Old Saree as Lehenga: అరవై ఏళ్ల నాటి చీరను లెహెంగాలా కుట్టించుకున్న సారా అలీ ఖాన్, మీరు పాతచీరలను ఇలా మార్చేయచ్చు
09 September 2024, 14:00 IST
- Old Saree as Lehenga: బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్.. అంబానీ కుటుంబం నిర్వహించిన గణేష్ చతుర్థి వేడుకల్లో సందడి చేసింది. 60 ఏళ్ల నాటి బ్రోకేడ్ చీరలను లెహెంగాలా కుట్టించుకుని ధరించింది. ఆ లెహెంగా ఎంతో అందంగా ఉంది.
పాతచీరలను లెహెంగాలా మార్చేసిన సారా అలీఖాన్
పాత చీరలు ఎంతో మంది ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటారు. కొన్ని ఖరీదైన చీరలను ఇవ్వాలంటే మనసొప్పదు కానీ పాత చీరలను కట్టుకోలేక ఇలా బయటి వారికి ఇచ్చేసేవారు ఎక్కువ. నిజానికి పాత చీరలకు కొత్త లుక్ ఇవ్వచ్చు. అందుకు సారా అలీఖాన్ వేసుకున్న డ్రెస్ చూడండి. ఆమె వేసుకున్న లెహెంగాను 60 ఏళ్లనాటి పాత చీరలతో తయారుచేశారు. ఆమె అంబానీ కుటుంబంలో నిర్వహించిన గణేష్ చతుర్ధి వేడుకలకు ఈ లెహెంగాలో మెరిసింది. ఈ గణేష్ చతుర్థి వేడుకలకు హాజరైన అనేక మంది ప్రముఖులలో సారా అలీ ఖాన్ ఒకరు. సారా తన సోదరుడు ఇబ్రహీం అలీఖాన్ తో కలిసి ఈ వేడుకకు వచ్చింది. వింటేజ్ బ్రోకేడ్ చీరలతో తయారు చేసిన అద్భుతమైన లెహంగాను ఆమె ధరించారు.
సారా అలీఖాన్ గణేశోత్సవానికి హాజరయ్యేందుకు మయూర్ గిరోత్రా వస్త్రధారణను ఎంచుకుంది. మయూర్ గిరోత్సా ఈ డ్రెస్ లో చోలీ, ఏ-లైన్ లెహంగా, టిష్యూ సిల్క్ దుపట్టాలను జాగ్రత్తగా డిజైన్ చేశారు. డిజైనర్ స్వయంగా సేకరించిన 50 నుంచి 60 ఏళ్ల నాటి ఖరీదైన బ్రోకెడ్ చీరలను ఉపయోగించారు. ఆ చీరలతో లెహంగాను కుట్టినట్టు డిజైనర్ మయూర్ గిరోత్రా తెలిపారు. అతను అనేక రంగుల్లో ఉన్న వింటేజ్ బ్రోకేడ్ చీరలను ప్రత్యేకంగా కొన్నారు. వాటితో ఈ కొత్త లెహెంగాకు రూపం ఇచ్చారు.
సారా లుక్‌ను డీకోడ్ చేయడం
లెహెంగాలో ఎన్నో రంగుల చీరలను ఉపయోగించారు. అందుకే ఏడు రంగుల ఇంద్రధనుస్సులా కనిపిస్తోంది సారా లెహెంగా. ఇక బ్లౌజ్ కోసం ముదురు పర్పుల్ షేడ్ ఉన్న చీరలోని భాగాన్ని కత్తిరించారు. డోరీ టైస్, గోల్డ్ బ్రోకేడ్ ఎంబ్రాయిడరీ, గొట్టా పట్టి బోర్డర్స్ తో జాకెట్ కుట్టారు. నెక్ లైన్, హాఫ్ లెంగ్త్ స్లీవ్స్, క్రాప్డ్ హెమ్ తో బ్యాక్ లెస్ డిజైన్ ను ఈ బ్లౌజ్ కలిగి ఉంది. ఇదిలావుండగా, లెహంగాలో ఊదా, ఆకుపచ్చ, గులాబీ రంగుల్లో ఉన్న చీరలను అధికంగా వాడినట్టు తెలుస్తోంది.
ఇక దుపట్టా విషయానికి వస్తే బంగారు రంగులో మెరిసిపోయే జరీ సిల్క్ దుపట్టా, పింక్ బోర్డర్, జర్దోసి జరీ ఎంబ్రాయిడరీతో తయారుచేశారు. దుపట్టా ఒక చివరను నడుముకు చుట్టి లెహెంగాకు బిగుతుగా దోపింది. మరో చివరను తన చేతికి చుట్టి, సొగసుగా కనిపిస్తోంది. యాక్సెసరీస్ కోసం సారా గోల్డ్ అండ్ పోల్కీ చోకర్ నెక్లెస్, జుమ్కాలు, స్టేట్మెంట్ రింగ్‌ను ఎంచుకుంది.
చివరగా, సారా గ్లామర్ కోసం లైట్ కాటుకతో కళ్లను అలంకరించింది. మస్కారా-అలంకరించిన కనురెప్పలు, ఊదా రంగు బొట్టు, గులాబీ రంగు లిప్ స్టిక్ షేడ్‌తో పెదవులు ఎంతో అందంగా ఉన్నాయి. సింపుల్ హెయిర్ స్టైల్ ఎంచుకుంది.