Turmeric Oil Benefits : జుట్టు రాలడం, చుండ్రు సమస్య ఉందా? పసుపు నూనెతో పరిష్కారం
24 September 2023, 14:00 IST
- Turmeric Oil Benefits To Hairs : పసుపును పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. పసుపులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే జుట్టుకు కూడా పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది.
పసుపు నూనె
పసుపు చర్మ సమస్యలకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. ఇప్పుడు పసుపును వివిధ రకాల సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తున్నారు. మొటిమలను తొలగించడానికి, చర్మాన్ని మృదువుగా మార్చడానికి పసుపుకు సాటి లేదు. కానీ పసుపు చర్మాన్ని మాత్రమే కాకుండా, జుట్టు సంరక్షణలో కూడా అంతే ప్రభావవంతంగా ఉంటుంది. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలలో పసుపు ఉపయోగపడుతుంది.
మీరు పసుపు హెయిర్ మాస్క్‌ని తయారు చేసుకోవచ్చు. మీ జుట్టుకు పసుపు నూనెను అప్లై చేయవచ్చు. ఇతర జుట్టు నూనెల మాదిరిగానే పసుపు నూనె కూడా జుట్టు సంరక్షణలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జుట్టుకు పసుపు నూనెను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
2 టేబుల్ స్పూన్ల పసుపు నూనెను 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను కలిపి తలకు, జుట్టుకు బాగా పట్టించాలి. కాసేపు తలకు మసాజ్ చేయండి. తర్వాత గంటసేపు అలాగే ఉంచి షాంపూతో తలస్నానం చేయాలి. మీరు ఉపయోగించే షాంపూలో కొన్ని చుక్కల పసుపు నూనెను మిక్స్ చేసి మీ తలకు అప్లై చేయండి. ఇది జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది, అలాగే తలకు పోషణను అందిస్తుంది.
పసుపు నూనెతో తలకు కాసేపు మసాజ్ చేయండి. ఇది తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. పసుపు నూనె వేడి చేసి తలకు పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత అరగంట అలాగే ఉంచి షాంపూతో తలస్నానం చేయాలి.
పసుపు నూనెలో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఈ సమ్మేళనం జుట్టు పెరుగుదలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టర్మరిక్ ఆయిల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు స్కాల్ప్ చికాకు, దురద, ఎరుపు, ఫ్లాకీనెస్‌ను తగ్గిస్తాయి.
పసుపు నూనె జుట్టుకు పోషణను అందిస్తుంది. మూలాలను బలపరుస్తుంది. ఫలితంగా జుట్టు రాలడం, జుట్టు చిట్లడం వంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. పసుపు నూనెలో యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి, ఇది చుండ్రు కలిగించే ఫంగస్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది. ఫలితంగా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. టర్మరిక్ ఆయిల్ స్కాల్ప్ pH స్థాయిని బ్యాలెన్స్ చేస్తుంది.
గమనిక : మాకు దొరికిన సమాచారం ఆధారంగా కథనం ఇచ్చాం. ఏదైనా కొత్తగా ప్రయత్నించేప్పుడు నిపుణుల సలహా తీసుకోండి. మీ శరీరం కొత్త పద్ధతికి సరైనదో.. కాదో.. తెలుసుకోవాలి. పైన చెప్పిన సూచనలకు HT Telugu బాధ్యత వహించదు.