Pooja Room | పూజ గది ఎలా ఉండాలి? పూజ గదికి తాళం వేయవచ్చా?
28 February 2022, 17:26 IST
పూజ గదికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. దేవుడి పటాలకు, ప్రతిమలకు మనం పూజలు చేస్తుంటాం. అయితే ఎవరి ఆర్ధిక స్ధోమతను బట్టి వారు దేవుడికి ప్రత్యేకంగా ఒక మందిరం, గది, అలమరా కేటాయిస్తారు. దేవుడి గది ఏర్పాటు కోసం కూడా వాస్తును తప్పక పాటించాల్సిందే.
పూజ గది ఎలా ఉండాలి?
దేవుడికి ప్రత్యేకించి ఒక గదిని ఏర్పాటు చేయలనుకుంటే.. ఈశాన్యాన్ని ఎంచుకోవడం మంచిది. ఈశాన్యం గదిలో ఎత్తుగా అరుగుగానీ మందిరం మాదిరి కట్టడంగానీ చేయకూడదు. ఈశాన్యం గదిలో దక్షిణ, పశ్చిమ, నైరుతిలలో పీట వేసి గానీ, ఏదైనా వస్త్రం వేసి గాని దానిపై దేవుడి పటాలు, ప్రతిమలు ఉంచి పూజ చేసుకోవచ్చు.
పటాలను గోడకు తగిలించాల్సి వస్తే.. దక్షిణ, పశ్చిమ గోడలకు వేలాడదీయాలి. ఈశాన్యం గదిలో దక్షిణ, పశ్చిమ గోడలలో గల అలమారలో కూడా దేవుణ్ణి ఉంచొచ్చు. ఈశాన్యం గదిని దేవుడి గదిగా ఏర్పాటు చేయడం వీలుకాని పక్షంలో తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, వాయువ్యాలలో చేసుకోవచ్చు.
నైరుతి, ఆగ్నేయ గదులు మాత్రం దేవుడి గదులుగా చేయకండి. ప్రత్యేకించి దేవుడి గదిని ఏర్పాటు చేయటం అనుకూలం కానీ పక్షంలో గృహములో ఏ గదిలోనైనా దేవుడి పటాలు, ప్రతిమలు ఉంచి పూజించవచ్చు.
దేవుని గది నిర్మాణంలో జాగ్రత్తలు
నిజానికి ఈశాన్యంలో పూజ గది ఉండాలని చెప్పి ఈశాన్యం గదిని పూజ గదిగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. ఈశాన్యం గదిలో నుంచి రాకపోకలు ఉండేలా రెండు ద్వారాలు ఉంచి బరువులు ఉంచకుండా, పరిశుభ్రంగా ఉంచుతూ వాడుకోవడం మంచిది. కొందరి జాతక దృష్ట్యా ఇంట్లో ప్రత్యేకంగా పూజ గది ఏర్పాటు చేయరాదని కూడా చెబుతుంటారు. జాతకం చూపించుకున్నప్పుడు దీనిని ప్రస్తావిస్తే జాతకకర్తలు చెబుతారు.
- తూర్పు, ఉత్తర దిక్కులలో పూజా గదిని ఏర్పాటు చేసుకోవడంలో ఏ మాత్రం దోషం లేదు. దక్షిణ, పశ్చిమాల వైపు పూజ గది ఏర్పాటు చేయడం వల్ల ఇతర అవసరాల కోసం ఇంటిలో ఎక్కువగా తూర్పు, ఉత్తర భాగాలను వాడుకోగలుగుతాం.
- పూజ గదికి ఆనుకుని బాత్ రూమ్ లేదా టాయిలెట్సు ఉండకూడదు. పూజ గది పైనగానీ, కింద గానీ టాయిలెట్సు ఉండకూడదు.
- పూజ గది మీద లో-రూఫ్ వేసి స్టోర్ రూమ్ తరహాలో సామాగ్రి ఉంచుతారు. ఇది సరికాదు.
- పూజ గదిలో అరుగులు నిర్మించి దానిపై దేవుడి పటాలను ఉంచి పూజ చేసుకోవడం చాలా ఇళ్లల్లో అలవాటుగా ఉంది. దానికి బదులు కొయ్య పీట, మండపములో ఉంచుకోవాలి.
కొత్త వస్త్రం వేసి..
- అరుగు మీద లేదా నేల మీద పూజ పటాలు ఉంచాల్సి వచ్చినప్పుడు నేలపై కొత్త వస్త్రాన్ని వేసి దానిపై పూజ పటాలు ఏర్పాటు చేయాలి.
- చాపగాని, వస్త్రముగాని వేసుకొని దానిపై కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించాలి. పూజా గృహంలో నిత్య దీపారాధన ఎంతో శుభకరం.
- దేవుడి ఫొటోలకు సమానంగా పెద్దల ఫొటోలను పూజ గదిలో ఉంచడం శుభకరం కాదు.
- పూజకి ప్రత్యేక గది ఉన్నప్పుడు తలుపు తప్పనిసరిగా ఉంటుంది. ఊరెళ్లినప్పుడు కొందరు దేవుడి గదికి కొందరు తాళం వేస్తుంటారు. మనం ఇంట్లో ఉన్నా.. బయటికి వెళ్లినా దేవుడి గదికి తాళం అసలు వేయకూడదు.