తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Motivation: ఆశపడండి తప్పులేదు, కానీ అత్యాశ పడితే మిగిలేది ఆకలే

Friday Motivation: ఆశపడండి తప్పులేదు, కానీ అత్యాశ పడితే మిగిలేది ఆకలే

Haritha Chappa HT Telugu

19 January 2024, 5:00 IST

google News
    • Friday Motivation: చాలామంది అత్యాశ వల్ల సర్వం కోల్పోతూ ఉంటారు. ఆశపడవచ్చు కానీ అత్యాశతో మాత్రం అన్ని అనర్ధాలే.
ఫ్రైడే మోటివేషనల్ స్టోరీ
ఫ్రైడే మోటివేషనల్ స్టోరీ (Pexels)

ఫ్రైడే మోటివేషనల్ స్టోరీ

Friday Motivation: ఒకరోజు వాతావరణం చాలా వేడెక్కింది. అడవిలో ఉన్న సింహానికి ఎంతో ఆకలిగా ఉంది. గుహలోంచి బయటకు వచ్చి చుట్టూ చూసింది. ఎలాంటి జంతువులు కనబడలేదు. పొట్టలో పేగులు మెలిపెడుతున్నాయి. ఏదో ఒకటి వేటాడి తినాలన్న కోరికతో అడవిలోకి వెళ్లింది. సింహం కొంత దూరం వెళ్లేసరికి చిన్న కుందేలు కనిపించింది. ఆ కుందేలును తింటే సింహానికి పూర్తిగా ఆకలి తగ్గకపోవచ్చు, కానీ ఎంతో కొంత ఆకలి అయితే తగ్గుతుంది. సింహం ఆ కుందేలును పంజాతో పట్టింది, కానీ చంపలేదు. ఈ లోపు దాని కంట్లో ఒక జింక పడింది. కుందేలు తినడం వల్ల పొట్ట నిండదు కదా అని కుందేలును వదిలిపెట్టింది. దీంతో కుందేలు ప్రాణ భయంతో పారిపోయింది.

కుందేలు పరిగెట్టడం చూసిన జింక కూడా పరుగందుకుంది. సింహం చాలా దూరంగా ఉన్నప్పుడే జింక చూసింది కాబట్టి ఎంతో వేగంగా పరిగెడుతూ చెట్ల పొదల్లో నుంచి పారిపోయింది. చిన్న కుందేలును తింటే పొట్ట నిండదని పెద్ద జింక కోసం ఆశపడింది సింహం. జింక వెళ్లిన దారివైపు పరుగులు పెట్టింది. కానీ అది అడవిలో ఎక్కడో అదృశ్యం అయిపోయింది. వెనక్కి చూస్తే కుందేలు కూడా పోయింది. ఇప్పుడు సింహానికి ఆకలి మరింత ఎక్కువయింది. అనవసరంగా జింకను చూసి కుందేలును వదిలేసాను అని బాధపడింది. అత్యాశ పడకుండా ఆ కుందేలును తిన్నా తన ఆకలి ఎంతో కొంత తీరేది, శరీరానికి ఎంతో కొంత శక్తి అందేదని అనుకుంది సింహం.

అత్యాశ పడడం వల్ల సింహం లాగే ఆకలి మిగులుతుంది. కాబట్టి ఆశపడండి కానీ అత్యాశకు దూరంగా ఉండండి. అత్యాశ ఒక వ్యాధి లాంటిది. అది పట్టిందంటే మనిషి ప్రశాంతంగా ఉండనివ్వదు. నిత్యం ఏదో ఒక ఆలోచనలతో తొలిచేస్తూ ఉంటుంది.

దురాశ దుఃఖానికి కారణం అని ఎప్పుడో చెప్పారు గౌతమ బుద్ధుడు. అలాగని కోరికలు లేని మనిషి ఉండరు. కోరికలు ఉండడంలో తప్పులేదు. ఆ కోరికలను తీర్చుకునేందుకు అత్యాశగా ప్రవర్తించడమే తప్పు. ప్రతి మనిషి తనకు ఉన్నంతలో సర్దుకుపోవాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక మార్గంలో నడిచి ఎలాగైనా గొప్పవాడిని అవ్వాలని, అనుకున్నది దక్కాలని ప్రయత్నిస్తే అది అత్యాశ, దురాశ అవుతుంది.

చాలామంది చీమంత పనిచేసి, కొండంత లాభం రావాలని కోరుకుంటారు. ఇదే అత్యాశ. మీరు ఎంత పని చేశారో అంతే ఫలితాన్ని అనుభవిస్తారని గుర్తుపెట్టుకోండి. అలానే ఒక్కోసారి ఆశించిన ఫలితం రాకపోవచ్చు. దానికి నిరాశ పడకూడదు. అత్యాశ పడడం ఎంత తప్పో, నిరాశలోకి వెళ్లడం కూడా అంతే తప్పు.

అత్యాశ ఎంత ప్రమాదకరమైనదంటే మిమ్మల్ని ఈ భూమి మొత్తానికి రాజును చేసినా కూడా మీ కోరిక అక్కడితో ఆగదు. ఆకాశం వైపు చూసి ఆ ఆకాశాన్ని కూడా ఏలాలని చూస్తారు. ఆకాశంలోని నక్షత్రాలను కూడా ఒడిసి పట్టాలని అనుకుంటారు. అందుకే అత్యాశను మీ మనసులోకి రానివ్వకుండా చూడండి. మీ ఆశలను, ఆశయాలను సాధించడానికి ప్రయత్నించండి.

తదుపరి వ్యాసం