Friday Motivation: ఉదయం పూట ఈ పనులు చేస్తే మానసికంగా మీరు దృఢంగా మారతారు, డిప్రెషన్ బారిన పడరు
04 October 2024, 5:00 IST
- Friday Motivation: శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రత్యేకంగా కాపాడుకోవాల్సిన రోజులివి. మీరు డిప్రెషన్ బారిన పడకుండా ఉండాలంటే ఉదయం పూట కొన్ని పనులను చేయాలి.
మోటివేషనల్ స్టోరీ
Friday Motivation: మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉదయం ఉత్తమ సమయం. మీరు మీ రోజుని ఎలా ప్రారంభిస్తారో... అలాగే ఆరోజు మీ ఆలోచన విధానం ఆధారపడి ఉంటుంది. ఉదయాన్నే లేచి ఒత్తిడికి లోనవుతూ ఉంటే ఆ రోజంతా మీరు తీవ్ర ఒత్తిడిలోనే ఉంటారు. కాబట్టి ఉదయాన్నే ఎలాంటి పనులు చేయడం ద్వారా మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారో, డిప్రెషన్ బారిన పడకుండా ఉంటారో తెలుసుకోండి.
ఉదయం లేచిన వెంటనే చిన్న చిన్న వ్యాయామాలను చేయండి. ఇది డిప్రెషన్ వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఆరు బయట ఎండ తగిలేలా వాకింగ్, రన్నింగ్ వంటివి చేయడం వల్ల మీ మెదడు ఎండార్పిన్లను విడుదల చేస్తుంది. ఇది ఆనందాన్ని పెంచుతుంది. ఆలోచనలను అరికడుతుంది. అలాగే అతిగా ఆలోచించడానికి కూడా తగ్గిస్తుంది.
ఉదయం పూట మీరు తీసుకునే అల్పాహారం కూడా మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి చికెన్, బీన్స్, బఠానీలు, సోయా, చేపలు, పెరుగు, పాలు వంటి ప్రోటీన్ రుచి ఫుడ్స్ ను అల్పాహారంలో తీసుకునేందుకు ప్రయత్నించండి. ఇవి సెరోటోనిన్ విడుదలను పెంచుతాయి. అల్పాహారంలో సన్ ఫ్లవర్ సీడ్స్, బాదం వంటి గింజలను జోడించడం వల్ల మీకు విటమిన్ ఏ లభిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరచడంలో ముందుంటుంది.
ఉదయాన్నే తాజా సూర్యకాంతి మీ మానసిక ఆరోగ్యానికి ఎన్నో అద్భుతాలు చేస్తుంది. సూర్యరశ్మి తక్కువగా ఉన్నప్పుడు కాస్త డల్‌గా అనిపించడం సహజమే. అదే సూర్యరశ్మి శరీరానికి తగిలితే మాత్రం మీరు ఉత్సాహంగా ఉంటారు. ఇది మానసిక స్థితిపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. విటమిన్ డి శరీరానికి అందిస్తుంది.
రోజంతా ఎక్కువ సేపు చురుకుగా ఉండేందుకు ఇంట్లోనే కదిలేందుకు ప్రయత్నించండి. మంచంపై ఎక్కువ సేపు కూర్చోవడం, పడుకోవడం వల్ల మీ మెదడు చురుకుదనం తగ్గిపోతుంది. కాబట్టి ఇంట్లోనే ఇటు అటూ షికారు చేయడం కూడా మంచిది. ఇది మీ రోజును కిక్ స్టార్ట్ చేయడంలో సహాయపడుతుంది. మీరు ఆ రోజంతా సంతోషంగా ఉంటారు.
కాసేపు ప్రశాంతంగా ధ్యానం చేయడం వల్ల కూడా ఒత్తిడి బారిన పడే అవకాశం తగ్గుతుంది. ఉదయం పూట మెల్లగా నడవడం, సంతోషంగా కొంచెం కొంచెంగా తినడం వంటిది కూడా ఒత్తిడిని అధిగమించడంలో సహాయపడతాయి. మీ ఆలోచనల ప్రవాహం ఎప్పుడు పెరుగుతుందో అప్పుడే ఒత్తిడి ఎక్కువవుతుంది. కాబట్టి ఆలోచించడం చాలా వరకు తగ్గిస్తే మంచిది.