Avakaya Fried Rice: స్పైసీ ఆవకాయ ఫ్రైడ్ రైస్, తింటే ఫ్యాన్ అయిపోతారు
06 October 2024, 17:30 IST
Avakaya Fried Rice: ఆవకాయ రుచితో చేసే ఫ్రైడ్ రైస్ రెసిపీ ఇది. దీనికోసం ఆవకాయ కూడా వాడతాం. కాస్త మార్చి ఫ్రైడ్ రైస్ రుచి తీసుకువస్తాం. ఈ సింపుల్ రెసిపీ తయారీ చూసేయండి.
ఆవకాయ ఫ్రైడ్ రైస్
ఆవకాయతో ఫ్రైడ్ రైస్ ఏంటీ అనుకుంటున్నారా. మీకు ఆవకాయ రుచి నచ్చితే మాత్రం మీరు ఈ ఫ్రైడ్ రైస్ ఫ్యాన్ అయిపోతారు. అలానీ పెద్ద కష్టమైన రెసిపీ ఏం కాదిది. చాలా సులువుగా మిగిలిన అన్నంతో అయినా అల్పాహారంలోకి, సాయంత్రం డిన్నర్ లోకి చేసుకోవచ్చు. రెసిపీ ఎలాగో చూసేయండి.
ఆవకాయ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సినవి:
2 చెంచాల ఆవకాయ
2 కప్పుల అన్నం
2 చెంచాల నూనె
గుప్పెడు కొత్తిమీర తరుగు
అరచెంచా అల్లం వెల్లుల్లి ముద్ద
1 క్యాప్సికం
2 క్యారట్
పావు కప్పు క్యాబేజీ తరుగు
2 పచ్చిమిర్చి, పొడవాటి చీలికలు
సగం టీస్పూన్ మిరియాల పొడి
ఉప్పు అర చెంచా
అర చెంచా సోయా సాస్ (ఆప్షనల్)
అరచెంచా టమాటా సాస్
ఆవకాయ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం:
- ముందుగా పెద్ద గిన్నెలో అన్నం తీసుకుని అందులో ఆవకాయ వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనికోసం అప్పుడే వండిన అన్నం వాడొచ్చు. లేదా మిగిలిన అన్నం అయినా పర్వాలేదు.
- ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో నూనె వేసుకోండి. కాస్త వేడెక్కాక పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని పచ్చి వాసన పోయేదాకా వేయించండి.
- తర్వాత క్యారట్, క్యాబేజీ, క్యాప్సికం ముక్కలు ఒకదాని తర్వాత మరోటి వేసుకుని కలుపుకోండి. అన్నీ బాగా వేగిపోయాక అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి కలపండి.
- కొత్తిమీర తరుగు వేసి కలియబెట్టి అందులో ఇందాక కలిపి పెట్టుకున్న ఆవకాయ అన్నం వేసుకోండి.
- అన్నీ బాగా కలుపుకున్నాక చివరగా మీకిష్టముంటే టమాటా సాస్, సోయా సాస్ వేసి కలపండి. వీటితో స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ రుచి వస్తుంది. అంతే.. అన్నీ బాగా కలిపేసి దింపేసుకుంటే ఆవకాయ ఫ్రైడ్ రైస్ రెడీ.