తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chanakya Niti : విద్యార్థులకు మంచి మార్కులు ఎలా రావాలి? చాణక్యుడి ఫార్ములాలివి

Chanakya Niti : విద్యార్థులకు మంచి మార్కులు ఎలా రావాలి? చాణక్యుడి ఫార్ములాలివి

Anand Sai HT Telugu

30 September 2023, 8:00 IST

google News
    • Chanakya Niti Telugu : 'విద్యార్థి జీవితం బంగారు జీవితం' అన్న మాట ప్రకారం.. విద్యార్థి జీవితంలో జాగ్రత్తగా నడుచుకోవాలి. చిన్న పొరపాటు కూడా జీవిత దిశనే మార్చేస్తుంది. చాణక్యుడు ప్రకారం విద్యార్థులు చదువు పట్ల అంకితభావంతో ఉండాలి.
చాణక్య నీతి
చాణక్య నీతి

చాణక్య నీతి

చదువులో ప్రతి దశలో సీరియస్ గా ఉండే విద్యార్థి ఏదో ఒకరోజు గొప్ప వ్యక్తి అవుతాడు. చాణక్యుడి సూత్రాలను పాటిస్తే ఏదో ఒకరోజు మీరు గొప్ప వ్యక్తులు అవుతారనడంలో సందేహం లేదు. విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యం. తన జీవనశైలిలో క్రమశిక్షణను చేర్చుకున్న వ్యక్తి విజయం కోసం ఎప్పుడూ కష్టపడాల్సిన అవసరం ఉండదు. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి తన తెలివితేటలతో దేనినైనా జయించగలడు. దీనితో పాటు సమయపాలన చాలా ముఖ్యం. మనం ఎవరి పక్షాన నిలబడకూడదు, కాలంతో పాటు పరుగెత్తేలా మన జీవన విధానం ఉండాలి. ఏ పని అయినా సకాలంలో పూర్తి చేసి లక్ష్యాన్ని చేరుకునే దిశగా మన అడుగులు వేయాలి.

చాణక్యుడి నీతి ప్రకారం సాంగత్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సహవాసం మనకు ఉపయోగపడేలా, విజ్ఞానాన్ని పెంచేలా ఉండాలి. మీరు చెడ్డ వ్యక్తులతో సహవాసం చేస్తే, అది మీ భవిష్యత్తుకు హాని కలిగిస్తుంది. చెడు సహవాసం మీ నైపుణ్యాలను, ప్రతిభను చంపేస్తుంది. విద్యార్థులు మంచి వ్యక్తులతో సహవాసం చేస్తే మంచిది.

సోమరితనాన్ని విడిచిపెట్టాలని చాణక్యుడు చెప్పే మాట. సోమరితనం విద్యార్థులకు ప్రధాన శత్రువు. వీలైనంత వరకు బద్ధకాన్ని వదిలిపెట్టండి. లక్ష్యం కోసం పని చేయడం ప్రారంభించండి. ఎందుకంటే సోమరితనం మీ లక్ష్యాల కోసం పని చేయనివ్వదు. ఏం చేసినా రేపు కాదు ఈరోజే అనుకోవాలి. దీన్ని సరిదిద్దుకోకపోతే జీవితంలో కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మీ చెడు అలవాట్లకు దూరంగా విడిచిపెట్టాలి.

ఈ కాలంలో విద్యార్థులు డ్రగ్స్ పట్ల సులభంగా ఆకర్షితులవుతున్నారు. కానీ ఇది మీ ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాదు, మీ భవిష్యత్తు లక్ష్యాలను నిర్వీర్యం చేసేస్తుంది. విద్యార్థులు శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మత్తు పదార్థాలను దగ్గరకు రానివ్వకండి.

విద్యార్థులు అత్యాశతో ఉండకూడదని చాణక్యుడు తన విధానంలో చెప్పాడు. దురాశ మానవునికి అత్యంత నీచమైన లక్షణం. అత్యాశపరులు ఎప్పుడూ కష్టపడటానికి ఇష్టపడరు, పక్కదారి పడతారు. విద్యార్థులు అత్యాశకు దూరంగా ఉండాలి.

చదువుతో పాటు వినోదం చాలా ముఖ్యం. కానీ వినోదమే జీవితం కాకూడదు. చదవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి, ఖాళీ సమయంలో ఇతర కార్యకలాపాలలో పాల్గొనండి. ఉదాహరణకు క్రీడలు, నృత్యం, పెయింటింగ్, సంగీతం మొదలైనవి. కానీ అతిగా టీవీ, మొబైల్ వాడకం మంచిది కాదు. ఇవన్నీ మితంగా ఉండటం మంచిది.

ఆచార్య చాణక్యుడి ప్రకారం కోపం కంటే గొప్ప శత్రువు లేదు. కోపం వచ్చినప్పుడు, ఒక వ్యక్తి తన విలువను కోల్పోతాడు. ఈ సందర్భంలో, వ్యక్తి ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోతాడు. విద్యార్థులు ఎప్పుడూ కోపానికి దూరంగా ఉండాలి. ఉదయాన్నే యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా మనసును అదుపులో ఉంచుకోవచ్చు.

మీ జీవితంలో విజయం సాధించడానికి, ప్రేమ, కామం కార్యకలాపాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు ఈ వ్యామోహంలో పడిపోతే, దాన్నుంచి బయటపడటం కష్టమే. అంతేకాదు ఏకాగ్రత కూడా తగ్గిపోతుంది. ఆరోగ్యం, చదువు పట్ల శ్రద్ధ తగ్గుతుంది. గొప్ప వ్యక్తి కావాలనుకునేవారు.. ఈ సూత్రాలను పాటించాలి. ఇది మీ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవడానికి సహాయపడుతుంది.

తదుపరి వ్యాసం