తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Love Thoughts : ప్రేమ స్వచ్ఛమైనదే.. ప్రేమించిన వ్యక్తులే కలుషితం..!

Love Thoughts : ప్రేమ స్వచ్ఛమైనదే.. ప్రేమించిన వ్యక్తులే కలుషితం..!

Anand Sai HT Telugu

14 February 2023, 4:30 IST

google News
    • Happy Valentine's Day : ఒక వంద మందిని ఎగ్జాంపుల్ తీసుకోండి. అందులో 90 శాతం ప్రేమను నిందించేవారే. 90 శాతం తిడుతున్నారు కదా అని ప్రేమది తప్పై పోతుందా? ప్రేమ ఎప్పుడూ.. స్వచ్ఛమైనదే.. ప్రేమను ప్రేమించిన వ్యక్తుల మనసులే స్వచ్ఛంగా ఉండవ్.
వాలెంటైన్స్ డే
వాలెంటైన్స్ డే

వాలెంటైన్స్ డే

ఇద్దరు మనుషులను ఎక్కువ కాలం కలిసి ఉండేలా చేసేది ప్రేమ. వాళ్లిద్దరి మధ్య ప్రేమ అలానే ఉంటుంది. కానీ వారి ఆలోచన విధానాలే మారుతాయి. ఇక్కడ తప్పు.. వ్యక్తులదే.. ప్రేమను ప్రేమగా ప్రేమిస్తే.. మళ్లీ ప్రేమే ఇస్తుంది. ఈ విషయం తెలుసుకోకుండా.. ఏ ఇద్దరూ విడిపోయినా.. ముందుగా తిట్టేది ప్రేమనే. కలిసి ఉండేందుకు కారణమయ్యేది ప్రేమ. విడిపోయేందుకు కారణం.. ఇద్దరి ఆలోచనలు. ఆ ఆలోచనలు పాజిటివ్ గా ఉంటే లవ్ పెరుగుతుంది. లేకపోతే.. ఉన్న ప్రేమ నాశనం అవుతుంది.

ప్రేమికుల రోజు అనేది వస్తూ ఉంటుంది.. పోతూ ఉంటుంది.. కానీ ప్రేమ మాత్రం.. ప్రతిరోజూ ఉంటుంది. ఒక రోజు జరుపుకొనేది మాత్రమే ప్రేమ అయితే.. ఇన్ని వందల ఏళ్లుగా ఎన్నో జంటలు కలిసి ఎలా ఉంటాయి. ప్రతి దాంట్లో ప్రేమ ఉంటుంది. ప్రేయసి దూరమైన రోజున చివరి శ్వాస విడిచిన ప్రేమికులకు తెలుసు.. ప్రేమ గొప్పతనం ఏంటో..! ప్రియుడిని పెళ్లిచేసుకోలేక.. నరకంలో బతుకుతున్నామని ఫీల్ అయ్యే ప్రేయసికి తెలుసు.. ప్రేమ విలువ ఏంటో..! ప్రేమిస్తే.. వచ్చేది ప్రేమే. అనవసరమైన ఆలోచనలు పెట్టుకుంటే.. అయ్యేది గుండె భారమే.

ప్రేమంటే పొందడం మాత్రమేనా.. కాదు కాదు.. ప్రేమ అంటే ఇవ్వడం.. కొన్నిసార్లు వదిలేయం కూడా ప్రేమే. ప్రేమ అంటే అర్థం చెప్పలేని అనుభూతి.. కవులు ఎంత చెప్పినా.. తీరని దాహార్తి.. కొన్నిసార్లు వర్ణించేందుకు అక్షరాలు కూడా దొరకని పారే నది..! ప్రేమిస్తే.. తప్ప.. ఆ ఫీల్ తెలుసుకోవడం కష్టం. ప్రేయసి చూపు.. ప్రియుడి స్పర్శ.. ఇలా ఎన్నో చిన్న చిన్న ఆనందాలను ఇస్తుంది ప్రేమ.

ప్రేమించడం అనేది ఓ అద్భుతమైన వరం. కొంతమంది దానిని సరిగా ఉపయోగించుకుంటే.. మరికొంతమంది అవసరాల కోసం మాత్రమే.. చూస్తారు. ఇక్కడ ప్రేమ తప్పు లేనేలేదు. వ్యక్తులదే తప్పంతా. కళ్లకు నచ్చారు కదా అని.. సోంతం చేసుకోవడానికి, వారితో సంబంధాన్ని కొనసాగించేందుకు, అవసరం కోసం, ఆర్థిక లాభం కోసం.. జీవిత బంధాన్ని ఏర్పరుచుకునేది కాదు ప్రేమంటే.

ఎవరికోసమైతే.. మనసు నిజంగా స్పందిస్తుందో.. వారికోసం ఏదైనా చేయగలగడం ప్రేమలో భాగం. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా కేవలం వారి ఆనందం కోసం చూడటం ప్రేమ. అందుకే పట్టుకోవడం మాత్రమే ప్రేమ కాదు.. కొన్నిసార్లు వదిలేయడం కూడా ప్రేమే. అలాంటి వారు కలిసి ఉన్నా.. విడిపోయినా.. ప్రేమించుకుంటూనే ఉంటారు. పెళ్లితో ముగిసేది కాదు.. ప్రేమంటే.. అంతకుమించి.. నేను ఉన్నా.. అని భరోసానిచ్చేది ప్రేమ.

ప్రేమ గురించి ఎంత చెప్పినా.. ఇంకా ఏదో మిగిలి ఉన్నట్టే.. అందుకేనేమో ఇంకా ప్రేమ మిగులుతోంది..!

Happy Valentine's Day

తదుపరి వ్యాసం