తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Screen Time | పిల్లల స్క్రీన్‌ టైమ్‌ ఎంత? మీ పిల్లలు పాటిస్తున్నారా?

Screen Time | పిల్లల స్క్రీన్‌ టైమ్‌ ఎంత? మీ పిల్లలు పాటిస్తున్నారా?

Hari Prasad S HT Telugu

18 February 2022, 11:41 IST

    • Screen Time | ఆరుబయట ఆడుకునే టైమ్‌ అంతా ఇప్పుడు మొబైల్‌, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌, టీవీ స్క్రీన్లతోనే గడిచిపోతోంది. కరోనా కారణంగా ఇది మరింత ఎక్కువైంది. పాఠాలు కూడా మొబైల్‌, కంప్యూటర్‌ స్క్రీన్లపైనే వినాల్సి వచ్చింది. బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో పిల్లలు మరింతగా మొబైల్‌ స్క్రీన్లకు అతుక్కుపోయారు.
స్క్రీన్ టైమ్ ఎక్కువైతే పిల్లలకు ముప్పే
స్క్రీన్ టైమ్ ఎక్కువైతే పిల్లలకు ముప్పే (Pexels)

స్క్రీన్ టైమ్ ఎక్కువైతే పిల్లలకు ముప్పే

Screen Time.. ఈ జనరేషన్‌ పిల్లలను చూస్తున్నాం కదా. చేతిలో మొబైల్‌ లేకుండా ముద్ద కూడా గొంతు దిగడం లేదు. ఇది మంచిది కాదని తెలిసినా.. తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. మరి పిల్లలు రోజూ ఎంతసేపు మొబైల్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ లేదా టీవీ స్క్రీన్లను చూడవచ్చు? పరిమితి దాటితే వచ్చే ముప్పేంటి? పిల్లలను స్క్రీన్ల నుంచి ఎలా దూరం చేయాలన్న విషయాలు ఇప్పుడు చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Saturday Motivation: ఏం జరిగినా అంతా మన మంచికే అనే పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి, ఎప్పటికైనా మేలే జరుగుతుంది

Buttermilk : వేసవిలో మజ్జిగను ఇలా చేసి తాగితే చర్మం, జుట్టుకు చాలా మంచిది

Iskon khichdi Recipe : కొత్తగా ట్రై చేయండి.. ఇస్కాన్ కిచిడీ రెసిపీ.. చాలా టేస్టీ

Foundation Side effects: ప్రతిరోజూ ముఖానికి ఫౌండేషన్ అప్లై చేస్తున్నారా? ఇలా చేస్తే జరిగేది ఇదే

ఎంత Screen Time ఉండొచ్చు?

ఈ మధ్య కాలంలో కొంత మంది తల్లిదండ్రులు.. మా పిల్లల దగ్గర కూడా స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి తెలుసా అన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఆ మొబైల్స్‌ వారికి చేస్తున్న చేటును మాత్రం గుర్తించడం లేదు. ఏడాది నుంచి మూడు నాలుగేళ్ల వయసున్న పిల్లలకు కూడా చేతికి మొబైల్స్‌ ఇచ్చేస్తున్నారు. అది చూస్తేగానీ ముద్ద ముట్టుకోవడం లేదని చెబుతున్నారు. 

కానీ అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ ప్రకారం.. అసలు రెండేళ్లలోపు వయసు పిల్లల చేతికి మొబైల్‌ ఇవ్వకూడదు. అంతకన్నా ఎక్కువ వయసున్న పిల్లలు కూడా రోజుకు గంట నుంచి రెండు గంటల పాటు మాత్రమే స్క్రీన్‌ చూడాలని ఈ అకాడమీ స్పష్టం చేస్తోంది. మొబైల్‌, ల్యాప్‌టాప్, టీవీ, కంప్యూటర్‌ ఏదైనా సరే.. రెండు గంటలు దాటితే పిల్లలకు ప్రమాదమేనని హెచ్చరిస్తోంది.

అధిక Screen Timeతో వచ్చే ముప్పేంటి?

మొబైల్‌, టీవీ స్క్రీన్లను ఎక్కువసేపు చూడటం వల్ల పిల్లలు ప్రధానంగా ఒబెసిటీ బారిన పడే ప్రమాదం ఉంటుంది. స్క్రీన్లను చూస్తూ తినడం వల్ల ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో తెలియడం లేదు. పైగా టీవీలు చూస్తూ జంక్‌ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. ఇది కాస్త క్రమంగా అధిక బరువుకు దారితీస్తుంది. ఇక స్క్రీన్‌ టైమ్‌ ఎక్కువైతే పిల్లల నిద్రపైనా ఆ ప్రభావం ఉంటుంది. 

రాత్రిపూట పడుకునే ముందు కూడా మొబైల్‌ లేదా టీవీ చూడటం వల్ల ఆలస్యంగా పడుకోవడం, సరిగా నిద్రపట్టకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోజూ రెండు గంటల కంటే ఎక్కువసేపు స్క్రీన్లు చూస్తే గడిపే పిల్లల ప్రవర్తన కూడా మారుతుంది. స్క్రీన్లకు అతుక్కుపోయి ఆరుబయట ఆడుకోవడం కూడా మరచిపోతున్నారు. దీనివల్ల శారీరక శ్రమ తగ్గి అనేక అనారోగ్య సమస్యలు రావడంతోపాటు వారిలోని క్రియేటివ్‌ ఆలోచనలు కూడా తగ్గిపోతాయి.

Screen Time ఎలా తగ్గించాలి?

పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం బాగుండాలంటే వారిని ఎలాగైనా సరే స్క్రీన్‌కు దూరం చేయాల్సిందే. దీనికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని పాటించడం ద్వారా వారిని మెల్లగా మొబైల్‌, టీవీ తెరల నుంచి దూరంగా తీసుకెళ్లవచ్చు.

- కొంతమంది ఇళ్లలో 24 గంటలూ టీవీ నడుస్తూనే ఉంటుంది. చూసినా, చూడకపోయినా అలా ఆన్‌ చేసి వదిలేస్తారు. పిల్లలు ఉన్న ఇంట్లో ఇది చాలా ప్రమాదం. వాళ్లు మెల్లగా టీవీ వైపు ఆకర్షితులు అవడానికి ఇది ప్రధాన కారణం అవుతుంది. అందువల్ల మీరు చూడని సమయంలో టీవీ ఆఫ్‌ చేసి ఉంచండి.

- ఇక బెడ్‌రూమ్‌లో టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు లేకుండా చూడాలి. బెడ్‌రూమ్‌లో ఈ ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు ఉన్న పిల్లలు, ఇతర పిల్లల కంటే ఎక్కువ సమయం స్క్రీన్లపై గడుపుతారు.

- ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు టీవీ చూస్తూ భోజనం చేయకండి. ఇది పిల్లలనూ ఆ దిశగా ప్రభావితం చేస్తుంది. టీవీ, మొబైల్‌ చూస్తూ తినడం వల్ల పిల్లలు బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.

- స్క్రీన్‌ చూసే ఆ కొద్ది సమయం కూడా పిల్లలతో కలిసి మీరూ చూసే ప్రయత్నం చేయండి. ఆ స్క్రీన్‌ టైమ్‌ కూడా వారి ఎదుగుదలకు పనికొచ్చే విధంగా ఉండేలా చూడండి. ఆ దిశగా అలాంటి వీడియోలు, గేమ్స్‌ చూసేలా ప్రోత్సహించండి.

- స్క్రీన్‌ టైమ్‌ను తాము ఎందుకు బలవంతంగా తగ్గిస్తున్నామో పిల్లలకు వివరించండి. ఇది అంత సులువు కాకపోయినా.. కొంత కాలానికి వాళ్లు కూడా మెల్లగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు.

- ఖాళీ సమయాల్లో పిల్లలు స్క్రీన్ల వైపు మళ్లకుండా వేరే యాక్టివిటీలలో బిజీగా ఉండేలా చూడండి. బయటకు వెళ్లి ఆడుకోవాలని ప్రోత్సహించడం, పుస్తకాలు చదివించడం, బోర్డ్‌ గేమ్స్‌ ఆడించడం వంటివి చేయొచ్చు.