Healthy Lifestyle | ఆరోగ్యంగా, ఆనందంగా జీవించటానికి మీ జీవనశైలిలో ఈ చిన్న మార్పులు చాలు!
01 August 2023, 10:54 IST
- Healthy Lifestyle Routine: ఆరోగ్య స్పృహతో మీరు తీసుకునే చిన్నచిన్న చర్యలు కూడా మిమ్మల్ని ఎక్కువ కాలం చురుకుగా ఉంచుతాయి, ఎలాంటి ఆనారోగ్య సమస్య లేకుండా జీవించేలా చేస్తాయి.
Healthy Lifestyle Routine
Healthy Lifestyle Routine: జీవితంలో పెద్ద మార్పులు అకస్మాత్తుగా జరగవు, ఆరోగ్యం విషయంలోనూ అంతే. అయితే ఆరోగ్య స్పృహతో మీరు తీసుకునే చిన్నచిన్న చర్యలు కూడా మిమ్మల్ని ఎక్కువ కాలం చురుకుగా ఉంచుతాయి, ఎలాంటి ఆనారోగ్య సమస్య లేకుండా జీవించేలా చేస్తాయి. ఉదాహరణకు, మీరు రోజూ 10,000 అడుగులు నడవాలని ప్లాన్ చేసుకున్నట్లయితే, మొదటి రోజునే మీరు ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలని అనుకోవద్దు. మీరు మీ మనస్సుకు సానుకూల దృక్పథాన్ని కలిగించాలంటే, ఎల్లప్పుడూ చిన్న లక్ష్యాలను పెట్టుకోండి. తొలిరోజు వెయ్యి అడుగులే నడవటానికి ప్రయత్నించండి, మీరు మీ లక్ష్యాన్ని పూర్తిచేసినపుడు మీకు ఒక సంతృప్తి కలుగుతుంది, ఆ తర్వాత, మీ మెదడు న్యూరాన్ల నుండి డోపమైన్ విడుదల అవుతుంది. ఇది మీకు సంతోషాన్నిస్తుంది. మీరు కూడా జీవితం సంక్లిష్టంగా భావిస్తే. మీరు అనుకున్నది సాధించలేకపోతే, ఈ చిన్న విషయాలతో ప్రారంభించండి.
ఒక రోజు ముందే ప్లాన్ చేసుకోండి
రోజులో 24 గంటలు చాలటం లేదని మీరు భావిస్తే, మీకు ఏ రోజు తీరిక లేకుండా ఉంటే, రోజువారీ షెడ్యూల్ ప్లాన్ చేయండి. మీ పనుల కోసం లేదా మీ ఆరోగ్యం కోసం వారంలో ఒక రోజును కేటాయించండి. ఇలా ముందస్తుగా ఒకరోజు ప్లాన్ చేసుకోవడం మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. వివిధ విషయాల్లో స్పష్టత ఉంటుంది. నిద్ర, ఆరోగ్యం బాగుంటుంది. దీనితో పాటు ఉత్పాదకత కూడా పెరుగుతుంది. రేపు చేయవలసిన పనులను ఆ ముందు రోజే రాత్రి షెడ్యూల్ చేయండి. ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వండి.
15 నిమిషాలు నడకకు వెళ్లండి
జీవనశైలి వ్యాధులు ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. చురుకుగా ఉండటం, వ్యాయామం చేయడం వలన మన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చు. రోజూ బ్రిస్క్ వాక్ చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది ఇప్పుడు రోజూ 10,000 అడుగులు నడిచే లక్ష్యంతో ఉంటారు. మీకు ఈ లక్ష్యం సాధ్యం కాకపోతే నిరుత్సాహపడకండి. రోజూ కేవలం 15 నిమిషాలు నడవండి. సూర్యుడిని చూడండి, ఉదయం గాలిని ఆస్వాదించండి. క్రమంగా నడక వేగాన్ని పెంచి వేగంగా నడవడం ప్రారంభించండి. ఇలా వారం రోజుల పాటు కంటిన్యూగా నడుస్తూ సెలవు రోజుల్లో ఎక్కువ దూరం, ఎక్కువ సమయం నడవండి. అప్పుడప్పుడు చెప్పులు లేకుండా నడవండి.
ఒక గ్లాసు నీరు అదనంగా తాగండి
మీరు రోజూ త్రాగే నీటి కంటే 1 గ్లాసు ఎక్కువ నీరు త్రాగటం ప్రారంభించండి. రాత్రిపూట నిద్రలో ఉన్నప్పుడు ఆహార పానీయాలు తీసుకోము కాబట్టి నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు నీరు త్రాగాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖం కూడా తాజాగా ఉంటుంది. శరీరంలో తగినంత నీరు ఉండటం వల్ల అనేక మలినాలు కూడా తొలగిపోతాయి, అలాగే శరీర భాగాలు సరిగ్గా పని చేస్తాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మీరు తాగే నీటిని క్రమంగా పెంచండి.
స్వచ్ఛమైన ఆహారం తీసుకోండి
డైటింగ్‌కు బదులుగా క్లీన్ డైటింగ్ ప్రారంభించండి. అందులో చక్కెర, శుద్ధి చేసిన పిండిని తగ్గించండి. క్రమంగా బయటి ఆహారాలను తగ్గించండి. అయితే చాలా ఆకలితో ఉండకూడదు. ఏదైనా ఆరోగ్యకరమైన స్నాక్స్ లేదా పండు తిని ఆకలి తీర్చుకోవాలి. ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని సమయానికి తింటే బయట తినాలనే కోరిక తగ్గుతుంది. ఎప్పుడైతే మనం ఎక్కువసేపు ఆకలితో ఉంటామో అప్పుడే వివిధ రకాల ఆహార పదార్థాలపై కోరిక ఉంటుంది.
ప్రతి వారం కొత్త ఆరోగ్యకరమైన ఆహారం తినండి
రొటీన్‌గా ఒకటే తినడానికి బదులు మీ డైట్ లో ఏదైనా కొత్తది, పోషకమైన ఆహారాన్ని చేర్చండి. విటమిన్ సి ఉండే పండ్లు, పదార్థాలు తీసుకోండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ ఆరోగ్యానికి, అందానికి రెండింటికీ మేలు చేస్తాయి. ప్రతి వారం వెరైటీ పండ్లను తినండి. మీ డైట్‌లో 2 రకాల డ్రై ఫ్రూట్స్, డార్క్ చాక్లెట్ లేదా ఏదైనా ఆరోగ్యకరమైన వాటిని చేర్చడానికి ప్రయత్నించండి.
బాగా నిద్రపోండి
నిద్రకు మంచి ప్రాధాన్యతనివ్వండి. ప్రతిరోజు రాత్రి 7-8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. అనవసరమైన ఒత్తిళ్లు, ఆందోళనలను నివారించండి. ఎక్కువ దేని గురించి ఆలోచించకండి. ఆరోగ్యానికి వ్యాయామం, ఆహారం, మంచి నిద్ర అని గుర్తించండి.