తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Onion Rava Dosa : ఉల్లిపాయ రవ్వ దోసె.. టేస్టీ టేస్టీగా లాగించేయెుచ్చు

Onion Rava Dosa : ఉల్లిపాయ రవ్వ దోసె.. టేస్టీ టేస్టీగా లాగించేయెుచ్చు

Anand Sai HT Telugu

17 January 2024, 6:30 IST

google News
    • Onion Rava Dosa Recipe : దోసెను ఇంట్లో ఇష్టంగా తింటారు. అయితే ఎప్పుడూ ఒకేలాగా తినడం కంటే కొత్తగా ట్రై చేయండి. ఉల్లిపాయ రవ్వ దోసె చేయండి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మీ ఇంట్లో ఉదయాన్నే దోసె అడుగుతున్నారా? ఇంట్లో దోసె పిండి లేదా? అయితే ఏం పర్లేదు. మీకు కావలసింది రవ్వ, బియ్యం పిండి, మైదా. దీంతో రవ్వ దోసెను అద్భుతమైన రుచితో చేయెుచ్చు. అందులో ఉల్లిపాయ కూడా ఉంటే ఆ టేస్టే వేరు. ఉల్లిపాయను సన్నగా తరిగి, రవ్వ దోసెపై చల్లుకోండి. రుచికరమైన ఉల్లిపాయ రవ్వ దోస సిద్ధం అవుతుంది. ఈ రవ్వ దోసెతో కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేయడం సులభం. అయితే ఉల్లిపాయ రవ్వ దోసె ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కింది విధంగా చేయాలి.

ఉల్లిపాయ రవ్వ దోసె చేసేందుకు కావాల్సిన పదార్థాలు : రవ్వ - 1/2 కప్పు, బియ్యం పిండి - 1/2 కప్పు, మైదా - 1/4 కప్పు, అల్లం - 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరిగినది), పచ్చిమిర్చి - 1 (సన్నగా తరిగినది), మిరియాలు - 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర - 1 టీస్పూన్, ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినవి), కరివేపాకు - కొన్ని (తరిగినవి), ఉప్పు - రుచి ప్రకారం, నూనె / నెయ్యి - అవసరం మేరకు.

ఉల్లిపాయ రవ్వ దోసె తయారు చేసే విధానం

ముందుగా ఒక గిన్నెలో రవ్వ, మైదా, బియ్యప్పిండి, జీలకర్ర, కారం, అల్లం, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి అవసరమైనంత నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ పిండి నీళ్లలా ఉండాలి. అలా అయితే, పిండితో దోసె బాగా వస్తుంది. తర్వాత నాన్ స్టిక్ దోసె పాన్ తీసుకుని గ్యాస్ మీద పెట్టి బాగా వేడి చేయాలి. బాగా వేడయ్యాక కొంచెం నూనె చిలకరించి ముందుగా కలిపిన పిండిని మధ్యలో వేయాలి.

దోసె పిండిని చిక్కగా వేయకూడదు. ఆ తర్వాత పైన సన్నగా తరిగిన ఉల్లిపాయను చిలకరించి, దానిపై నెయ్యి లేదా నూనె పోసి మీడియం మంట మీద ఉంచి దోసెను బంగారు గోధుమ రంగు వచ్చేవరకు ఉడికించాలి. దోసెను ఎక్కువ మంట మీద ఉడికించకూడదు. తక్కువ మంట మీద ఉంచితేనే దోస కరకరలాడుతుంది. ఆ తరువాత, దోసెను తిప్పకుండా మడిచిపెట్టాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా దోసెలుగా కాల్చుకోవాలి. ఇప్పుడు రుచికరమైన ఉల్లిపాయ రవ్వ దోసె రెడీ.

రవ్వ దోసె కోసం పిండిలో చాలా నీరు ఉండాలి. దోసె కాల్చిన తర్వాత, పిండి గట్టిపడటం ప్రారంభమవుతుంది. మీరు తదుపరి దోసెను కాల్చినప్పుడు, అవసరమైతే కొంచెం నీరు కలపండి. నీళ్లు లేకపోతే దోసె కరకరలాడదు. రవ్వ, బియ్యప్పిండిని సమాన పరిమాణంలో తీసుకొని మైదా పిండిని కాస్త వేయండి. రవ్వ దోసెలో నెయ్యి వేస్తే హోటల్ లాంటి రుచి వస్తుంది.

తదుపరి వ్యాసం