తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetic Sex Issues: డయాబెటిస్‌లో లైంగిక సమస్యలను అధిగమించడం ఎలా? ఆ విషయంలో సంతోషంగా ఉండాలంటే ఇలా చేయండి..

Diabetic Sex Issues: డయాబెటిస్‌లో లైంగిక సమస్యలను అధిగమించడం ఎలా? ఆ విషయంలో సంతోషంగా ఉండాలంటే ఇలా చేయండి..

11 October 2024, 12:33 IST

google News
    • Diabetic Sex Issues: జీవితంలో యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు పలు దశల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాల్లో సెక్స్ ఒకటి.మనుషుల మధ్య సంబంధాలు,సమస్యలు,అశాంతికి ప్రత్యక్షంగా, పరోక్షం గా దీని ప్రభావం ఉంటుంది. ఏళ్ల తరబడి డయాబెటిస్‌ సమస్యతో బాధపడుతున్న వారిలో లైంగిక సామర్థ్యం సమస్యలు ఏదో ఒక దశలో ఎదురవుతాయి.
మధుమేహంలో వచ్చే శృంగార సమస్యలను అధిగమించడం ఎలా?
మధుమేహంలో వచ్చే శృంగార సమస్యలను అధిగమించడం ఎలా?

మధుమేహంలో వచ్చే శృంగార సమస్యలను అధిగమించడం ఎలా?

Diabetic Sex Issues: మధుమేహం మానవ జీవితంపై ఎన్నో విధాలుగా ప్రభావం చూపిస్తుంది. పదేళ్ల కంటే ఎక్కువగా మధుమేహం ఉన్న వారిలో సెక్స్ జీవితంపై దాని ప్రభావం వుంటుంది.డయాబెటిస్ లేనివారిలో కూడ జీవితంలో ఏదో ఒక దశలో సెక్స్ సమస్యలు ఎదురవడం సాధారణమే అయినా డయాబెటిస్‌ ఉన్న వారిలో ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది పరిష్కారం లేని సమస్య కాదని వైద్యుల సలహాలతో తగిన ముందు జాగ్రత్తలతో రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించుకుంటే ఈ సమస్య వచ్చే అవకాశం తక్కువేనంటున్నారు.

ఎలా మొదలవుతుంది...

డయాబెటిస్ వచ్చిన మొదటి రోజుల్లో శృంగారము పట్ల కొంత తక్కువ ఆసక్తి, కొద్దిగా అంగస్థంబన లోపాలు కనిపించవచ్చు. దీనికి శరీరంలోని మెటబాలిజంలోని మార్పులు, బలహీనత కారణం కావచ్చు.ఈ సమస్య తాత్కాలికమే. సుదీర్ఘకాలం పాటు డయాబెటిస్ ఎదుర్కొంటున్న వారిలో రక్తనాళాల్లో మార్పులు, హార్మోనుల్లో జరిగే చర్యలు, నరాలలో మార్పు వలన వచ్చే అంగస్థంభన సమస్యలు ఎక్కువగా,శాశ్వతంగాను ఉండిపోతాయి.

డయాబెటిస్ రోగుల్లో కనిపించే సెక్స్ సమస్యలు...

1. కామవాంఛ తగ్గడం

2. శీఘ్రస్కలనము

3. అంగస్థంభనలో వైఫల్యము

వీటిలో మధుమేహ రోగులతో పాటు లేని వారిలో కూడా అంగస్థంభన వైఫల్యము సాధారణంగా కనిపిస్తుంది.

శీఘ్ర స్కలనము (Premature Ejaculation): ఇది చాల సాధారణమైన సమస్యగా వైద్యలు వివరిస్తారు.సంభోగసమయంలో 2 నిముషాల కంటే ముందుగా వీర్యం స్కలించడానిని శీఘ్రస్కలనంగా పరిగణిస్తారు.

దీనిని అధికమించడానికి సైకోథెరఫీ, మాస్టర్ జాన్సన్ టెక్నిక్, స్టార్ట్‌-స్టాప్‌ టెక్నిక్‌, లోకల్ అనస్తీషియా జెల్ లేక స్ప్రే పద్ధతులతో పాటు వైద్యుల సిఫార్సుతో మందులను వాడటం వంటి వంటి పద్ధతులు అనుసరించవచ్చు. శ్రీఘ్ర స్కలనం సమస్యను ఉద్రేకాన్ని నియంత్రించుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు.

పురుషాంగం కొనకు, పురుషాంగానికి లోకల్ అనస్తీషియా జెల్‌ లేదా స్ప్రేలు ఉపయోగించడం ద్వారా కూడ ఈ సమస్యను అధిగమించవచ్చని ఎండోక్రైన్ నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ తరహా చికిత్సలను వైద్యుల పర్యవేక్షణలోనే చేయాల్సి ఉంటుంది.

అంగస్థంభనలో వైఫల్యాలు ఎలా వస్తాయి?

మెదడులో సెక్స్ పట్ల ఆలోచనలు మొదలవగానే పారాసింపాథిటిక్ నాడులు స్పందించడం మొదలు పెడతాయి. ఫలితంగా పురుషాంగములోని రక్తనాళాలు రక్తంతో నిండి వెడల్పవుతాయి. క్రమంగా పురుషాంగం స్థంభిస్తుంది. రక్తము వెనుకకు పోకుండా రక్త నాళాల ద్వారాలు మూసుకుంటాయి. సంభోగం తరువాత పురుషాంగం సాధారణ స్థితికి చేరుకుంటుంది.

మధుమేహ రోగుల్లో రక్తనాళాలు కుచించుకు పోవడం (ఎండోథీలియల్ డిస్ ఫంక్షన్), రక్తం నాళాల్లో ఎక్కువగా చేరక పోవడం, అటనామిక్ న్యూరోపతి వలన నరాల నుండి సరైన సందేశాలు మెదడుకు చేరకపోవడం, నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి తగ్గడంవంటి కారణాల వలన అంగస్థంభనలో వైఫల్యాలు ఎదురవుతాయి.

మానసిక కారణాలా? నరాల బలహీనతా?

మానసిక కారణాలవలన అంగస్థంభనలు జరుగనివారికి నిద్రలో ప్రాతఃకాలములో అంగస్థంభనలు వుంటాయి. మానసిక కారణాలు వలన అంగస్థంభన లేని వారిలో ఒక భాగస్వామితో అంగస్థంభనలు లేకున్నా, మరో భాగస్వామితో అంగస్థంభనలు సాధారణంగా ఉండొచ్చు. డయాబెటిస్ వలన అంగస్థంభనలు లేనివారికి భావోద్వేగాలతో సంబంధం లేకుండా ఇలాంటి సమస్య ఏర్పడొచ్చు.

అయితే మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరికీ లైంగిక పటుత్వము తగ్గదు. వయసు మీ పడటం, అటనామిక్ న్యూరోపతి వున్న వారికి మాత్రం ఇలా తగ్గవచ్చు. మొదట త్వరగా స్కలనం కావడంతో మొదలై, అప్పుడప్పుడు స్థంభనలు జరగక పోవడం, క్రమంగా అంగ స్థంభనలు ఆగిపోవడం జరుగుతుంది.

సామర్థ్య పరీక్షలు: పురుషాంగానికి రక్తసరఫరా ఎలా వుందో తెలుసుకోవడానికి పెనైల్ బ్రాఖియల్ ఇండెక్స్ అనే డాప్లర్ పరీక్షను చేస్తారు. 0.6 కన్నా తక్కువ ఉన్నట్లయితే రక్తసరఫరా తగ్గినట్లు భావించాలి.

సి-రియాక్టివ్ ప్రోటీన్: రక్తనాళాలలో వచ్చిన మార్పు తీవ్రతను బట్టి పెరుగుతూ వుంటుంది.

వృషణాలులో (Testicles) నొప్పిని పరీక్షించి చూస్తే, నొప్పిలేకపోతే అంగస్థంభనలేకపోవడానికి నరాలబలహీనత కారణమని గ్రహించవచ్చు. అంగస్థంభనకు వుపయోగపడే నరాలు, వృషణాల నొప్పిని గ్రహించే నరాలు ఒక్కటే.

మూత్ర విసర్జన చేసే సమయంలో మూత్ర విసర్జనను మధ్యలోనే కొన్ని సెకండ్లు అపగలిగి, మళ్ళీ విసర్జన కొనసాగించగలిగితే అటనామిక్ నరాలు పని చేస్తున్నట్లుగా భావించాలి. రక్తంలో ప్రొలాక్టిన్, టెస్టోస్టిరాన్, గ్లూకోజ్, లిపిడ్స్ విలువలను పరీక్ష చేయించుకోవాలి.

లైంగిక సామర్థ్యం తగ్గితే అవసరమైన చికిత్సలు:

1. రక్తంలో గ్లూకోజ్, లిపిడ్స్ నియంత్రణలో వుండేలా జాగ్రత్త పడాలి.

2. ప్రతిరోజు వ్యాయామం చెయ్యాలి. వ్యాయామం లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది.

3. మానసిక ఒత్తిడి లేకుండా జీవించాలి. కుటుంబసభ్యులు, భాగస్వామితో ఆనందంగా, వుల్లాసంగా కాలం గడపాలి.

4. ధూమపానము పూర్తీగా మానివేయాలి.

5. అధిక బరువు వున్న వారిలో అంగస్థంభన విఫలం అయ్యే అవకాశాలు ఎక్కువ, కనుక బరువు పెరగకుండా వుండాలి.

డయాబెటిస్ ఉన్న మహిళల్లో సెక్స్ సమస్యలు:

డయాబెటిస్ కల మహిళలకు పురుషులతో పోలిస్తే, సెక్స్ సమస్యలు తక్కువగా ఉంటాయి. ప్రధానంగా యోనిలో తడిగా లేదా పొడిగా మారి శృంగారానికి అసౌకర్యంగా మారడము, శృంగారానికి కావాల్సిన స్పందనలు తక్కువకావడం జరుగుతుంది.

ఋతుస్రావం సక్రమంగా జరుగక పోవడం, యోనిలోనూ, మూత్ర ద్వారంలోను తరచు ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏర్పడి అసౌకర్యం కలుగుతుంది. చాలాతక్కువ మందిలో శృంగార ఆకాంక్ష తగ్గుతుంది.

(గమనిక.. మధుమేహం వల్ల తలెత్త ఆరోగ్య సమస్యలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చికిత్సలు పొందాల్సి ఉంటుంది, పాఠకుల అవగాహన కోసం మాత్రమే)

తదుపరి వ్యాసం