Independence Day 2022 : జెండా ఎగురవేయడానికి.. ఆవిష్కరణకు తేడా ఏంటో తెలుసా?
07 August 2023, 16:36 IST
- Independence Day 2022 : స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సం. ఈ రెండు రోజులు ఇండియన్స్‌కు చాలా ముఖ్యమైనవి. పైగా ఈ రెండు ప్రత్యేకమైన రోజుల్లోనూ జెండాను ఎగురవేస్తారు. అయితే ఈ ఎగురవేసే విధానంలో తేడా ఉంటుంది. అది మీకు తెలుసా? అసలు జెండా ఎగురవేయడం అంటే ఏమిటో? ఆవిష్కరణ అంటే ఏమిటో మీకు తెలుసా?
జెండా ఎగురవేయడానికి, ఆవిష్కరణకు తేడా ఇదే
Independence Day 2022 : ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం, జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. అయితే ఈ రెండు ప్రత్యేకమైన రోజుల్లో జెండాను ఎగురవేస్తారు. అయితే స్వాతంత్య్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి జెండా ఎగురువేయడంలో తేడా ఉంటుంది. ఇది మీకు తెలుసా?
అసలు తేడా ఏమిటంటే..
ఆగష్టు 15వ తేదీన.. జెండాను మడతపెట్టి.. జెండా స్తంభం దిగువన కడతారు. జెండా ఎగురవేయడానికి ముందు దానిని స్తంభం కొన వరకు లాగి.. ఆ తర్వాత జెండా ఎగురవేస్తారు. దీనిని జెండా ఎగురవేయడం అంటారు. వలసవాద ఆధిపత్యం తర్వాత దేశం విముక్తి పొందిందని ఈ ప్రక్రియ సూచిస్తుంది.
జనవరి 26న త్రివర్ణపతాకాన్ని.. జెండా స్తంభం కొన వద్ద ఎత్తుగా కడతారు. స్తంభం మధ్య లేదా దిగువ ఎత్తులో కట్టరు. అప్పుడు తాడు లాగుతారు. అప్పటివరకు ముడుచుకుని ఉన్న జెండా.. తాడు లాగడంతో ఓపెన్ అవుతుంది. దానిని జెండా ఆవిష్కరణ అంటారు. ఇది ఇప్పటికే స్వేచ్ఛాయుత దేశం అని ఈ ప్రక్రియ సూచిస్తుంది. అందుకే గణతంత్ర దినోత్సవం రోజు.. జెండాను తక్కువ ఎత్తులో వేలాడదీయరు.
పైగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జెండా ఎగురవేస్తారు. 'లాల్ క్విలా' ప్రాకారంపై నుంచి దేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధానిలోని రాజ్‌పథ్‌లో వేడుకలు జరుగుతాయి. రాజ్‌పథ్‌లో రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు.
ఈ సంవత్సరం థీమ్
ఈ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఇంట్లో జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రజలను కోరారు. తమ సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్లను త్రివర్ణ పతాకంగా మార్చుకుని దేశభక్తి చాటుకోవాలని కోరారు.