Social Anxiety: ఇంట్రోవర్ట్ అని చెప్పి దాటేయకండి.. అది సోషల్ యాంగ్జైటీ కావచ్చు..
20 November 2023, 17:45 IST
Social Anxiety: సోషల్ యాంగ్జైటీ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి. నలుగురిలో కలవలేకపోవడంతో పాటూ మరికొన్ని సమస్యలుంటే గమనించుకోవాలి. అవి సోషల్ యాంగ్జైటీకి సూచనలు కావచ్చు. అవేంటో తెల్సుకోండి.
సోషల్ యాంగ్జైటీ
కొంత మందికి నలుగురు ఉన్న దగ్గరకి వెళ్లాలంటే భయం. నలుగురిలో నడవాలంటే చాలా సిగ్గు. అందరి చూపు తమపై ఉందంటే ఇక నోట మాట రాదు. అడుగు ముందుకు పడదు. ఇలాంటి మోహమాటాలతో వారు అసలు బయటికే రారు. నలుగురు ఉండే పబ్లిక్ ప్లేసుల్లోకి, పార్టీలకు, ఫంక్షన్లకు ఎప్పుడూ రారు. ఇది వారికి స్వతహాగా వచ్చిన లక్షణం కాదు. దీన్నే సోషల్ యాంగ్జైటీ అంటారు. సోషల్ ఫోబియా అనే పేరూ దీనికి ఉంది. మరి దీనితో బాధపడే వారికి అసలు ఏమేం లక్షణాలు ఉంటాయి. దీనికి చికిత్సలు ఏమైనా ఉన్నాయా? లాంటి వివరాలన్నింటినీ ఇక్కడ చూసేద్దాం.
సోషల్ ఫోబియా ఉన్న వారి లక్షణాలు :
- కొత్త వ్యక్తుల్ని కలవాలన్నా, అందరితో కలుపుగోలుగా మాట్లాడాలన్నా ఇబ్బందిగా ఉంటుంది.
- ఎక్కువగా ఎవ్వరికీ ఫోన్లు చేయరు. తక్కువ మందితో మాత్రమే వీరు మాట్లాడతారు.
- బయటకు ఎక్కువగా రారు. వచ్చినా బయట రెస్ట్ రూంలను అస్సలు వాడరు.
- బయటకు వచ్చినప్పుడు ఏం అవసరం వచ్చినా ఎవరినీ సాయం అడగరు. తీవ్రంగా మొహమాటంతో ఉంటారు.
- డేటింగ్ల లాంటి వాటికి వీరు చాలా దూరంగా ఉంటారు.
- పది మందిలో తినడానికీ ఇబ్బంది పడుతుంటారు.
- ఫ్రెండ్స్ బ్యాచ్‌లతో కలిపి చిట్‌చాట్లలో పాల్గొనరు. వీరికి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే స్నేహితులు ఉంటారు.
ఇలాంటి లక్షణాలు ఉన్న వారిని కచ్చితంగా సోషల్ యాంగ్జైటీతో బాధ పడుతున్న వారిగా మనం గుర్తించవచ్చు. లక్షణాల తీవ్రతను బట్టి వీటిని మైల్డ్ సోషల్ యాంగ్జైటీ, మోడరేట్ సోషల్ యాంగ్జైటీ, ఎక్స్‌ట్రీమ్ సోషల్ యాంగ్జైటీలుగా విభజిస్తారు. మనలో చాలా మంది ఇలాంటి స్థితిని ఒక స్థాయిలో దాటుకుని వచ్చిన వారే అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక వయసులో కొందరు ఈ రకంగా ఉంటారని అంటున్నాయి. ఐదు నుంచి పది శాతం మంది ఇలా ఇబ్బందులు పడే తర్వాత మళ్లీ మామూలుగా మారతారని వెల్లడించాయి.
చికిత్సలు :
మానసిక వైద్యులు కొన్ని రకాల ప్రశ్నలు అడగడం, కొన్ని పరికరాల్ని వాడటం ద్వారా వీరిలో ఈ లక్షణాలు ఉన్నాయా? అనే దాన్ని నిర్ధారిస్తారు. ఒక వేళ వీరు బాధితులు అని తేలితే గనుక తర్వాత చికిత్సలు ప్రారంభిస్తారు.
దీని నుంచి బయట పడేందుకు కొన్ని రకాల మందుల్ని సిఫార్సు చేస్తారు. కొందరు సాధారణ ఆందోళనకు ఇచ్చే మందుల్నీ దీనికి ఇస్తుంటారు. అలాగే కొన్ని రకాల థెరపీల ద్వారానూ వీరిని ఈ స్థితి నుంచి బయట పడేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి లక్షణాలు కనిపిస్తున్నట్లయితే తప్పకుండా మానసిక వైద్య నిపుణుల్ని కలవడం అనేది తప్పనిసరిగా చేయాలి.