Friday Motivation : మనసులోని మాటను.. ధైర్యంగా చెప్పండి.. భయపడకండి..
27 January 2023, 4:00 IST
- Friday Motivation : మన జీవితం చాలా చిన్నది. అలాంటప్పుడు భావాలు మనలోనే దాచుకోవడం ఎందుకు? మీరు ఏమి ఫీల్ అవుతున్నారో ఎదుటివారికి చెప్పడానికి ఎప్పుడూ వెనకడుగు వేయకండి. ఎందుకంటే రేపన్నా రోజు మీరు చెప్పాలి అనుకున్నా.. ఆ వ్యక్తి మీతో ఉండకపోవచ్చేమో. లేదంటే మనమే ఉండకపోవచ్చు. ఇప్పుడు.. ఈ క్షణం మీకు ఏమి అనిపించినా.. అది మంచి అయినా.. చెడు అయినా చెప్పేయండి.
కోట్ ఆఫ్ ద డే
Friday Motivation : మన మాటలు అందరూ అర్థం చేసుకుంటారని రూల్ లేదు. అర్థం చేసుకోవాలని కూడా లేదు. అలాంటప్పుడు ఎదుటివారు ఎలా తీసుకుంటే ఏముంది. మీ మనసులో ఫీలింగ్‌ని ఈరోజే చెప్పేయండి. అది వారు అర్థం చేసుకున్నా.. చేసుకోకున్నా.. మీ మాటలు వారికి చేరేలా చూడండి. ఎందుకంటే వారు మనకి అందుబాటులో లేనప్పుడు.. కనీసం వారికి నా మనసులోని మాట చెప్పేసి ఉంటే బాగుండేది అని బాధపడతారు. ఒకవేళ వారిని మీరు జీవితంలో కలవలేకపోతే.. మీ మాటలు చెప్పనందుకు మిమ్మల్ని మీరు రోజు నిందించుకుంటారు. కాబట్టి ఈ చిన్న లైఫ్‌లో మీ మనసుకు నచ్చింది చేయడం ఎంత ముఖ్యమో.. మీ మనసులోని మాట చెప్పడమూ అంతే ముఖ్యమని గ్రహించండి.
ఒక్కోసారి మన భావాలు వ్యక్తం చేయడం లేట్ అయితే దాని పరిణామాలు వేరే ఉంటాయి. మనం చెప్పే సరికి అవతలి వ్యక్తి మనకి పూర్తిగా దూరమైపోవచ్చు. లేదా జీవితంలో వారు మనకి దొరికే ఛాన్స్ ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మనం చెప్పాల్సిన భావాలు చెప్పలేకపోతే.. ఇతరులు మీ ప్లేస్‌ని భర్తీ చేసే అవకాశముంది. అప్పుడు కూర్చొని అయ్యో అని బాధపడడం కన్నా.. ఓ వ్యక్తి మీతో ఉన్నప్పుడు మీలోని ఫీలింగ్స్ నిర్భయంగా చెప్పండి. అది మంచి అయినా.. చెడు అయినా.. నిజం అయినా వారి మొహం మీదనే చెప్పేయండి.
కొందరు మూడో వ్యక్తితో తమ భావాలను చెప్పిస్తూ ఉంటారు. మీ మాటలను ఇతరులతో చెప్పించాలి అనుకుంటే మీ భావం అవతలి వారికి కరెక్ట్‌గా చేరదు. మూడో వ్యక్తితో కాకుండా.. మీరే నేరుగా వారితో మాట్లాడండి. లేదంటే మనస్పర్థలు మరింత ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. మంచో.. చెడో మీరే తెగించి మాట్లాడేయండి. ఇద్దరి మధ్య మూడోవ్యక్తి మాటలు అందిస్తే.. అది డైల్యూట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఏమి అనిపిస్తుందో చెప్పడానికి ఎప్పుడూ భయపడకండి.
ప్రతి క్షణం జీవితంలో చివరి క్షణంగా బతకండి. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేను అనిపిస్తే కచ్చితంగా చెప్పేయండి. అలా చెప్పగలిగినప్పుడే మీరు నిజంగా బతుకుతున్నట్లు లెక్క. ఎదుటివారు హర్ట్ అవుతారనో.. మీకు ధైర్యం సరిపోవట్లదనో.. మీ ఫీలింగ్స్‌ని ఎప్పుడూ కంట్రోల్ చేయకండి. మీరు చెప్పేది తప్పు కాదు అనిపిస్తే.. మీరు కచ్చితంగా ఎదుటివ్యక్తికి ఆ విషయం చేరాలి అనుకుంటే.. మీరు మీ గొంతు ఎత్తి చెప్పండి. అది మీ జీవితంలో గొప్ప విషయాలను సాధించడంలో సహాయపడుతుంది. మీ భావోద్వేగాలను దాచుకోవాలని చూస్తే.. మనం చెప్పే ఛాన్స్ ఎప్పటికీ రాదు. అందుకే మీరు నిజాలు మాట్లాడాలి. స్వచ్ఛమైన మీ భావాలు చెప్పడంలో తెలివిగా ఉండాలి. మీ భావాలను బహిర్గతం చేయడానికి ఎప్పుడూ సిగ్గుపడకండి. ముఖ్యంగా భయపడకండి. మీ ఫీలింగ్స్ చెప్తే ఎదుటివారు జడ్జ్ చేస్తారేమో అని అస్సలు భయపడకండి. జరిగేది ఎలాగో జరగక మానదు. విధిని ఎలానో మార్చలేము. సో చెప్పేస్తే పోయేదేముంది. కనీసం చెప్పగలిగాను అనే సంతృప్తి అయినా ఉంటుంది.