Creativity | కాసేపు నిద్రపోండి.. క్రియేటివిటీ పెరుగుతుందట!
03 May 2022, 17:24 IST
- Creativity.. ఏ పనైనా కాస్త క్రియేటివ్‌గా చేస్తేనే ఈ కాలంలో సక్సెస్ సాధించగలం. కానీ ఆ క్రియేటివిటీ ఎలా వస్తుంది? సింపుల్.. కాసేపు నిద్రపోండి. మరీ ఘాడ నిద్రలోకి వెళ్లే ముందు మేల్కోండి. అంతే క్రియేటివిటీ వచ్చేస్తుంది అని చెబుతోంది ఓ తాజా అధ్యయనం.
కాసేపు నిద్రపోయి లేస్తే క్రియేటివిటీ పెరుగుతుందట
నిజానికి ఎప్పుడో వందేళ్ల కిందటే థామస్ ఎడిసన్ చెప్పిన ఈ విషయాన్ని తాజాగా మరోసారి అధ్యయనం చేసి మరీ నిజమే అని నిరూపించారు కొందరు శాస్త్రవేత్తలు. కాసేపు నిద్రపోయి లేచిన వాళ్లు అప్పటి వరకూ పరిష్కరించలేని గణిత సమస్యను పరిష్కరించినట్లు తేల్చారు. అప్పుడు ఎడిసన్ చెప్పింది నిజమే అని వీళ్లు అంటున్నారు. మరి ఆ అధ్యయనం ఏంటి? నిద్రకు, క్రియేటివిటీకి ఉన్న సంబంధం ఏంటి అన్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఎడిసన్ ఏం చెప్పారు?
ఎప్పుడో వందేళ్ల కిందటే థామస్ ఎడిసన్ నిద్రకూ, క్రియేటివిటీకి ఉన్న సంబంధమేంటో చెప్పారు. దీనిని ఆయనే ప్రాక్టికల్‌గా చేసి చూశారు. రెండు చేతుల్లో రెండు స్టీల్ బాల్స్‌ను పట్టుకొని ఓ చెయిర్‌లో నిద్రపోయేవారు ఎడిసన్. అయితే ఈ నిద్ర మరీ గాఢ నిద్రగా మారకముందే మేలుకోవాలన్నది ఆయన ఆలోచన. ఎప్పుడైతే ఘాడ నిద్రలోకి జారుకుంటాడో.. చేతుల్లో ఉన్న బాల్స్ కింద పడి పెద్ద శబ్దం వచ్చేది. ఆ సౌండ్‌కి ఎడిసన్ నిద్ర నుంచి లేచేవారు. ఇలా కాసేపు నిద్రలోకి జారుకొని మళ్లీ మేల్కొన్న ప్రతిసారీ తన సమస్యలకు పరిష్కారం దొరికేదని ఎడిసన్ చెప్పారు.
తాజా అధ్యయనం ఏంటి?
ఇప్పుడు వందేళ్ల తర్వాత మరోసారి అలాంటి ప్రయత్నమే చేశారు కొందరు శాస్త్రవేత్తలు. ఇలా నిద్రలోకి వెళ్లీ వెళ్లనట్లు వెళ్లి తిరిగి మేల్కొన్న వారు ఓ గణిత సమస్యను పరిష్కరించే అవకాశం మూడు రెట్లు పెరిగినట్లు వాళ్లు గుర్తించారు. కొందరు వ్యక్తులు నిద్ర నుంచి గాఢ నిద్రలోకి వెళ్లే సమయంలో వారిని మేల్కొనేలా చేసినప్పుడు ఇది జరిగింది. పడుకున్న కొద్దిసేపటికి మనం పూర్తిగా నిద్రలో కాకుండా, అలాగని పూర్తి మెలకువలో ఉండక.. మగత నిద్రలో ఉంటాం. ఇది సాధారణంగా కొన్ని నిమిషాల పాటు ఉంటుంది.
ఈ సమయంలో మన కండరాలు రిలాక్స్ అవుతాయి. నిద్రపోవడానికి మనం అనుభవించిన కొన్ని క్షణాలకు సంబంధించిన ఆలోచనలు కలల రూపంలో మన కళ్ల ముందు కదలాడతాయి. దీనినే హిప్నగోగియా అంటారు. ఈ సమయంలో ఎవరినైనా నిద్రలేపితే అప్పుడు ఏం జరిగిందో గుర్తు పెట్టుకుంటారు. అలా కాకుండా గాఢ నిద్రలోకి వెళ్తే ఈ స్టేజ్‌ను మరచిపోతారు. ఎడిసన్‌లాగే పెయింటర్ సాల్వడార్ డాలీ కూడా ఈ ప్రయోగం చేసి అది నిజమే అని నిరూపించారు.
అధ్యయనం ఎలా చేశారు?
ఎడిసన్, డాలి చెప్పింది ఎంత వరకూ నిజమో తెలుసుకునే ప్రయత్నమే ఈ తాజా అధ్యయనం. దీనికోసం 100 మంది సులువుగా నిద్రలోకి జారే వ్యక్తులను ఎంపిక చేసుకున్నారు. వీళ్లకు కఠినమైన మ్యాథ్స్ ప్రాబ్లమ్‌ను ఇచ్చారు. దీనిని పరిష్కరించడానికి ఓ సులువైన మార్గం ఉన్నా.. ఆ విషయాన్ని వాళ్లకు చెప్పలేదు. 30 సార్లు ప్రయత్నించినా పరిష్కారం కనుగొనలేకపోయిన కొందరికి 20 నిమిషాలు బ్రేక్ ఇచ్చారు. ఓ కుర్చీలో చీకటిగా ఉన్న గదిలో నిద్రపోవాలని సూచించారు.
వాళ్ల చేతిలో ఓ ప్లాస్టిక్ బాటిల్ పెట్టారు. ఈ సమయంలో వాళ్ల తలకు ఓ ఎలక్ట్రోఎన్సిఫాలోగ్రఫీ హెల్మెట్‌ను పెట్టారు. ఇది వారి మెదడులోని ఆలోచనను తెలుసుకోవడానికి చేసిన ఏర్పాటు. వాళ్లు మెల్లగా నిద్రలోకి జారుకోగానే బాటిల్ కిందపడి మెలకువ వస్తుంది. ఆ తర్వాత తమకు ఎలాంటి కలలు వచ్చాయో వాళ్లను చెప్పమని అన్నారు.
అధ్యయనంలో ఏం తేలింది?
ఇలా నిద్రలోకి జారుకొని మళ్లీ మేల్కొన్న వాళ్లు తమకు కలలో నంబర్లు డ్యాన్స్ చేస్తూ కనిపించాయని, కొన్ని గణితశాస్త్ర ఆకారాలు కనిపించాయని, హాస్పిటల్ రూమ్‌లో గుర్రం ఉన్నట్లు కనిపించిందని చెప్పారు. వీళ్లకు మళ్లీ మ్యాథ్స్ ప్రాబ్లం అప్పగిస్తే.. వాళ్లు దానిని సాల్వ్ చేసేశారు. నిజానికి కలలో వాళ్లు చూసిన దానికి, వాళ్లు సాల్వ్ చేసిన మ్యాథ్స్ ప్రాబ్లంకి ఎలాంటి సంబంధం లేదు.
కానీ మొత్తం 24 మందిలో 20 మంది అంటే 83 శాతం మంది సమస్యకు పరిష్కారం కొనుగొన్నారు. అదే సమయంలో నిద్రపోకుండా మేల్కొన్న 59 మందిలో కేవలం 15 మంది అంటే 30 శాతం మంది మాత్రమే ఈ సమస్యను పరిష్కరించారు. నిద్రలో కేవలం 15 సెకన్లు ఉండి వచ్చిన వాళ్లు కూడా ఈ సమస్య పరిష్కరించడం గమనార్హం. అయితే అలాగే గాఢ నిద్రలోకి జారుకున్న వాళ్లలో మాత్రం ఇది కనిపించలేదు. అంటే మగత నిద్రలో ఓ క్రియేటివ్ స్వీట్ స్పాట్ ఏదో ఉందని తమ పరిశోధనలో తేలిందని పారిస్ బ్రెయిన్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు చెప్పారు.
అయితే నిద్రలోకి వెళ్లి రాగానే వీళ్లు సమస్యను పరిష్కరించలేదు. సగటున 94సార్లు ప్రయత్నించి ఈ సమస్యను పరిష్కరించినట్లు రీసెర్చర్లు చెప్పారు. అయినా సరే కాసేపు నిద్ర మన మెదడును ఇంతలా క్రియేటివ్‌గా మార్చడం మాత్రం ఆశ్చర్యకరమే అని వాళ్లు అభిప్రాయపడ్డారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు పరిష్కరించలేని సమస్య ఏదైనా ఉంటే.. మీరూ కాసేపు అలా నిద్రలోకి వెళ్లి రండి.. ఆ తర్వాత దానిని పరిష్కరించగలరేమో చూడండి.