Thursday Motivation: మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ఆయుష్షు కలగాలంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం అలవాటుగా మార్చుకోండి
04 July 2024, 5:00 IST
- Thursday Motivation: బ్రహ్మ ముహూర్తం అంటే సృష్టి జరిగిన సమయం. ఉదయం నాలుగున్నర గంటలను బ్రహ్మ ముహూర్తంగా చెబుతారు. ఆ సమయంలో లేవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు నిద్ర లేవాలి?
Thursday Motivation: జీవితంలో ఆనందం, ఆరోగ్యం... ఈ రెండూ ఉంటే చాలు, ఆ జీవితం పరిపూర్ణమైనది. అలా జీవితంలో ఆనందం, ఆరోగ్యం దక్కాలంటే బ్రహ్మ ముహూర్తంలో లేవడం అలవాటు చేసుకోండి. పూర్వం పెద్దవారంతా బ్రహ్మ ముహూర్తంలోని లేచే వారు. అందుకే వారు ఆరోగ్యంగా జీవించేవారని అంటారు.
బ్రహ్మ ముహూర్తం అంటే
బ్రహ్మ ముహూర్తానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సృష్టికర్త బ్రహ్మ ఆ సమయంలోనే సృష్టిని రూపొందించాడని అంటారు. ముహూర్తం అంటే కాలవ్యవధి. ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలు అని అర్థం. సూర్యోదయానికి రెండు ముహూర్తాలు ముందు బ్రహ్మ ముహూర్తం అంటారు. అంటే దాదాపు తెల్లవారు జామున నాలుగున్నర గంటల సమయంలో బ్రహ్మ ముహూర్తం వస్తుంది. ఆ సమయంలో నిద్ర లేవాలని పెద్దలు చెబుతారు. ఇది మానసిక, శారీరక శ్రేయస్సుకు ఎంతో మంచిది.
ప్రతిరోజూ తెల్లవారు జామున నాలుగున్నర గంటలకు పూర్వం అందరూ లేచేవారు. అప్పట్నించే తమ పనులను మొదలుపెట్టేవారు. అందుకే వారు ఆరోగ్యంగా ఉండేవారని అంటారు ఆరోగ్య నిపుణులు. అందమైన ఉదయం చూడాలంటే బ్రహ్మ ముహూర్తంలో లేవడం చాలా అవసరం.
‘బ్రాహ్మీ ముహూర్తం ఉత్తిష్ఠేత్ స్వస్థో రక్షార్థం ఆయుష: తత్ర సర్వార్థ శాంత్యర్థం స్మరేచ్చ మధుసూదనం’ అని చెప్పుకుంటారు. అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని, రోగాలను దూరంగా ఉంచుతుందని ఆయుర్వేదం గ్ంధాలు చెబుతున్నాయి.
బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల ఉపయోగాలు
ఎన్నో పరిశోధనలు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలని చెబుతున్నాయి. ఆ సమయంలో వాతావరణంలో స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది. ఆ ఆక్సిజన్ ను పీల్చి హిమోగ్లోబిన్ తో కలుస్తాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శక్తి స్థాయిలను పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో pH సమతుల్యతను కాపాడుతుంది. శరీరంలో విటమిన్లు, ఖనిజాల శోషణను మెరుగు పరుస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో మానసిక ఒత్తిడి బారిన పడకుండా ఉంటారు. మనసు, మెదడుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది.
బ్రహ్మ ముహూర్తంలో సమయంలో ధ్యానం చేయడం చాలా మంచిది. లేదా ప్రశాంతంగా పూజలు వంటివి చేసుకున్నా మంచిదే. ఏదైనా ప్రశాంతమైన పుస్తకాన్ని చదవండి. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. అలాగే తల్లిదండ్రులను, దేవుళ్లను, గురువులను ఓసారి తలచుకోండి. కానీ ఏమీ తినకండి. బ్రహ్మ ముహూర్తంలో కేవలం నీళ్లు మాత్రమే తాగండి. అలాగే ఒత్తిడితో నిండిన పనులు కూడా చేయకండి.