Tuesday Motivation: అందానికి వయసు తక్కువ గుణానికి ఆయుష్షు ఎక్కువ, మీకు ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి
03 September 2024, 5:00 IST
- Tuesday Motivation: ప్రేమకైనా, స్నేహానికైనా చూడాల్సింది అందం కాదు... గుణం. గుణం కలకాలం ఒక మనిషి వెన్నంటే ఉంటుంది. అందం వయసు ఉన్నంతవరకే ఉంటుంది.
మోటివేషనల్ స్టోరీ
Tuesday Motivation: ఎంతోమంది అందమైన రూపానికే ఆకర్షితులవుతారు. గుణం బయటికి కనబడదు. రూపం కంటికి కనిపిస్తుంది. అందుకే రూపాన్ని చూసి స్నేహితులను, ప్రేమికులను ఎంచుకునేవారు ఎంతోమంది. పెళ్లి సంబంధాల్లో కూడా మొదట రూపాన్ని చూస్తారు. నిజానికి చూడాల్సింది సుగుణం. కానీ ఈ విషయం ఎంతో మందికి తెలిసిన గుణం కన్నా రూపాన్ని చూసి మోసపోయే వారే ఎక్కువ.
రూపం, గుణం... ఈ రెండిట్లో ఏది గొప్ప అంటే కచ్చితంగా గుణం అని చెప్పాలి. మంచి గుణం మరణం వరకు మారకుండా ఉంటుంది. కానీ రూపం వయసులో ఉన్నంతవరకే ఉంటుంది. కాబట్టి శాశ్వతంగా ఉండేది ఎంచుకోవాలి.
ఒక శ్లోకంలో మానవులకు ఆభరణం రూపం అని చెప్పారు, కానీ రూపానికి ఆభరణం సుగుణమని చెప్పారు. కాబట్టి మంచి గుణాలున్న వ్యక్తిని ఎంచుకుంటే జీవితాంతం సుఖంగా ఉంటారు.
ఒక వ్యక్తి గౌరవాన్ని పొందాలంటే అతని అందాన్ని చూసి ఎవరైనా గౌరవం ఇవ్వరు. అతని గుణాలను చూసి గౌరవాన్ని ఇస్తారు. కేవలం రూప సౌందర్యం మీకు ఎలాంటి మంచి ఖ్యాతిని తెచ్చిపెట్టదు. కానీ గుణం మాత్రం ఎంతోమందిని మీకు చేరువ చేస్తుంది. ఆత్మీయులను తెచ్చిపెడుతుంది.
తన దగ్గర ఉన్న డబ్బును చూసి మిడిసి పడేవారు, తమ అందాన్ని చూసి ఎగసిపడేవారు తెలుసుకోవాల్సింది.. ఆ రెండింటి కన్నా గొప్పది సుగుణం. ఖర్చు పెడితే డబ్బు కరిగిపోతుంది. వయసు ముదిరితే అందం తరిగిపోతుంది. కానీ వయసు పెరిగే కొద్దీ ప్రకాశించేది మంచి లక్షణాలు. అవూ మీకు ఆభరణంలో జీవితాంతం వెన్నంటి వస్తుంది.
ఒక వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే అతడి రూపాన్ని చూసి తెలుసుకోలేరు. అతని గుణాలను చూసే అంచనా వేయాలి. సుగుణం మిమ్మల్ని రాజుని చేస్తే, మూర్ఖత్వం బానిసను చేస్తుంది. సుగుణాలే మీ జీవితాన్ని అందంగా మారుస్తాయి.
చాలామందికి ఉన్న సందేహం అసలు సుగుణం అంటే ఏమిటి? సుగుణం అంటే మంచి స్వభావం కలిగి ఉండడం, ఇతరులను బాధ పెట్టకపోవడం, తెలిసీ తెలియక చేసిన తప్పుల ద్వారా కూడా ఇతరులకు హాని కలగకుండా ఉండడం, ఏ పరిస్థితుల్లో అయినా నిజాయితీగా ఉండడం, ఎదుటివారికి సాయం చేయడం, నమ్మి వచ్చిన వారిని కాపాడుకోవడం.
వాల్మీకి రాసిన రామాయణంలో రామునికి 16 సుగుణాలు ఉన్నాయని చెబుతాడు. ఆ సుగుణాలలో సత్య వాక్య పరిపాలన, ఉత్తమ చరిత్ర కలవాడు, ఇతరుల హితము కోరేవాడు, సమర్ధుడు, అసూయ లేనివాడు, కోపం లేని వాడు, వీరుడు ఇలా ఎన్నో గుణాలు ఉన్నాయి. ఎదుటివారికి హాని కలిగించనిది ఏదైనా మంచి సుగుణమే.
కాబట్టి స్నేహితుడిని, స్నేహితురాలినో ఎంచుకునే క్రమంలో లేదా ప్రేమించే సమయంలో, పెళ్లి చూపుల వేళ రూపాన్ని చూసి మోసపోకండి. సుగుణాలను చూసి ముందుకెళ్లండి. ఇది మీ జీవితాన్ని ఎంతో సుఖమయం చేస్తుంది.