఎంత అవసరం?

అమెరికన్‌ డైటరీ గైడ్‌ లైన్స్‌ రికమండ్‌ చేస్తున్నది ఎంతంటే రోజుకు 2.3 గ్రాముల వరకు ఉప్పు ఒక మనిషికి అవసరం. అంతకంటే ఎక్కువ తినడం వల్ల ఈ కార్డియో వాస్క్యులర్‌ సమస్యలు తలెత్తుతాయి. ఉప్పును తగ్గించి తినడం ద్వారా ఇలాంటి రోగాలకూ దూరంగా ఉండొచ్చు.

ఉప్పు తగ్గించి తినడం ఎలా?

కూరల్లో ఎక్కువ ఉప్పును వండేప్పుడే వేసేయకూడదు. కూర అంతా అయిపోయిన తర్వాత తినేందుకు ప్లేట్‌లో పెట్టుకున్నప్పుడు కాస్త ఉప్పు చల్లి తినాలి. అందువల్ల తక్కువ ఉప్పును తినే ఆస్కారం ఉంటుంది. అలాగే స్నాక్స్‌ టైంలో పకోడీలు, బజ్జీలు, బ్రెడ్‌లులాంటి సాల్టీ స్నీక్స్‌ కాకుండా వెజిటెబుల్‌ సలాడ్‌లు, పళ్లు, పళ్ల రసాలు, సహజ ఆహార పదార్థాలు తీసుకోవాలి. ప్యాక్డ్‌ స్నాక్స్‌ని తినడం మానేయాలి.

తదుపరి వ్యాసం