తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eating Habits For Sleep । హాయిగా నిద్రపోవాలనుకుంటే.. మీ ఆహారపు అలవాట్లు ఇలా మార్చుకోండి!

Eating Habits for Sleep । హాయిగా నిద్రపోవాలనుకుంటే.. మీ ఆహారపు అలవాట్లు ఇలా మార్చుకోండి!

HT Telugu Desk HT Telugu

29 June 2023, 20:00 IST

google News
    • Eating Habits for Sleep: ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా మీరు మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు. నిద్రకు ముందు ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి అనేది ఇక్కడ తెలుసుకోండి.
Eating Habits for Sleep
Eating Habits for Sleep (istock)

Eating Habits for Sleep

Eating Habits for Sleep: ఇటీవల చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. విపరీతమైన ఆలోచనలు, దీర్ఘకాలికమైన ఒత్తిడి, భవిషత్తుపై భయాందోళనలు, అనారోగ్య సమస్యలు, ఇతరత్రా కారణాల వలన నిద్రపై ప్రభావం పడుతుంది. అయితే, మీరు రోజూ తినే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా మీరు మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు, ప్రశాంతంగా నిద్రపోవచ్చు, ఆ తర్వాతి ఉదయం తాజాదనంతో మేల్కోవచ్చు.

నిద్రకు ముందు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మీ నిద్ర నాణ్యతపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మరోవైపు కొన్ని ఆహారాలు నిద్రను చెడగొడతాయి. కాబట్టి మంచి నిద్ర పొందడానికి మీరు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, వేటిని తీసుకోకుండా ఉండాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకోండి.

నిద్రకు ముందు ఆహారపు అలవాట్లు

ట్రిప్టోఫాన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. ట్రిప్టోఫాన్ అనేది అమైనో ఆమ్లం, సెరోటోనిన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది, ఇది నిద్రను నియంత్రించే న్యూరోట్రాన్స్‌మిటర్. పాలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, సీఫుడ్, గింజలు, ఆకుపచ్చని కూరగాయలు, కివీఫ్రూట్, యాపిల్స్, అరటిపండ్లు, అవకాడో వంటి ఆహారాలలో ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉంటుంది, మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది.

రోజులో మీరు చేసే చివరి భోజనం ఎప్పుడూ నిద్రపోయే సమయానికి కనీసం రెండు, మూడు గంటల ముందు పూర్తి చేయాలి. అంటే డిన్నర్ చేసిన 2-3 గంటల తర్వాత నిద్రపోవాలి. తినగానే నిద్రపోకూడదు, ఆలస్యంగా తినకూడదు. ఈ నియమం మీకు మంచి నిద్రకు ఉపకరిస్తుంది.

హైడ్రేటెడ్‌గా ఉండండి, పగటిపూట తగినంత నీరు త్రాగడం వల్ల మీరు హైడ్రేట్‌గా ఉండేందుకు, డీహైడ్రేషన్-సంబంధిత నిద్ర అంతరాయాలను నివారించడంలో సహాయపడుతుంది.

హెర్బల్ టీ తాగండి, పడుకునే ముందు క్యామోమైల్ లేదా వలేరియన్ రూట్ టీ వంటి హెర్బల్ టీని తాగడం వల్ల మీరు వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. లేదా గోరువెచ్చని పాలు తాగటం కూడా మంచి నిద్రను ప్రేరేపిస్తుంది.

నిద్రకు ముందు నివారించాల్సినవి

రాత్రికి విందు భోజనం చేయకండి. పడుకునే ముందు భారీగా తినడం వల్ల నిద్రపోవడం కష్టమవుతుంది. నిద్రవేళకు కొన్ని గంటల ముందు తేలికపాటి భోజనం తినడం మంచిది. వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి. అలాగే కారం లేదా పులుపు ఆహారాలకు దూరంగా ఉండండి. స్పైసీ లేదా ఆమ్ల ఆహారాలు అజీర్ణం లేదా గుండెల్లో మంటను కలిగిస్తాయి, ఇది నిద్రపోవడం కష్టతరం చేస్తుంది.

రాత్రి పూట పిజ్జా, బర్గర్ వంటివి తినడం మానుకోండి. పిజ్జాపై వెన్న, టమోటా ముక్కలు ఎక్కువగా వేస్తారు. ఇందులో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది నిద్రలేని రాత్రులకు దారి తీస్తుంది.

మీ ఆల్కహాల్ మోతాదును పరిమితం చేయండి. ఆల్కహాల్ వలన వచ్చే మత్తు మీకు మొదట్లో నిద్రపోవడానికి సహాయపడగలిగినప్పటికీ, అది తర్వాత నడిరాత్రిలో మీ నిద్రకు భంగం కలిగిస్తుంది. ఆల్కహాల్ పరిమితం చేయడం లేదా పూర్తిగా నివారించడం ఉత్తమం.

కెఫీన్‌ను నివారించండి. కెఫీన్ మీ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ మొదలైన కెఫీన్ కలిగిన పానీయాలను మధ్యాహ్నం తర్వాత నివారించండి.

ఈ చిట్కాలను పాటించండి, రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, వేళకు నిద్రపోవడం అలవాటు చేసుకోండి. ఇవన్నీ మీకు మంచి రాత్రినిద్రను కలిగిస్తాయి, మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతాయి.

తదుపరి వ్యాసం