Black Turmeric: ఔషధ గుణాలున్న నల్ల పసుపు వాడి చూశారా? దీంతో ఆరోగ్యానికి రక్ష..
02 November 2023, 14:40 IST
Black Turmeric: నల్ల పసుపు గురించి చాలా తక్కువగా వింటాం. కానీ మామూలు పసుపు కన్నా దాంట్లో ఔషధ గుణాలెక్కువ. అవేంటో వివరంగా తెలుసుకోండి.
నల్ల పసుపు
పసుపు మనందరికీ తెలిసిన ఔషధ మూలిక. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకనే దీన్ని మనం రోజూ కూరల్లో కొద్దిగా వేసుకుని తింటూ ఉంటాం. మరి ఇదే జాతిలో మరో వెరైటీ మొక్క అయిన నల్ల పసుపులో అనేక ఔషధ విలువలు ఉన్నాయి. కుర్క్యుమిన్ ఇందులో ఇంకా ఎక్కువగా ఉంటుంది. మామూలు పసుపుతో పోలిస్తే దీన్ని తినడం వల్ల భిన్నమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి. ఈ పసుపు మామూలు దుకాణాల్లోనూ, ఆన్‌లైన్ లోనూ అందుబాటులో ఉంటుంది.
నల్ల పసుపుతో ఆరోగ్య ప్రయోజనాలు :
- నల్ల పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మపు ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపెడతాయి. ఇవి శరీరంలోని ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి చర్మాన్ని కాపాడతాయి. అలాగే దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ముఖంపై వచ్చే మొటిమలు, గుల్లల్లాంటి వాటిని తగ్గిస్తాయి. వీటికి వేసుకునే ఫేస్ ప్యాక్లలో నల్ల పసుపును ఉపయోగించుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు.
- నల్ల పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో గాయాలు, దెబ్బల వల్ల వచ్చిన వాపుల్ని తగ్గించడంలో ఇది సహకరిస్తుంది. అంతేకాకుండా శరీర అంతర్గత భాగాల్లో వచ్చే వాపుల్నీ ఇది నివారిస్తుంది. అందువల్ల ఆర్థరైటిస్ లాంటి వ్యాధులు తగ్గిపోతాయి.
- దీన్ని మంచి నొప్పి నివారణి అని చెప్పవచ్చు. మైగ్రేన్, తలనొప్పులు లాంటి వాటిని తగ్గించడానికి ఇది సహకరిస్తుంది.
- జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో నల్ల పసుపు ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుంది. జీర్ణ కోశం ఇబ్బందుల్ని తొలగిస్తుంది. అందువల్ల అజీర్ణం, పొట్ట ఉబ్బరం, గ్యాస్ లంటివన్నీ తగ్గి జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రించడంలోనూ సహాయపడుతుంది. అలాగే శరీర బరువును నియంత్రించడంలోనూ సహకరిస్తుంది.
- రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇది తన వంతు పాత్రను పోషిస్తుంది. బ్యాక్టీరియాలు, వైరస్‌లు, ఫంగస్‌లు.. తదితర పరాన్న జీవుల వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది.
- శ్వాస కోశ వ్యాధులను తగ్గించడంలో నల్ల పసుపు మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల జలుబు, దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- నల్ల పసుపు ముదురు ఊదా రంగులో ఉంటుంది. అందుకు ఆంథోసైనిన్ అనేది సహకరిస్తుంది. ఇది కొన్ని రకాల క్యాన్సర్లను రానీయకుండా చేస్తుందని అధ్యయనాల్లో తేలింది.
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే నల్ల పసుపును ఎక్కడ దొరికినా తెచ్చుకుని ఇంట్లో వాడుకునే ప్రయత్నం చేయాలని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.