తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Genetic Cancer: క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తుందా? కారణాలు, చికిత్స తెలుసుకోండి

Genetic cancer: క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తుందా? కారణాలు, చికిత్స తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu

24 January 2023, 13:34 IST

google News
    • Genetic cancer: క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తుందా? జన్యు పరివర్తనల కారణంగా ఈ ముప్పు ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటికి కారణాలు, చికిత్స ఇక్కడ తెలుసుకోండి.
Genetic cancer: జన్యు పరివర్తనల కారణంగా వారసత్వంగా క్యాన్సర్లు వచ్చే ప్రమాదం (ప్రతీకాత్మక చిత్రం)
Genetic cancer: జన్యు పరివర్తనల కారణంగా వారసత్వంగా క్యాన్సర్లు వచ్చే ప్రమాదం (ప్రతీకాత్మక చిత్రం) (Photo by Thirdman on Pexels)

Genetic cancer: జన్యు పరివర్తనల కారణంగా వారసత్వంగా క్యాన్సర్లు వచ్చే ప్రమాదం (ప్రతీకాత్మక చిత్రం)

జన్యువుల్లో పరివర్తనల కారణంగా ఏర్పడే అసాధారణతల వల్ల ఏర్పడే క్యాన్సర్లు వంశపారంపర్యంగా వారి సంతానంలో కూడా వస్తాయి. ముఖ్యంగా పరివర్తనలు వారసత్వంగా సంక్రమించినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. అయితే అందరిలోనూ ఈ పరివర్తనల వల్ల క్యాన్సర్లు రావు. పరివర్తనం చెందే జన్యువులు చాలా ఏళ్లపాటు నిద్రాణంగా ఉంటాయి. ఒక్కోసారి జీవితకాలం మొత్తం నిద్రాణంగా ఉండొచ్చు. లేదా ఒక తరంలో నిద్రాణంగా ఉండి, తరువాతి తరంలో క్యాన్సర్లకు దారితీయవచ్చు. బీఆర్‌సీఏ1, బీఆర్‌సీఏ-2 జన్యువుల్లో పరివర్తనలు బ్రెస్ట్ క్యాన్సర్‌కు కారణమవుతాయి. అవి చాలా తరాలకు సంక్రమించే ప్రమాదం ఉంది. ఈ జన్యు పరివర్తన ఉండే మహిళల్లో 50 శాతం మందికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

Causes and risks: కారణాలు, ముప్పు

కొన్ని నిర్ధిష్ట క్యాన్సర్లు కుటుంబాల్లో వంశపారంపర్యంగా వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలు తేల్చాయి. క్యాన్సర్ జన్యు మూలం ఉన్నప్పుడు ఇలా జరిగే ప్రమాదం ఉంది. 5 నుంచి 10 శాతం క్యాన్సర్లు ఇలా ఉత్పరివర్తనం వల్ల వస్తుంటాయి. మిగిలినవి ఒక వ్యక్తి జీవితకాలంలో జరిగే జన్యు పరివర్తనల వల్ల సంభవిస్తుంటాయి. స్మోకింగ్, రేడియేషన్ ప్రభావం, యూవీ కిరణాల ప్రభావం, నిర్ధిష్ట రసాయనాలు, కాలుష్య కారకాల వల్ల క్యాన్సర్ వస్తుంది.

మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ మీనూ వాలియా క్యాన్సర్ కారకాలు, జన్యు పరివర్తనలను హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్లేషించారు. స్మోకింగ్ వంటి ప్రవర్తనలను కుటుంబ సభ్యులు పంచుకుంటారని, అలాగే కాలుష్య కారకాలు, పర్యావరణ ప్రభావాలకు కూడా గురవుతారని వివరించారు. కుటుంబ సభ్యుల్లో క్యాన్సర్ సంక్రమణకు కారణాల్లో ఇవి కూడా కొన్ని అని వివరించారు.

‘అందరిలోనూ వారసత్వంగా జన్యు పరివర్తన కలిగి క్యాన్సర్ వస్తుందన్న దానిలో వాస్తవం లేదు. అయినప్పటికీ వీరు ఎక్కువ ముప్పు కలిగి ఉంటారు. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నప్పుడు జన్యుపరమైన ముప్పు ఉందేమో ఇతరులు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది..’ అని డాక్టర్ మీనూ వాలియా వివరించారు.

Diagnosis: పరీక్షలు ఇలా

కొన్ని సాధారణ రక్త పరీక్షల ద్వారా దీనిని నిర్ధారించుకోవచ్చని డాక్టర్ వివరించారు. ‘సంబంధిత జన్యు పరీక్షలు నిర్వహించడం ద్వారా సదరు వ్యక్తి జన్యు పరివర్తనలు వారసత్వంగా వచ్చాయో లేదో తెలుసుకోవచ్చు. తల్లి, తండ్రి, సోదరుడు, సోదరిలలో ఎవరికైనా క్యాన్సర్ సోకిందని పరీక్షల్లో తేలినప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులు ఈ పరీక్షలు చేయించుకోవాలి..’ అని సూచించారు.

‘క్యాన్సర్‌పై చర్చ నిజానికి చాలా యాంగ్జైటీని తెచ్చిపెడుతుంది. అందువల్ల జెనెటిక్ కౌన్సెలర్‌ను సంప్రదించిన తరువాత ఈ పరీక్షలకు వెళ్లడం ఉత్తమం. ఫలితాలు ఆందోళనకరంగా ఉంటే కౌన్సెల్సింగ్ కొనసాగిస్తూ ఎలాంటి కార్యాచరణ ఉండాలో తెలుసుకోండి. టెస్టుల్లో జన్యు పరివర్తనలను గుర్తిస్తే క్యాన్సర్ స్పెషలిస్టులైన ఆంకాలిజిస్ట్ వైద్యులు పొంచి ఉన్న క్యాన్సర్ ముప్పును తగ్గిస్తారు..’ అని వివరించారు.

Treatment and prevention tips: చికిత్స, నివారణ చర్యలు

బీఆర్‌సీఏ-1, బీఆర్‌సీఏ-2 జన్యువుల్లో పరివర్తనలు వారసత్వంగా వచ్చినప్పుడు మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు క్యాన్సర్ వైద్య నిపుణులు తగిన చికిత్స చేస్తారు. బ్రెస్ట్స్, ఫాలోపియన్ ట్యూబ్స్, ఒవరీస్ తొలగించే అవకాశం ఉంటుందని డాక్టర్ మీనూ వాలియా వివరించారు. ’ఈ ప్రక్రియలు చాలా ప్రభావవంతమైన సాధనాలు. అయితే ఈ ప్రక్రియకు విశ్వవ్యాప్తంగా వైద్యులు, పేషెంట్ల నుంచి అంగీకారం లేదు. ముఖ్యంగా పిల్లలు కావాలనుకునే వారు ఈ చికిత్సకు విముఖంగా ఉంటారు..’ అని డాక్టర్ వివరించారు.

కీమో ప్రివెన్షన్ అనే మరో ప్రక్రియను డాక్టర్ సూచించారు. ‘ఇది క్యాన్సర్‌కు ఇచ్చే చికిత్సకు సంబంధించిన ఔషధాలతో కూడినది. వారసత్వంగా పరివర్తనలు ఉంటే దీని ద్వారా ముప్పు తగ్గుతుంది. ఈ అంశంలో తగిన పరిశోధనలు ఇప్పుడే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి దీనిని సమర్థించేందుకు తగినంత అధ్యయన ఫలితాలు లేవు..’ అని వివరించారు.

క్యాన్సర్ సంక్రమించకుండా జాగ్రత్తలు ఇవే

బరువు అదుపులో పెట్టుకోవడం, స్మోకింగ్ మానేయడం వంటి లైఫ్‌స్టైల్ మార్పులు ఈ వారసత్వ జన్యు పరివర్తన కారణంగా ఏర్పడే క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయని డాక్టర్ వివరించారు. ‘జన్యు పరివర్తనల కారణంగా ఉండే క్యాన్సర్ రిస్క్ తగ్గించుకునేందుకు తరచూ స్క్రీనింగ్ చేయించుకోవాలి. త్వరగా చేయించుకుంటే తగిన చికిత్సతో నివారించుకోవచ్చు. త్వరితగతిన ట్రీట్మెంట్ మొదలుపెడితే బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. బీఆర్‌సీఏ-1, బీఆర్‌సీఏ 2 మ్యుటేషన్స్ ఉన్న మహిళల్లో క్రమం తప్పకుండా మమ్మోగ్రఫీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి లక్షణాలు కనిపించకముందే ఈ టెస్ట్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పును పసిగట్టవచ్చు..’ అని వివరించారు.

క్యాన్సర్ వెనక ఉన్న రహస్యాలను ఇప్పుడిప్పుడే పరిశోధనలు వెలుగులోకి తెస్తున్నాయి. నయం చేయలేనిదిగా ప్రాచుర్యంలో ఉన్న క్యాన్సర్ వ్యాధి భయకంపితులను చేస్తుంది. అందువల్ల ప్రజలు జన్యుపరమైన ముప్పును అర్థం చేసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వారు దీనిపై అవగాహన పెంచుకోవాలి. రిస్క్ ఉన్నట్టు గమనించిన వారు జెనెటికల్ స్క్రీనింగ్ చేయించుకోవడం ఉత్తమం.

టాపిక్

తదుపరి వ్యాసం