Chanakya Niti Telugu : ఈ అలవాట్లు ఉన్నవారికి సంపద రాదు.. ఇక ఎలా ఉంటారో మీ ఇష్టం
09 November 2023, 8:00 IST
- Chanakya Niti In Telugu : చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు చాలా విషయాలు చెప్పాడు. సంపద ఎవరి దగ్గర నుంచి వెళ్లిపోతుందో వివరించాడు. ఆయన చెప్పిన ప్రకారం ఎవరి దగ్గర సంపద ఉండదో తెలుసుకుందాం..
చాణక్య నీతి
డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరమే. అందరూ తిండి, బట్టల కోసం పని చేస్తారని తెలుసు. అయితే కొంతమంది ఎంత కష్టపడినా డబ్బు వారితో ఆగదు, సంపద పెరగదు. దీనికి చాణక్యుడు కొన్ని కారణాలను చెప్పాడు. అతని ప్రకారం కొన్ని అలవాట్లు ఉన్న వ్యక్తులకు సంపద ఎప్పుడూ రాదు. వారు తమ జీవితమంతా పేదరికంలో గడుపుతారు. పేదరికానికి దారితీసే అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.
ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఉదయం ఆలస్యంగా లేవడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. సూర్యోదయం తర్వాత కూడా మంచం విడిచిపెట్టని వ్యక్తికి డబ్బు మిగిలి ఉండదు. లక్ష్మి దగ్గరకు రాదు. ఉదయం ఆలస్యంగా మేల్కొనే వ్యక్తులు ఎప్పుడూ పేదరికంలో జీవించి, లక్ష్మి అనుగ్రహాన్ని పొందలేరు అని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పాడు.
శారీరక పరిశుభ్రత లేని వారితో మనుషులే నిలబడం. సంపదల తల్లి లక్ష్మీదేవి నిలబడుతుందా? మురికి బట్టలు వేసుకునే, పళ్లు శుభ్రం చేసుకోని, పరిశుభ్రంగా జీవించని వారితో లక్ష్మి ఎప్పటికీ జీవించదని ఆచార్య చాణక్య చెప్పాడు. అందుకే పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. శుభ్రంగా ఉంటేనే ఎవరైనా మన దగ్గరకు వస్తారు.
అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారం తీసుకోవడం పేదరికానికి దారి తీస్తుంది. ఎందుకంటే అవసరానికి మించి ఆహారం తీసుకునే వారి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆరోగ్యం క్షీణిస్తే ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. తిండికి, ఆసుపత్రికి మనం కష్టపడి సంపాదించిన డబ్బంతా పోస్తే ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? శరీరానికి కావలసినంత ఆహారం తీసుకుంటే మనకు, ఆరోగ్యానికి మేలు.
మనిషి ఎప్పుడూ మధురంగా మాట్లాడాలని చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు చెప్పాడు. మధురంగా మాట్లాడే వ్యక్తిని అందరూ ప్రేమిస్తారు. సమాజంలో ఎల్లప్పుడూ గౌరవం దక్కుతుంది. కఠోరమైన మాటల వల్ల మనుషులతో సంబంధాలు చెడిపోతాయి. మీ పరుషమైన మాటలు మరొకరి హృదయాన్ని గాయపరుస్తాయి. దాని పాపం మీ సంపదపై పడుతుంది. అలాంటి ఇంట్లో లక్ష్మి ఎప్పుడూ నివసించదు.