Hair Oiling: ఒత్తైన జుట్టు కోసం ఏం చేయాలి? తలకి నూనె ఎలా రాసుకోవాలి?
28 February 2022, 16:54 IST
- ఒత్తైన నల్లటి జుట్టు కావాలని ఎవరికి మాత్రం ఆశ ఉండదు చెప్పండి. కానీ, ఈ బిజీ జీవితంలో మనకు కావాలని ఉన్న వాటిని పొందలేకపోతున్నాం. కాస్త సమయం వెచ్చిస్తే చాలు అందమైన జుట్టు మన సొంతం అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టుకి నూనె ఎలా రాయాలి?
జుట్టుకి నూనె రాస్తే మంచిదని చాలా మందికి తెలుసు. కానీ, తలస్నానం చేసే ముందు రోజు రాత్రి మాత్రమే మనం జట్టుకి నూనె రాస్తాం. అది కూడా రాస్తే మంచిది కదా అన్నట్లు ఏదో అలా అలా రాసేస్తాం. నూనె జుట్టుకు మంచి మాయిశ్చరైజర్ గా ఉండడంతోపాటు జుట్టుకు తగినంత బలాన్ని కలిగిస్తుంది. నూనెను అధిక మొత్తంలో తల మాడుకు అంటుకునే విధంగా రాయడం వల్ల జుట్టు మరింత బలంగా తయారవుతుంది. ఈ క్రమంలోనే జుట్టు రాలడానికి ఆస్కారం ఉండదు.
మన శరీరానికి నూనె ఏ విధంగా అవసరమో జుట్టుకు కూడా అంతే అవసరమని పలు పరిశోధనల్లో తేలింది. ఈ క్రమంలోనే తలకు బాగా నూనెను రాసి మర్దనా చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టుకు తగిన బలాన్ని ఇస్తుంది. అలాగే వెంట్రుకలకు కాస్త గోరువెచ్చని నూనెను రాయడం ఎంతో మంచిది.
తలస్నానం ఎప్పుడు చేయాలి
ఒకవేళ మామూలు నూనె పట్టినప్పిటికీ తర్వాత కాస్త ఆవిరిపట్టించాలి. అనంతరం మన జుట్టుకు కండీషనర్ తో తలంటు స్నానం చేయాలి. తలకు నూనె పెట్టిన రెండు మూడు రోజుల తర్వాత తలస్నానం చేయకూడదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
తల స్నానానికి రెండు గంటల ముందైనా సరే జుట్టుకు నూనె పట్టించండి. కుదిరితే ముందు రోజు రాత్రి నూనె రాసి పొద్దున్నే తల స్నానం చేయాలి. ఒక్కోసారి సమయం లేక కొంతమంది తలకి నూనె పెట్టుకోకుండా తల స్నానం చేసేస్తారు. ఇలా చేయడం వల్ల దుమ్ము, ధూళి తలలో పేరుకొని జుట్టును బలహీనంగా మారుస్తాయి. దీంతో జట్టు రాలడం ప్రారంభం అవుతుంది. కాబట్టి నూనె రాసిన తరువాత కొంత సమయం ఆగి తలస్నానం చేస్తే మంచిది. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
జుట్టు పెరగడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి:
* పాలు, కూరగాయలు, బచ్చలికూర, క్యారెట్లు, బీన్స్ తీసుకోవచ్చు.
* జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం వంటి డ్రై ఫ్రూట్స్.
* ఆపిల్, ఆరెంజ్, దానిమ్మ, బెర్రీ, అవకాడో, అరటి, చిలగడదుంప లాంటి సీజనల్ పండ్లు.
* మాంసాహారులైతే గుడ్లు, చేపలు తినాలి.
* తగినంత ఎక్కువ నీరు తాగాలి.
ఏం చేయకూడదు:
* షాంపూతో తలస్నానం తర్వాత సహజసిద్ధంగా జుట్టుని ఆరనివ్వండి. వెంట్రుకలు ఆరబెట్టేందుకు హెయిర్ డ్రయ్యర్ లాంటివి వాడరాదు.
* వారానికి రెండు సార్లు కంటే ఎక్కువ తలస్నానం చెయ్యకండి.
* తలస్నానం చేసినప్పుడు అవసరానికి మించి ఎక్కువ షాంపూని వాడవద్దు. దీనివల్ల చుండ్రు వచ్చే సమస్య ఉంటుంది.