Coconut Sugar Benefits : కొబ్బరి చక్కెర ఎలా తయారు చేస్తారు? ప్రయోజనాలు ఏంటి?
01 September 2023, 10:20 IST
- Coconut Sugar Benefits : చక్కెర ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. చక్కెర వినియోగం మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. అలాగని షుగర్‌ని ఒకేసారి వదిలేయడం కష్టమవుతుంది. దీనికి బదులుగా కొబ్బరి చక్కెరను వాడితే మంచిది. అయితే దీనిని ఎలా తయారు చేస్తారు?
కొబ్బరి చక్కెర
చెరకు రసంతో చేసిన చక్కెరను సాధారణ చక్కెర అంటారు. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ విలువ 60. ఇది చాలా ప్రమాదకరం. ఇది మధుమేహం, ఇన్సులిన్ నిరోధకత, కొవ్వు కాలేయ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది ప్రాసెస్ చేయబడినందున, ఇందులో విటమిన్లు, ఖనిజాలు ఉండవు. చక్కెరను తప్పనిసరిగా తీసుకోవాలి అనుకునేవారు.. దీనికి బదులుగా కొబ్బరి చక్కెర(Coconut Sugar)ను తీసుకోవచ్చు. ఇది ఆరోగ్య పరంగా కూడా చాలా మేలు చేస్తుంది.
కొబ్బరి చక్కెర గురించి చాలా మందికి తెలియదు. అయితే ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలా మంది చెబుతారు. దీన్ని ఎలా సిద్ధం చేయాలో మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇది కొబ్బరికాండం నుంచి తీసి.. ప్రత్యేక ద్రవంతో తయారు చేస్తారు. కొబ్బరి చెట్టుపై నుంచి ఓ పదార్థాన్ని తీసి.. అందులోని రసం ఆవిరైపోయే వరకు వేయించాలి. అప్పుడు అది స్ఫటికాలుగా మారుతుంది. దీనిని కొబ్బరి చక్కెర అంటారు. కొబ్బరి చక్కెర గ్లైసెమిక్ ఇండెక్స్ 35 నుండి 54 వరకు ఉంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇది సాధారణ చక్కెర కంటే తక్కువ. కొబ్బరి పంచదార తీసుకోవడం వల్ల మధుమేహం వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది.
కొబ్బరి చక్కెరలో ఇన్యులిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది భోజనం తర్వాత రక్తంలో చక్కెర పెరుగుదలను తగ్గిస్తుంది. అసిటేట్, బ్యూటిరేట్, ప్రొపియోనేట్ వంటి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్‌ల సంశ్లేషణకు ఇది అవసరం. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులు(Diabetic Patients) దీనిని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.
కొబ్బరి చక్కెరలో విటమిన్ సి(Vitamin C), విటమిన్ ఇ, జింక్, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ చిన్న మొత్తంలో ఉంటాయి. అందుకే ఇది సాధారణ చక్కెర కంటే మెరుగైనదిగా పరిగణిస్తారు. కలర్ తెల్లగా ఉండదు. బ్రౌన్ కలర్ లో ఉంటుంది.
సాధారణ చక్కెర కంటే కొబ్బరి చక్కెర పూర్తిగా ఆరోగ్యకరమని పోషకాహార నిపుణులు అంటున్నారు. చక్కెర ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ఎక్కువైతే అమృతం కూడా విషం అవుతుంది. ఏ ఆహారమైనా సమతుల్యంగా తీసుకోవాలి. చక్కెర ఏ విధంగా తీసుకున్నా.. మితంగానే ఉండాలి.
కొబ్బరి చక్కెర జీర్ణాశయానికి ఎంతో మేలు చేస్తుంది. దీంట్లో ప్రీబయోటిక్స్ జీర్ణక్రియను అదుపులో ఉంచుతాయి. కొబ్బరి చక్కరలో సాధారణ చక్కెర కంటే.. దాదాపు 400 రెట్లు ఎక్కువ పొటాషియం అధికంగా ఉంటుంది. గుండె, నరాలు, కండరాల పనితీరు నియంత్రిస్తుంది. బీపీని కూడా తగ్గిస్తుంది. కొబ్బరి చక్కెర పెద్ద పేగు క్యాన్సర్ ను రాకుండా నివారిస్తుంది.