Tips to Reduce grocery bill: కిరాణా సరుకులకు మాల్ వెళుతున్నారా? బిల్లు ఇలా తగ్గించుకోండి
31 January 2023, 11:23 IST
- Tips to Reduce grocery bill: కిరాణా సరుకులను ఆన్‌లైన్‌లో గానీ, బాగా ప్రాచుర్యం పొందిన మార్ట్‌లలో గానీ తేవడం పట్టణవాసులకు అలవాటైపోయింది. అలా మాల్‌కు వెళ్లినప్పుడు బిల్లు తడిసిమోపెడవుతుంది. దానిని తగ్గించాలంటే ఈ టిప్స్ పాటించండి.
గ్రాసరీ స్టోర్ (ప్రతీకాత్మక చిత్రం)
Tips to Reduce grocery bill: కిరాణా సరుకుల కోసం ఇంటి నుంచి మాల్ బయలుదేరేముందు మనకు ఓ 10 నుంచి 15 సరుకులు అవసరం.. అవే తెచ్చుకుందాం అనుకుంటాం. కానీ వచ్చే టప్పుడు 50 సరుకులు వెంట ఉంటాయి. రూ. 2 వేలు కావాల్సిన బిల్లు కాస్తా.. రూ. 5 వేలు దాటుతుంది. బిల్లు చూసి లబోదిబోమని మొత్తుకుంటాం. ఇలాంటప్పుడు మన ఆర్థిక క్రమశిక్షణ తప్పి.. చివరకు లోటు బడ్జెట్‌కు దారితీస్తుంది. అంతిమంగా అప్పులపాలవుతాం. అసలే నిత్యావసర వస్తువుల ధరలు, వంట గ్యాస్ ధరలు, పెట్రోలు ధరలు భారీగా పెరిగి నెలవారీ వేతన జీవులు, మధ్య తరగతి జీవులు నానాఇక్కట్లకు గురవుతున్నారు. మరి గ్రాసరీ బిల్స్ తగ్గించుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.
1. కిరాణా సరుకుల లిస్ట్ రాయండి
ఇంట్లో కిరాణా సరుకులు అయిపోతే, ఈ నెలలో ఏ సరుకులు కావాలో వాటిని మాత్రమే లిస్టులో రాయండి. అలాగే పక్కన క్వాంటిటీ కూడా రాయండి. ఒక నెల రోజులకు సరిపడా మాత్రమే క్వాంటిటీ రాయండి. ఎక్కువ రోజులు ఉంటే కొన్ని పాడైపోతాయి. అలాగే నెలనెలా సేల్ ఉన్నప్పుడు కొంత నిర్ధిష్ట మొత్తంలో కొనుగోలు చేస్తే ఆఫర్లు కూడా ఉంటాయి. అందువల్ల క్వాంటిటీ పరిమితం చేయండి. మీ బడ్జెట్ కూడా అడ్జస్ట్ అవుతుంది. అయితే కొన్ని సరుకులు (పాడవినవి) ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ధర తక్కువ పడుతుంది. ఉదాహరణకు వాషింగ్ మిషన్‌లో వేసే డిటర్జంట్ పొడి. సాధారణంగా ఐదారు కిలోల పౌడర్ గల ప్యాకేజీకి ధర తక్కువగా ఉంటుంది. ఆఫర్లు ఉన్నప్పుడు ఇంత పెద్ద క్వాంటిటీ కొనుగోలు చేసినా నష్టం లేదు.
2. పక్కా అయితేనే కొనుగోలుకు మొగ్గు చూపండి
ఒక్కోసారి చిన్న పిల్లలు అడిగారని హెల్త్ డ్రింక్స్ పొడులు అని, అదీ ఇదీ అని కొనేస్తుంటారు. చాక్లెట్ ఫ్లేవర్ కావాలని ఒకరు, వనీలా ఫ్లేవర్ కావాలని ఇంకొకరు. తీరా ఇంటికొచ్చాక ఇద్దరు పిల్లల్లో ఎవరూ ఏదీ తాగరు. అలా అనవసరంగా డబ్బులు వృథా. కావాలంటే చిన్న ప్యాక్ తెచ్చి ఇచ్చి చూడండి. తాగితే ఇంకోసారి తీసుకురండి.
3. ప్యాకేజ్డ్ ఫుడ్, ఫ్రోజెన్ ఫుడ్‌కు దూరంగా ఉండండి
ప్యాకేజ్డ్ ఫుడ్ అంటే నిల్వ ఉన్న ఆహార పదార్థాలు. నిల్వ ఉండాంటే రసాయనాలు కలుపుతారు. అందువల్ల వీటి జోలికి వెళ్లకండి. అలాగే ఫ్రోజెన్ ఫుడ్ కూడా రసాయనాల సమ్మేళనమే. అనేక వ్యాధులు చుట్టుముడుతున్న ఈ రోజుల్లో సాధ్యమైనంత మేరకు సహజ ఆహార పదార్థాలను ఎంచుకోండి. ఇంటి ముందు కూరగాయల మార్కెట్లో చౌకగా లభిస్తాయి.
4. ఆఫర్లు పరిశీలించండి..
చాలా మందికి సమయం దొరకక ఆఫర్లు పరిశీలించే ఓపిక లేక డబ్బులు వృథా చేస్తారు. ఈ పోటీ యుగంలో చాలా మాల్స్ వెలిశాయి. ఆన్‌లైన్‌లోనూ గ్రాసరీస్ కొనుక్కోవచ్చు. అందుకే ముందుగా ఆన్‌లైన్‌లో ధరలు చెక్ చేయండి. చౌకగా దొరుకుతాయనుకున్న మాల్స్ ధరలతో పోల్చి చూడండి. నిజంగానే చౌకగా ఉంటే అక్కడే కొనడం బెటర్. కొన్ని ఆన్‌లైన్ గ్రాసరీ షాపుల్లో నిర్ధిష్ట క్రెడిట్ కార్డులపై 5 శాతం క్యాష్ బ్యాక్ ఉంటుంది. అలాగే నిర్ధిష్ట మొత్తంలో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ లేదా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇవన్నీ పరిశీలించడం వల్ల మీ గ్రాసరీ బడ్జెట్ కాస్తయినా తగ్గొచ్చు. నెలనెలా సరుకులు కొనుగోలు చేయడం తప్పనిసరైనందున కాస్త మిగిలినా ఏడాది పొడవునా లెక్కిస్తే బాగానే ఆదా చేయవచ్చు. డబ్బులు ఊరికే రావు కదా మరి.
5. మాల్‌లోకి వెళ్లాక ఇలా చేయండి..
మాల్‌లోకి ఎంటర్ అయ్యాక గ్రాసరీ విభాగంలో అన్నీ చూస్తూ వెళ్లకండి. ముందుగా మీ లిస్ట్ తీసి, అందులో ఉన్న సరుకులు అన్నీ లభ్యమై, అవన్నీ తీసుకున్నాకే ఇక మిగిలిన వాటిపై ఓ లుక్కేయండి. అంతేగానీ కనిపించినవన్నీ కొనేస్తూ పోతే మీ అసలు లిస్టులోని సరుకులు కొనడం మీకు ఆర్థికంగా భారాన్ని మిగుల్చుతుంది. లిస్టులో సరుకులు కొన్నాక, ఇంకా ఏవైనా ఆఫర్లలో చౌకగా వస్తే వాటిని మాత్రమే పరిశీలించండి.
6. ప్యాకేజ్డ్ సరుకుల కంటూ లూజుగా దొరికేవీ చూడండి..
ఒక్కోసారి ప్యాకేజ్డ్ సరుకుల ధరలు లూజులో దొరికే సరుకుల కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు పప్పులు, చక్కెర, అటుకులు, బియ్యం వంటివన్నీ లూజులో దొరికేవాటికి ధర తక్కువ. మీకు నచ్చిన క్వాంటిటీలో తీసుకోవచ్చు. బడ్జెట్ అటూఇటూ కాకుండా ఉంటుంది. ధర తక్కువగా ఉంటే ఖర్చు ఆదా కూడా.
7. పండ్లు, కూరగాయలు ఇక్కడొద్దు..
చాలా వరకు మాల్స్, సూపర్ మార్కెట్లలో పండ్లు, కూరగాయలు ఫ్రెష్‌గా ఉండకపోవడాన్ని మీరు గమనించవచ్చు. అందువల్ల వీటిని మీ ఇంటి దగ్గరి వీక్లీ కూరగాయల మార్కెట్లోనే, లేక దగ్గరలోని రైతు బజార్‌లోనో కొనుగోలు చేయడం మేలు. తాజాగా దొరుకుతాయి. ధరలు కూడా రీజనబుల్‌గానే ఉంటాయి.
8. గ్రాసరీస్ కోసం వెళ్లి.. ఆగం కాకండి..
చాలా మంది కిరాణా సరుకుల కోసమని మాల్, బడా సూపర్ మార్కెట్లు వెళ్లి, దుస్తులు, ఇంటికి కావల్సిన ఇతర సామాను కొనుగోలు చేస్తారు. మీరు మీ లిస్టులో రాసుకొచ్చి ఉంటేనే వాటిని కొనుగోలు చేయండి. లిస్టులో ఉంటేనే అవి మీకు అవసరమని భావించండి. లేదంటే వాటి జోలికి వెళ్లండి. వెళితే ముందే చెప్పినట్టుగా మీ గ్రాసరీ బిల్లు తడిసి మోపడవుతుంది. అలా అయితే మీ నెలవారీ ఇతర అవసరాలపై ప్రభావం పడుతుంది.
టాపిక్