Health In Home: చిన్నపాటి అనారోగ్య సమస్యలకు గృహ వైద్యమే మేలు, వంటింటి వస్తువులతో ఉపయోగం
01 November 2024, 13:16 IST
- Health In Home: అనారోగ్య సమస్య తలెత్తిన వెంటనే ఎవరైనా ఆస్పత్రికి వెళ్లాలని భావిస్తుంటారు కానీ వ్యాధులు రాకుండా ముందే జాగ్రత్త పడొచ్చు.వ్యాధులు ఎందుకు వస్తాయో తెలిస్తే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే బయటపడొచ్చు. కొన్నిసార్లు మందులు,డాక్టర్ల వల్ల నయం కాని సమస్యలు కూడా వంటింట్లోనే తగ్గిపోవచ్చు.
ఇంట్లో ఉండే వస్తువులతో గృహ వైద్యం చేసుకోవచ్చు.
Health In Home: అనారోగ్య సమస్యల్లో ఎక్కువగా ఆహారం వల్లే వస్తుంటాయి. తిండి ఎక్కువైనా, తక్కువైనా కూడా సమస్యలు తప్పవు. సమతులం ఆహారం, ఆరోగ్యకరమైన జీవనం చాలా సమస్యల్ని అధిగమిస్తుంది. ప్రకృతి ప్రసాదించే ఆహార పదార్ధాలన్నింటిలో ప్రొటీన్లు, విటమిన్లు లభిస్తాయి. ఇవి ఎక్కువగా లభటించే ఆహార పదార్ధాలను తీసుకుంటే దృఢమైన శరీరం, శారీరక బలం లభిస్తాయి. ప్రొటీన్లు కాయగూరలు, పళ్లలో కూడా సమృద్ధిగా లభిస్తాయి. మూత్ర పిండాలలో తలెత్త పలు సమస్యలకు విటమిన్ల లోపం ప్రధాన కారణంగా ఉంటుంది. పాలు, ఫిష్ ఆయిల్, పామాయిల్‌లో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తాయి.
దంపుడు బియ్యంలో విటమిన్ బి ఉంటుంది. బియ్యాన్ని ఎక్కువ సార్లు కడగటం, పాలిష్ చేయడం, గంజి వార్చడం వంటి చర్యలతో అందులో విటమిన్లను కోల్పోవాల్సి వస్తుంది. కేవలం అన్నాన్ని తినడం ద్వారా అందులో కార్బో హైడ్రేట్లు మాత్రమే శరీరానికి అందుతాయి. శరీరానికి అవసరమైన విటమిన్లను వదిలేసి అధిక బరువు, అనారోగ్యానికి కారణమయ్యే కార్బో హైడ్రేట్లు మాత్రమే దక్కుతాయి. పెదవుల చివర పొక్కులు రావడం, తెల్లబడటం వంటి సమస్యలకు విటమిన్ లోపం కారణం. బియ్యంతో వచ్చే పోషకాలు సక్రమంగా శరీరానికి అందితే ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్టే.
వివిధ ఆరోగ్య సమస్యలకు ఇంట్లోనే దొరికే పరిష్కారాలు..
- మనిషికి తరచూ వచ్చే ఆరోగ్య సమస్యలలో జ్వరం ఒకటి, జ్వరం వస్తే నేల వేపచెట్టును ఎండబెట్టి దాని కాషాయం రెండు పూటల తీసుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. మిరియాల కాషాయం కూడా జ్వరానికి ఔషధంగా పనిచేస్తుంది.
- పంటి నొప్పికి వేడి నీటిలో ఉప్పు కలిపి ఆ నీటిని పుక్కిలించడం ద్వారా ఉపశమనం ఉంటుంది. సొంటి, లవంగం ముక్కలను నోటిలో ఉంచడం దవ్ారా కూడా రిలీఫ్ దొరుకుతుంది. మర్రి ఊడ, తుమ్మపుల్ల, వేప పుల్ల, ఉత్తరేణి వేర్లతో పళ్లు తోమడం ద్వారా పళ్ల సమస్యలను అధిగమించవచ్చు.
- కడుపు నొప్పి సమస్యకు పనసగింజలు, కుప్పి చెట్టు ఆకులు ఎండబెట్టి పొడి చేయడం తాగడం ద్వారా నులిపురుగుల సమస్యకు విరుగుడు లభిస్తుంది.
- కామెర్లకు నేల ఉసిరిక, గుంటగలగర, కూటి కలబంద రసం చక్కగా పనిచేస్తాయి. మూడింటిని నూరి ఉసిరికాయంత పరిణామంలో మజ్జిగతో కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గుముఖం పడతాయి. దొండ ఆకు రసం కూడా కామెర్ల వైద్యంలో వినియోగిస్తారు.
- చెవినొప్పి తగ్గడానికి నల్లేరు, సాగా చెట్టు, వెల్లుల్లిని నీటిలో మరిగించి ఆ రసాన్ని ఔషధంగా వాడొచ్చు.
- సొంటి, మిరియాలు, పిప్పళ్లు, జీలకర్ర పొడి చేసి తేనెలో కలిపి తీసుకుంటే జీర్ణకోశ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి.
- విరోచనాలకు వాముపొడిని తాటి బెల్లంతో కలిపి తీసుకోవచ్చు.
- వాంతులు అవుతుంటే యాలకులు, మిరియాలు పొడిచేసి మరిగే నీటిలో కాచి తాగొచ్చు.
- రోజుకూ రెండు సార్లు శుభ్రంగా స్నానం చేయడం వల్ల కూడా చాలా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. భోజనానికి ముందు విధిగా చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా సంపూర్ణ రక్షణ పొందవచ్చు.