Chess day : చదరంగం అనేది గ్లోబల్ గేమ్.. ఎవరైనా.. ఎప్పుడైనా.. ఎక్కడైనా ఆడవచ్చు..
20 July 2022, 12:22 IST
- చదరంగం ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఆటలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు దీనిని ఆడుతున్నారు. దీనిని ఆడాలంటే తెలివితేటలు మాత్రమే సరిపోవు.. కఠినమైన శిక్షణ కూడా ఉండాలి. దాని గురించి అవగాహన కల్పిస్తూ.. ప్రతి సంవత్సరం జూలై 20న ప్రపంచవ్యాప్తంగా చెస్ డే నిర్వహిస్తున్నారు.
ప్రపంచ చదరంగం దినోత్సవం 2022
International Chess Day 2022 : గతంలో ఆటలు, క్రీడలు ఆందోళనలను తగ్గించడం, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచి.. సంక్షోభ సమయాల్లో మనుగడ సాధించడానికి మానవాళికి సహాయం చేశాయి. ఆ నేపథ్యంలో జూలై 20వ తేదీన అంతర్జాతీయ చదరంగం దినోత్సవంగా జరుపుకోవాలని యునెస్కో ప్రతిపాదించింది. కరోనావైరస్ వ్యాప్తి సమయంలో చాలా గేమింగ్, స్పోర్ట్స్ కార్యకలాపాలకు బ్రేక్ పడినప్పటికీ.. చెస్ వంటి గేమ్స్ మానవాళికి ఓ చిన్న డైవర్షన్ ఇచ్చాయి. అందుకే COVID-19 మహమ్మారి వ్యాప్తి సమయం నుంచి.. చెస్ భారీ వృద్ధిని సాధించింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఎక్కువగా నిర్వహిస్తున్న చెస్ ఈవెంట్‌లలో పాల్గొనడానికి గతంలో కంటే ఎక్కువ మంది ఆటగాళ్లు పాల్గొన్నారు.
చరిత్ర
చదరంగం చతురంగ నుంచి ఉద్భవించిందని నమ్ముతారు. దీని అర్థం 'నాలుగు విభాగాలు' పదాతిదళం, అశ్వికదళం, ఏనుగు, రథం (పాన్, నైట్, బిషప్, ఆధునిక ఆటలో రూక్)గా విభజించడాన్ని సూచిస్తుంది. ఈ గేమ్ సస్సానిద్ పర్షియాకు వచ్చినప్పుడు.. దీనిని చత్రంగ్ అని పిలిచారు. తరువాత షత్రంజ్ అని పిలిచేవారు. అక్కడి నుంచి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఈ గేమ్ వ్యాపించింది.
అబ్బాసిడ్ చెస్ మాస్టర్స్ అల్-సులీ, అల్-లజ్లాజ్ ఈ గేమ్‌లో మెళుకువలు, వ్యూహంపై రచనలు చేశారు. 1924లో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (FIDE) పారిస్‌లో స్థాపించారు. ఈ సంస్థ ఇప్పుడు జాతీయ చెస్ ఫెడరేషన్ల రూపంలో 199 దేశాలను అనుబంధ సభ్యులుగా చేర్చే స్థాయికి ఎదిగింది. డిసెంబర్ 12, 2019న జనరల్ అసెంబ్లీ ప్రకటించినప్పటి నుంచి.. జూలై 20న ప్రపంచ చెస్ దినోత్సవంగా జరుపుతున్నారు.
చదరంగం
చెస్ అనేది వ్యూహాత్మకమైన గేమ్. దీనిని ఎనిమిది-ఎనిమిది గ్రిడ్‌లో అమర్చిన 64 చతురస్రాలతో కూడిన చతురస్రాకార చదరంగంపై ఆడతారు. ఆట లక్ష్యం ఏంటంటే.. ప్రత్యర్థి రాజును చెక్‌మేట్ చేయడమే. తద్వారా రాజు తక్షణ దాడికి గురవుతాడు. ("చెక్"లో) తప్పించుకోవడానికి మార్గం ఉండదు. గేమ్ డ్రాగా ముగించడానికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి.
ప్రాముఖ్యత
వ్యూహం, తెలివితో కూడిన గేమ్ చదరంగం అనేది శాస్త్రీయ ఆలోచన. క్రీడ, కళల అంశాల మిశ్రమంతో కూడిన పురాతన ఆటలలో ఇది ఒకటి. చదరంగం శిక్షణ, అభ్యాసం అనేది సమస్య-పరిష్కారం, నిర్ణయం తీసుకోవడం, విమర్శనాత్మక ఆలోచన, ప్రణాళిక వంటి మొదలైన ఉన్నత-క్రమ ఆలోచన నైపుణ్యాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
చదరంగానికి 1700 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. వాస్తవానికి ఇది రాజుల ఆట. ఆధునిక ప్రపంచంలో దానికి ప్రజాదరణ ఆకాశాన్ని తాకింది. చదరంగంలోని తర్కం, తార్కికం, వ్యూహాత్మక ఎత్తుగడలు, సృజనాత్మకత అంతులేని అవకాశాలతో కూడిన అంశాలు.. ఈ గేమ్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి. చదరంగం ఆడటం వల్ల మీలో సృజనాత్మకత పెరుగుతుంది. చదరంగం ఆడేవారు అధిక మానసిక సామర్థ్యాలు కలిగిన వ్యక్తులుగా పరిగణిస్తారు. ఇది భాష, వయస్సు, లింగం, శారీరక సామర్థ్యం లేదా సామాజిక హోదా వంటి బేధాలు లేకుండా ఆడవచ్చు.
టాపిక్