తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunscreen For Your Skin Type: మీ చర్మానికి ఏ సన్‌స్క్రీన్ ఎంచుకోవాలి?

Sunscreen for your skin type: మీ చర్మానికి ఏ సన్‌స్క్రీన్ ఎంచుకోవాలి?

HT Telugu Desk HT Telugu

30 March 2023, 10:28 IST

google News
  • Sunscreen: మీ చర్మాన్ని బట్టి సన్ స్క్రీన్ ఎంచుకోవడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

చర్మాన్ని బట్టి సన్ స్క్రీన్ ఎంచుకోవాలి
చర్మాన్ని బట్టి సన్ స్క్రీన్ ఎంచుకోవాలి (Pexels )

చర్మాన్ని బట్టి సన్ స్క్రీన్ ఎంచుకోవాలి

సూర్యుని అతినీలలోహిత (యూవీ) కిరణాల హానికరమైన ప్రభావాల నుండి మీ చర్మాన్ని రక్షించడంలో సన్‌స్క్రీన్ లోషన్ బాగా ఉపయోగపడుతుంది. సన్‌స్క్రీన్‌ లేనిపక్షంలో చర్మం దీర్ఘకాలికంగా దెబ్బతింటుంది. దీనిని రివర్స్ చేయడం కష్టం. అందువల్ల మీరు మొటిమల బారిన పడే చర్మాన్ని కలిగి ఉన్నప్పటికీ సన్‌స్క్రీన్‌ను మీ చర్మ సంరక్షణలో భాగం చేసుకోవడం చాలా అవసరం.

మార్కెట్లో అనేక రకాలైన సన్‌స్క్రీన్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే మీ చర్మానికి ఏది సరైనదో తెలుసుకోవడం పెద్ద సవాలే. సరైనది ఎంచుకోనిపక్షంలో సన్‌స్క్రీన్ ప్రోడక్ట్ మీ చర్మాన్ని జిడ్డుగా, జిగటగా మార్చుతుంది. చిరాకు తెప్పిస్తుంది. అందుకే మీ స్కిన్ టైప్ తెలుసుకుని, దానికి పనికివచ్చే సన్‌స్క్రీన్‌ను గుర్తించాలి.

ఏస్తటిక్ మెడిసిన్ అండ్ సర్జరీ విభాగానికి చెందిన వైద్యులు డాక్టర్ అక్బర్ ఐమర్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాలను వివరించారు. మీ స్కిన్ టైప్‌ను బట్టి ఏ సన్ స్క్రీన్ ఎంచుకోవాలో సూచించారు.

జిడ్డు లేదా మొటిమలు వచ్చే చర్మం:

ఆయిలీ స్కిన్ అయినా, లేక మొటిమలు వచ్చే చర్మం అయినా మీరు లైట్ వెయిట్, ఆయిల్ ఫ్రీ, నాన్-కోమ్‌డోజెనిక్ సన్‌స్క్రీన్ వాడాలి. మొటిమలు వచ్చే చర్మం కలిగిన వారు సన్‌స్క్రీన్‌ను వాడకుండా ఉండొద్దు. సూర్మరశ్మిలో ఉండే యూవీ కిరణాలు మొటిమలను మరింత ఇబ్బందికి గురిచేస్తాయి. హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంది. మచ్చలు ఏర్పడుతాయి. త్వరగా వృద్ధాప్యం దరిచేరుతుంది. సూర్యరశ్మి వల్ల ఇన్‌ఫ్లమేషన్ పెరిగి ఇప్పటికే ఉన్న మొటిమలు మరింత సమస్యలు తెచ్చిపెడతాయి. మొటిమలకు సంబంధించిన కొన్ని రకాల ఔషధాలు చర్మాన్ని మరింత సున్నితంగా మార్చుతాయి. అందువల్ల సన్ స్క్రీన్ వాడడం తప్పనిసరి.

పొడి చర్మం లేదా సున్నితమైన చర్మం:

పొడిబారిన చర్మం, సున్నితమైన చర్మం ఉన్నప్పుడు మాయిశ్చరైజింగ్ సన్ స్క్రీన్ వాడాలి. హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్ లేదా సెరామైడ్స్ కలిగిన ఉత్పత్తులు వాడాలి. ఫ్రాగ్రెన్స్ లేని ఉత్పత్తులు వాడడం వల్ల ఇరిటేషన్ తప్పించుకోవచ్చు.

రెండు రకాలుగా ఉండే చర్మం:

అటు జిడ్డులా, ఇటు పొడిబారినట్టు ఉండే చర్మం కలిగి ఉంటే లైట్ వెయిట్, నాన్ గ్రీజీ సన్ స్క్రీన్ వాడాలి. అయితే పొడి ప్రాంతాల్లో హైడ్రేషన్ ఇవ్వగలిగే సన్ స్క్రీన్ అయి ఉండాలి. ‘ఫర్ ఆల్ స్కిన్ టైప్స్’ అని లేబుల్ ఉన్నది గానీ, ‘కాంబినేషన్ స్కిన్’ అని రాసి ఉన్నది గానీ తీసుకోవాలి.

వీటికి దూరంగా ఉండండి

జింక్ ఆక్సైడ్ లేదా టైటానియం డయాక్సైడ్ ఉన్న సన్ స్క్రీన్ ఉత్పత్తులను వాడకూడదు. లేదంటే ఇవి మీ చర్మంపై తెల్లని మచ్చలను ఏర్పరస్తాయి. లేత రంగు సన్ స్క్రీన్లను గానీ, డార్కర్ స్కిన్ టోన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన సన్ స్క్రీన్లను గానీ వాడొచ్చు.

ఔట్ డోర్ యాక్టివిటీస్ లేదా స్పోర్ట్స్ కోసం:

బహిరంగ ప్రదేశాల్లో కార్యకలాపాల్లో పాల్గొనాల్సి వచ్చినా, లేదా క్రీడల్లో పార్టిసిపేట్ చేస్తున్నా.. వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్ వాడాలి. అధిక ఎస్పీఎఫ్ (30 లేదా అధికం) ఉన్నది తీసుకోవాలి. ప్రతి రెండు గంటలకోసారి అప్లై చేయాలి.

నలుపు రంగు చర్మానికి కూడా

నలుపు రంగు చర్మానికి సన్ స్క్రీన్ అవసరం లేదన్న అపోహ ఉంటుంది. ఈ చర్మంలో ఎక్కువ మెలనిన్ ఉంటుందని, అది సూర్యరశ్మి నుంచి కాపాడుతుందని నమ్ముతారు. కొంతమేరకు సహజ సంరక్షణ అందిస్తుంది. కానీ అది సరిపోదు. అందువల్ల నలుపు రంగు చర్మానికి కూడా సన్ స్క్రీన్ అవసరం.

ముందుగా టెస్ట్ చేయండి

మీ ముఖానికి, శరీరానికి సన్ స్క్రీన్ వాడే ముందు ముందుగా చర్మంపై ఒక భాగంలో పూసి చూడండి. అంతా బాగానే ఉంటే కొనసాగించండి. చర్మ సంబంధిత సమస్యలు వస్తే వైద్య నిపుణులను సంప్రదించడం మరిచిపోవద్దు.

తదుపరి వ్యాసం