Excessive Exercise : ఈ తప్పుల వల్లే అధిక వ్యాయామం గుండెపోటుకు దారితీస్తుందట
27 November 2023, 18:00 IST
- Excessive Exercise Problems : ఏదైనా అతిగా అయితే ముప్పు. అందులో ఒకటి వ్యాయామం కూడా. వ్యాయామం తక్కువగా చేస్తే ఏం కాదు. కానీ ఎక్కువగా చేస్తే ప్రాణాలకే ప్రమాదం.
ప్రతీకాత్మక చిత్రం
కడుపు నిండా తినడం, కంటి నిండా నిద్రపోవడం మనిషికి ఎంత ముఖ్యమో.. శరీరానికి చెమట పట్టే వరకూ వ్యాయామం చేయడం కూడా అంతే ముఖ్యం. శారీరక శ్రమ లేకపోతే.. మనిషి ఆరోగ్యంగా ఉండడు. తిని కుర్చుంటే..కొండలు కరుగుతాయో లేదో కానీ.. కొవ్వు మాత్రం కచ్చితంగా పెరుగుతుంది. అందుకే చాలా మంది జిమ్‌లో వ్యాయామాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే.. అతిగా ఎక్సర్‌సైజ్‌లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గడిచిన మూడేళ్లలో వ్యాయామం చేస్తూ చనిపోయిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ ఎంతోమంది జిమ్‌లో వర్క్‌ఔట్స్ చేస్తూ స్పాట్‌లోనే చనిపోతున్నారు. అధిక వ్యాయామంతో హార్ట్ ఎటాక్ వస్తుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
అధిక వ్యాయామంతో గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. తీవ్రమైన శారీరక శ్రమ సమయంలో, కండరాలకు ఆక్సిజన్, పోషకాలను సరఫరా చేయడానికి గుండె మరింత రక్తాన్ని పంపుతుంది. ఇది వ్యాయామానికి సహజ ప్రతిస్పందన, గుండెను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ, వ్యాయామాన్ని తీవ్ర స్థాయికి తీసుకున్నప్పుడు, గుండె ఎక్కువగా పని చేస్తుంది. అలసిపోతుంది, కార్డియాక్ సంఘటనల ప్రమాదాన్ని పెంచుతుంది.
అధిక వ్యాయామంతో సంబంధం ఉన్న సాధారణ పరిస్థితిని "వ్యాయామం-ప్రేరిత కార్డియాక్ రీమోడలింగ్" అని పిలుస్తారు. నిరంతర వ్యాయామాల కారణంగా రక్త ప్రవాహానికి పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా గుండె నిర్మాణాత్మక మార్పులకు లోనవుతుంది. ఈ అనుసరణలు సాధారణంగా బాగా శిక్షణ పొందిన క్రీడాకారులకు హానికరం కానప్పటికీ, సరైన గైడెన్స్ లేకుండా వ్యాయామం చేసే వారికి అవి సమస్యాత్మకంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.
గుండెకు ఎలా ప్రమాదం జరుగుతందంటే..
పెరిగిన హృదయ స్పందన రేటు : అధిక వ్యాయామం హృదయ స్పందన రేటును నిరంతరం పెంచడానికి దారితీస్తుంది, ఇది కాలక్రమేణా గుండె కండరాలను బలహీనపరుస్తుంది. సమర్థవంతంగా పంప్ చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
క్రమరహిత గుండె లయలు : తగినంత రికవరీ లేకుండా తీవ్రమైన వ్యాయామం రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే అరిథ్మియా (ఎట్రియాల్ ఫిబ్రిలేషన్) వంటి అసాధారణ గుండె లయలను ప్రేరేపిస్తుంది.
గుండె జబ్బులు : అధిక వ్యాయామం గుండె జబ్బుల అభివృద్ధికి దోహదపడుతుంది. ముఖ్యంగా ముందుగా ప్రమాద కారకాలు ఉన్న వ్యక్తులలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ : మితిమీరిన వ్యాయామం రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. వ్యక్తులు ఇన్ఫెక్షన్లకు ఎక్కువ అవకాశం కలిగి ఉంటారు, ఇది పరోక్షంగా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
గుండెను రక్షించుకోవాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి..
మీ శరీరం మాట వినండి : అలసట, నొప్పి లేదా అధిక నొప్పి సంకేతాలపై శ్రద్ధ వహించండి. ఇవి మీ శరీరానికి విశ్రాంతి అవసరమని తెలిపే సంకేతాలు వస్తే సైలెంట్ అయిపోవాలి. బాగా నొప్పిగా ఉన్నా, అలిసిపోయినా ఆ రోజు వ్యాయామం చేయకండి. బాడీకి రెస్ట్ ఇవ్వండి.
మీ వ్యాయామ దినచర్యను మార్చుకోండి : మితిమీరిన గాయాలను నివారించడానికి, అతిగా వ్యాయామం చేసే ప్రమాదాన్ని తగ్గించడానికి కార్డియో ఫ్లెక్సిబిలిటీ శిక్షణను తీసుకోండి.
విశ్రాంతి అవసరం : మీ శరీరం కోలుకోవడానికి, మరమ్మతు చేయడానికి సమయాన్ని ఇవ్వడానికి మీ వ్యాయామ దినచర్యలో రెగ్యులర్ విశ్రాంతి రోజులను షెడ్యూల్ చేయండి.
నిపుణుడిని సంప్రదించండి : మీ అవసరాలకు అనుగుణంగా వ్యాయామాన్ని చేయడం కోసం శిక్షకుడిని సంప్రదించండి.
వ్యాయామం అయినా యోగా అయినా.. ఒక గైడెన్స్ లేకుండా చేయకూడదు. మీకు ఇష్టం వచ్చినట్లు చేస్తే.. లేనిపోని సమస్యలు వస్తాయి. కాబట్టి ట్రైనర్స్ హెల్ప్ కచ్చితంగా కావాలి.